Aakarshana Aacharana

ఆకర్షణ-ఆచరణ
Posted On:1/14/2015 1:47:45 AM
మనం చేసే పనులలో కొన్ని మన ఆచరణను ప్రతిబింబించేవిగా ఉంటాయి. మరికొన్ని ఇతరులను ఆకర్షించడానికి చేసేవిగా ఉంటాయి. ఆకర్షణ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ పూలలో సువాసన, మెత్తదనం ఉండనట్టే లోకంలో ఆకర్షణీయంగా కనిపించేవాటిలో శాశ్వతమైన ఆనందానుభూతులు ఉండవు.
ఆకర్షణకు లొంగేవారికి సుఖశాంతులు లభించవు. ఆచరణపరులకు సమాజంలో గౌరవ మర్యాదలు, శాంతిసౌఖ్యాలు లభిస్తాయి. చరిత్రలో స్థిరమైన స్థానం ఉంటుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. మోక్షసంపద కూడా లభిస్తుం ది. అయితే ఆకర్షణకు మనం లొంగుతాము కానీ ఆచరణ మాత్రం సులభ సాధ్యమైన విషయం కాదు. ఆచరణ పరులకు ఇంద్రియనిగ్రహం, ఏకాగ్రత, ఆహారశుద్ధి, ఆత్మవిశ్వాసం, స్థిరచిత్తం మొదలైనవి తప్పక అవసరం.
తాత్కాలిక ఆకర్షణలకు లొంగి విలువైన జీవితాన్ని వ్యర్థం చేసుకునేవారు యుక్తాయుక్తములను గుర్తించేదిశగా ప్రయత్నాలను ప్రారంభించాలి.

ఈ రోజుల్లో లౌకికరంగాలలో నే కాక వైదికవిషయాలలో, సంప్రదాయ, ఆధ్యాత్మిక రంగాల్లోను కొన్నిచోట్ల ఎన్నో ఎన్నె న్నో ఆకర్షణలు పుట్టుకొస్తున్నాయి. ఆచరణవాదులకన్నా ఆకర్షణవాదులకే కొన్నిచోట్ల జనులు జేజేలు కొడుతూ తరువాత తమ తప్పిదాన్ని తెలుసుకుని పశ్చాత్తాపాన్ని పొందుతున్న సందర్భాలూ ఉన్నాయి.
సత్య ధర్మ మార్గాలను, సద్గురువుల ఉపదేశాలను, వైదిక విధానాలను, సంస్కృతీ సంప్రదాయాలను ఆచరించే వ్యక్తులకు నిత్యజీవితంలో ఎన్నో సవాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి.

బంగారం సుత్తిదెబ్బలను భరించిన తరువాతనే ఒక చక్కని ఆభరణంగా రూపుదిద్దుకున్నట్టే, ఆచరణపరులు తాత్కాలికమైన ఆటంకాలను అధిగమిస్తూ, విజయపథంలో పయనించగలుగుతారు. చరిత్రపుటల్లో నిలుస్తారు. శ్రీరామచంద్రుని వంటి మహనీయుల ధర్మాచరణను, గాంధీమహాత్ముని వంటి మహాపురుషల ఆచరణను ఆదర్శంగా గ్రహించి, అనుసరించే ప్రయత్నం కూడా చేసేందుకు కృషిచేద్దాం.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి