Posted On:1/21/2015 1:14:54 AM
|
మహాకవులలో అగ్రగణ్యుడైన కాళిదాస మహాకవి యొక్క వినమ్ర స్వభావం కవి పండితవరులకు అందరికీ ఆదర్శప్రాయమై నిలుచునట్టిది. దిగ్గజాలవంటి పూర్వకవులు అందరూ రత్నహారంలోని రత్నాల వంటి వారని, తానేమో ఆ రత్నాలను అంటిపెట్టుకున్న ఒక సామాన్యమైన దారము వంటి వాడను అని రఘువంశ మహాకావ్య ఆరంభంలో అథవా కృత వాగ్ద్వారే వంశేస్మిన్ పూర్వసూరిభిః మణౌ వజ్ర సముత్కీర్ణే సూత్రస్యేవాస్తి మే గతిః॥ అనే శ్లోకం ద్వారా కాళిదాస మహాకవి తన వినమ్ర స్వభావాన్ని పాఠక జనులకు రుచి చూపించాడు.
సముద్రాన్ని లంఘించి, శత్రు దుర్బేధ్యమైన లంకలో ప్రవేశించి తనకు శ్రీరామ చరితామృతాన్ని వినిపించి తన ప్రాణాలను నిలిపిన హనుమంతునితో సీతమ్మతల్లి సముద్రలంఘనమనే మహాత్కార్యాన్ని సాధించగలిగే శక్తి గరుత్మంతునికి, వాయు దేవునికి, నీకు మాత్రమే ఉందని, ఒంటరిగా లంకలో ప్రవేశించిన నీవు సమర్థుడు, ప్రాజ్ఞుడవు, విక్రముడవు, వానరోత్తముడవు అని కీర్తించినను హనుమంతుడు గర్వమును పొందలేదు.
పైగా తాను వానరులలో శ్రేష్ఠడను కాను, వానరులలో చిన్నవాడను, చివరివాడను మాత్రమేనని, నేనే ఈ లంకలోకి ప్రవేశించగలిగానంటే నాకంటే బలవంతులైన వానరులందరు అవలీలగా లంకలో ప్రవేశిస్తారని సీతాదేవితో పలికెను. చూచిరమ్మని చిన్నవారిని, కార్యసాధనకై పెద్దవారిని పంపుతారు కదా తల్లీ అని హనుమత్‌స్వామి సీతాదేవితో పలికెను.
కనీసం ఇతరుల ఊహకైనా అందనట్టి అద్భుతకార్యాలను అవలీలగా తమదైన శైలిలో సాధించినను, ీతారామలక్ష్మణ సుగ్రీవ జాంబవంత అంగదాదుల ప్రశంసలను అందుకున్నను ఏ మాత్రం గర్వం దరిచేరనీయకుండా అందరియెడల వినమ్రతను కలిగియుండెడు హనుమత్‌స్వామిని ఆదర్శంగా గ్రహిద్దాం. వినమ్రతతో జీవించే ప్రయత్నం చేద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment