Posted On:1/3/2015 1:40:21 AM
|
గుణేషు యత్నః పురుషేణ కార్యో
న కించిదప్రాప్త్యతమం గుణానామ్!
గుణప్రకర్షాదుడపేన శమ్భోః
అలజ్ఞ్యముల్లజ్ఘిత ముత్తమాంగమ్!!
మనిషికి జీవితం ఒక్కసారే లభిస్తుంది. అందుకే మనిషి ఎల్లప్పుడూ సద్గుణాల కోసం ప్రయత్నం చేయాలి. గుణాలకు లభించనిది ఏదీ లేదు. మంచి గుణాలు ఉన్నందువల్లనే చంద్రుడు మహాశివుని శిరస్సును అలంకరించాడు. ఉన్నతమైన ఆశయసాధనలో మనం నేర్చుకునే ప్రతీ సద్గుణం ఆలంబనే. మంచి గుణాలు సత్కర్మలను ప్రేరేపిస్తాయి. దీనివలన మనిషిలో చిత్తశుద్ధి సమకూరుతుంది. అప్పుడు ప్రతీ ఒక్కరిలో భగవంతుడు కనిపిస్తాడు. మనలో లేని దేవుడు ఎదుటివారిలో ఎలా కన్పిస్తాడు. మసకబారి దుమ్ముపట్టిన అద్దంలో మన ప్రతిబింబం కనిపించినట్లే, మనస్సు అనే అద్దంపై అజ్ఞానమనే మురికి, దుర్గుణం అనే దుమ్ము పేరుకుపోతే అంతర్యామిత్వం కనిపించదు. వేసే ప్రతీ అడుగూ, నేర్చుకునే ప్రతీ గుణం, మాట్లాడే ప్రతీ మాట మనిషిని ఉన్నతదిశగా అడుగులు వేయిస్తాయి.
సంకల్పం, సద్గుణం మనిషిని మహోన్నతున్నిచేస్తాయి. సమస్తాన్నీ సమంగా చూడగలగడమే మహాగుణం. ఎప్పుడైతే సమభావన మనసులో నెలకొంటుందో అప్పుడే భేషజాలకు, ద్వేషాలకు, కుటిలతకు, కుసంస్కారానికీ తావుండదు. మంచినే నేర్చుకునే ప్రతీ గుణం సోపానమై మానవ జీవిత శిఖరాన్ని ఉన్నతంగా, ఉత్తమంగా దర్శింపజేస్తుంది.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment