Vivekame Vijayam

వివేకమే విజయం
Posted On:1/17/2015 12:48:56 AM
ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాం. ఒంటరిగానే లోకం నుంచి వెళ్లిపోతాం. నిత్య జీవన రణరంగాన్ని ఒంటరిగానే ఎదుర్కొంటాం. పోరాడుతాం. చరిత్రలో ఒకే కురుక్షేత్రం జరిగిందేమో గానీ, జీవనక్షేత్రాల్లో ఎన్నో యుద్ధాలు. ఎల్లప్పుడూ సంసిద్ధమై మనిషి ఆజన్మాంతం జీవన సమరాన్ని ఎదుర్కొంటూనే ఉంటాడు. ప్రతి గెలుపునూ ఆత్మ సంయమనంలా మలుచుకుంటూ, ప్రతి ఓటమిలో గుణపాఠాన్ని నేర్చుకుంటూ బతుకుతాడు. అయితే ఎంతైనా సామాజ్య మానవుని చుట్టూ నిరాశా నిస్పృహలు తిరుగూనే ఉంటాయి. ఎప్పుడు ఆవరించి బలహీనపరిచే అస్ర్తాలను వదులుదామనే ఆలోచన చేస్తుంటాయి.ఆ సమయంలో మనిషి మానసిక సంకల్పం, శక్తియుక్తులు ఏకమై అనేకంలా కదనరంగంలో తమ ప్రతాపాన్ని చూపిస్తాయి.
వివేకమేవ సచివం ధనురేవ వరూధినీమ్
బాహుమేవ రణోత్సాహే యస్సహాయమమన్యత

మనిషికి యుద్ధ సమయంలో తన వివేకమే మంత్రి. తన చాపమే సైన్యం. తన చేతులే అంగరక్షకులు. కార్యసాధనలో నిరాటంకంగా సాగే బుద్ధి మనిషిని అన్ని వైపులా కవచమై కాపాడుతుంది. సమర్థవంతంగా సమస్యల వలయాన్ని ఛేదించేందుకు తనలోని అపారశక్తులే మహిమగల అస్త్రశస్ర్తాలై జీవన రంగాన్ని విజయవంతం చేస్తాయి.
జీవితం అందమైనది. అంతే దుర్లభమయింది. నిత్య జీవన యుద్ధంలో ప్రతి సమస్య ఎదురైనప్పుడు ఒక్కో అస్త్రమై మనసును గాయపరుస్తుంది. ఎలా బయటపడాలనే తాపత్రయంలో మస్తిష్కాన్ని మభ్యపెడుతుంది. విధి దెబ్బలు కొడుతూనే ఉంటుంది. కానీ చంపదు. మోహం ఆవరిస్తుంది. కానీ చైతన్యం నశించదు. అలాంటి సమయాల్లో మనిషిలోని దృఢ విశ్వాసం, భగవంతుడున్నాడనే మానసిక ధైర్యం, బంధువుల సహకారం, నిశ్చయమైన ఆలోచనాధోరణి అద్భుత శక్తినిచ్చి ప్రతి సమరంలో విజయభేరిని మోగిస్తాయి.
మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.

గులాబి పువ్వు ముల్లుతోనే చిగురిస్తుంది. జీవి తం కూడా సుఖ దుఃఖాల సమన్వయంతోనే ముందుకెళ్తుంది. సుఖంలోనే ఆనందిస్తూ రోజులు గడపలేము. దుఃఖంతోనే జీవితం ముగిసిపోదు. ప్రతీ రోజూ కొత్తదైన అనుభవాన్నీ, సరికొత్త సవాళ్లనూ మన ముందుంచుతుంది. నిర్ణయాత్మక ఆలోచన, దృఢమైన సంకల్పం తోడవ్వగా అడుగడుగునా తనదైన శక్తియుక్తులు ఆధారమవగా మనిషి మహా రుషిలా, మహనీయుడిలా ఎదిగి జీవనక్షేత్రాన్ని విజయాల ఫలంలా ఆస్వాదించగలడు. తృప్తి నిండిన హృదయంతో జీవించగలడు.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి