Posted On:1/8/2015 1:42:33 AM
|
కామం దుగ్ధే, విప్రకర్షత్యలక్ష్మీం
కీర్తిం సూతే దుర్హలదో నిష్ప్రలాతి
శుద్ధాం శాంతాం మాతరం మంగళనాం
ధేనుం ధీరాః సూనృతాం వాచమాహుః॥
సూనృతం అంటే సత్యం, శుభం అయిన మంచిమాట. కోరికలను తీర్చి, పీడలను తొలగించి, శత్రువులను నశింపజేసి, కీర్తినిచ్చే పరిశుద్ధమైన, శాంతమైన, మంగళకరమైనది సూనృతవాక్కు. అందుకే మాటను మహనీయులు వాగ్ధేనువూ అన్నారు. జీవితాన్ని కోరుకున్న రీతిలో ప్రసాదించే మహత్తు వాక్కు. వాక్కు ఒక కళేకాదు, ఒక జ్ఞానం... సాధన... తపస్సు... వాక్శక్తితో ధీశక్తిని వికసింపజేసి మానవత్వాన్ని పవృద్ధం చేయగల నైపుణ్యాన్ని వేదం కూడా అద్భుతంగా అభివర్ణించింది. సతాం హివాణీ గుణమేవ భాషతే అన్నట్లు గొప్పవారి మాట మంచి గుణాలనే పలుకుతుంది గానీ పరనిందను చేయదు.
మంచే చేస్తున్నాం కదా! అని పరుషంగా మాట్లాడితే మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి ఏ మాటలు ఎదుటివారికి మన మనసులోని భావాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి. ఏ మాటలు అపార్థానికి దారితీస్తాయి అనే మానసిక సంఘర్షణ చేసుకుంటే మాట మంత్రమై వెలువడుతుంది. బుద్ధిగతంగా సంభాషణా చాతుర్యాన్ని అలవర్చుకొని మాట్లాడితే విజ్ఞత వెలుగొందుతుంది. అదే జాతిని నడిపిస్తుంది.
వాక్కు సత్యరూపం ఉక్తి సౌందర్యరూపం. సూక్తి శివరూపం. మనసులోని భావం వాక్కుగా పరిణమించి, పలుకై ఉచ్ఛరించి, సూక్తిగా ఉపయోగించడం సత్యం శివం సుందరాత్మకం.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment