Wednesday, January 7, 2015

Mahatmulu Yekarupulu

మహాత్ములు ఏకరూపులు
Posted On:1/7/2015 12:11:03 AM
సత్కార్యాచరణ తత్పరులై అనితర సాధ్యమైన రీతిలో జీవనయానాన్ని కొనసాగించే మహాత్ములు కష్టసుఖాల్లో, జయాపజయాల్లో, లాభనష్టాల్లో సమచిత్తులై ఏకరూపులై ఉంటారు. మహాత్ములు ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోరు. సంపదలు వచ్చినప్పుడు పొంగిపోరు. దూరాన్ని లెక్కించరు. అవలీలగా సముద్రలంఘనం చేస్తారు. పర్వతాల్నీ అధిరోహిస్తారు. తమకేదీ అసాధ్యం కానట్లుగా మహోన్నత లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. సమున్నత ఫలితాలను పొందుతారు.
తమ తమ ప్రతిజ్ఞలకు అనుగుణంగా మహత్కార్యాలను ఆరంభించేప్పుడు సుఖ సంపదలను, కీర్తిప్రతిష్ఠలను కాంక్షించరు. ఏవైనా అడ్డంకులు వచ్చినా, అధైర్యపడక సంకల్పించిన కార్యాన్ని నెరవేర్చుటకై దీక్షబూనుతారు.
మహాత్ములు స్తుతినిందలకు, లోభ మోహాలకు అతీతులు. మహారాజ్యాన్ని, మహారణ్యాన్ని ఒకేవిధంగా భావిస్తారు. శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామితో-నేను రాజ్యలక్ష్మిని కోల్పోయానని బాధపడకు. నాకు రాజ్యాధికారం కన్నా పితృవాక్య పరిపాలనకై చేసే వనవాసమే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది - రాజ్యం వా వనవాసో వా వనవాసో మహోదయః అని పేర్కొన్నాడు.

అవికారులు, సమచిత్తులు అయిన మహాత్ములలో అగ్రగణ్యుడు శ్రీరామచంద్రుడే. తనను త్వరగా అడవికి పంపాలని తొందరపడుతున్న కైకేయితో శ్రీరామచంద్రుడు - నేను సంపదలకు ఆశపడేవాడిని కాను (నాహమర్థపరో దేవి) అని తెలిపినాడు. నేను ఆడిన మాటను తప్పేవాడను కాను. మేరుమందర పర్వతములతో సరితూగే ధనరాశులను, అరణ్యమునందలి గడ్డిపరకలను సమానంగా భావించే ఋషుల కోవకు చెందినవాడను (విద్ధి మాం ఋషిభిస్తుల్యమ్). కోపగించకు, నేను నారవస్త్రాలను, జటలను ధరించి వెంటనే అరణ్యానికి బయలుదేరుతాను. నీవు సంతోషంగా ఉండుము అని పలికినాడు.
అంతఃపురంలో హంసతూలికా పాన్పుపై నిదురించవలసిన శ్రీరామచంద్రుడు అరణ్యంలో కటిక నేలపై నిదురించాడు. పట్టు వస్త్రాలను ధరించి, పంచభక్ష్య పరమాన్నాలను ఆరగించాల్సి యుండగా నారవస్త్రాలను ధరించి కంద మూలఫలాల్ని భుజించాడు. మహోన్నత కార్యాలను నిర్వర్తించే మహాత్ములు ఎప్పుడూ తమ కష్టసుఖాలను లక్ష్యపెట్టరు అనే విషయాన్ని తన ఆచరణలో చూపెట్టాడు.
కష్టసుఖాల్లో ఏకరూపులుగా ఉండే మహాత్ములయొక్క మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నిద్దాం.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular