Posted On:1/20/2015 1:45:31 AM
|
ఆశలను చిగురింపజేస్తుంది. ఆశయాలను తలపింపజేస్తుంది. అభివృద్ధిని చేకూర్చుతుంది. సన్మార్గంలో పయనింపజేస్తుంది. అందుకే స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం, స్నేహానికన్న మిన్న లోకాన లేదు అనే మాటలు పాటలుగా ప్రసిద్ధికెక్కాయి.మంచి మిత్రులు ఎట్లా ఉంటారో భర్తృహరి స్వీయ నీతిశతకంలో నిర్వచించారు.
పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీ కరోతి
ఆపద్గతంచ నజహాతి దదాతి కాలే
సన్మిత్రలక్షణమిదం ప్రవదన్తి సన్తః ॥
పాపకార్యాల నుంచి నివారింపజేస్తూ హితాన్ని కలిగించే సత్కార్యాలలో ప్రవర్తింపజేస్తూ, రహస్యాలను రహస్యంగా ఉంచుతూ, సద్గుణాలను అందరికీ తెలియజేస్తూ, ఆపదల్లో చిక్కుకున్నప్పుడు వదిలిపెట్టకుండా, అవసరాలకు తగినట్లుగా సహాయం చేసే వ్యక్తులే సన్మిత్రులుగా పేర్కొనదగినవారని భర్తృహరి సన్మిత్రుల లక్షణాలను ప్రకటించారు.
స్నేహంలో ఎక్కువ తక్కువలుండవు. అంతరంగ స్నేహితుడుగా రూపుదిద్దుకున్న వ్యక్తి ధనికుడా? పేదవాడా? కష్టాల్లో ఉన్నాడా? లేక సుఖ పడుతున్నాడా? అనే ఆలోచన కలుగదు.
భోగభాగ్యాలతో సుఖసంపదలతో, అన్నివిధాల ఉన్నతుడైన వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి అనే స్వార్థభావన కూడా ఏర్పడదు. పైగా యథార్థ స్నేహితులు ఒకరి శ్రేయస్సుకై మరొకరు తమ సుఖాలను, ధనాన్ని, సమయాన్ని, చివరకు తమ దేహాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడుతారు. సుఖదుఃఖాలను కూడా సమంగా పంచుకుంటారు అని వాల్మీకిమహర్షి కిష్కింధకాండలో తెలిపారు. ఇట్టి స్నేహసంపదను కలిగియుండుటకై ప్రయత్నిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment