ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట!

ఇంగ్లిష్‌లో బతుకమ్మ పాట!
Posted On:1/21/2015 4:03:31 AM
యూసుఫ్‌గూడ, జనవరి 20:

ఆటపాటల్లోనే కాదు, ముగ్గులు, చదువు సంధ్యల్లోనూ మేటిగా నిలిచి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచింది ఈ చిన్నారి. బతుకమ్మ పాటను మొట్టమొదటిగా ఇంగ్లీషులో పాడి అందరిచేతా శెభాష్! అనిపించుకుంది ఈ చిట్టితల్లి. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ ఈస్ట్ రహమత్‌నగర్ వీడియోగల్లీకి చెందిన ఇప్పపూల శ్రీనివాస్ పెద్ద కూతురు సాయిశ్రేయకు తెలంగాణ పాటలన్నా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలన్నా ప్రాణం. మధురానగర్‌లోని విజ్ఞానజ్యోతి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న శ్రేయకు సంగీతమంటే మక్కువ. కూతురు ప్రతిభను, ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు రేఖ, శ్రీనివాస్ శ్రేయను ప్రోత్సహించి డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం క్లాసులో చేర్పించారు.
ఈ క్రమంలోనే బోరబండ రామారావునగర్‌లో ఉండే తన అమ్మమ్మ జి.అరుణాబాయి రాసిన బతుకమ్మ పాటను సాయిశ్రేయ ఇంగ్లీషులో మొట్టమొదటిగా పాడి అబ్బురపరిచింది. విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు సైతం పాడుకునేందుకు వీలుగా ఉన్న ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొందుతోంది. ఇంగ్లీషులో సాయిశ్రేయ అలవోకగా పాడే ఈ పాట గంగమ్మ తల్లి భూలోకానికి వచ్చే విధానాన్ని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో... ఆకాశ గంగమ్మ ఉయ్యాలో కమింగ్ టూ అర్త్ ఉయ్యాలో అంటూ ఎంతో చక్కగా వివరించింది. ఈ పాటతో పాటు తెలంగాణలోని చెరువుల మీద సాయిశ్రేయ ఎంతో చక్కగా పాడే (పల్లెపల్లెకూ ప్రాణం నిండుకుండ చెరువు...తన గుండె మండి ఎండుతోంది లేదు బతుకుదెరువు...) పాట అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఇవేగాక మరెన్నో తెలంగాణ ఉద్యమ గీతాలను ఎన్నో వేదికల మీద పాడి శ్రోతలను ఉర్రూతలూగించింది. పలు భక్తిగీతాలను కూడా వినాయక నవరాత్రులు తదితర వేదికల మీద పాడి ప్రశంసలు అందుకుంది. వీటితోపాటు ముగ్గుల పోటీల్లో, నృత్య ప్రదర్శనలో అద్భుత ప్రతిభ కనబర్చి డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి మహామహులచేత బహుమతులు అందుకుంది. నగరంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా సాయిశ్రేయ పాడిన బతుకమ్మ పాటల సీడీని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. దూరదర్శన్‌తో పాటు మరో టీవీ చానల్‌లోనూ ఈ చిన్నారిపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. తాను పెద్దయ్యాక బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తానని సాయిశ్రేయ అంటోంది.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి