Posted On:1/6/2015 12:19:31 AM
|
కాలః సర్వం సమాదత్తే కాలః సర్వం ప్రయచ్ఛతీ!
కాలేచ విహితం సర్వం మాకృథా శక్రపౌరుషమ్॥
కాలమే అన్నింటికీ ఆధారం. కాలమే అన్నింటికీ అవకాశం. మనం నిమిత్తమాత్రులం మాత్రమే. కనుక కాలమనే రూపసౌందర్యాన్ని పులుముకొని విచ్చేసిన నూతన ఒరవడి నీడలోకి విశాల దృక్కోణపు ఆలోచనలు తోడురాగా, నూతన ఉత్తేజంతో ఆనందంగా జీవించేద్దాం.
బంగారానికి తావి అబ్బినట్లు అనేది ఒక అందమైన ఊహ! కట్ట తెంచుకొని ప్రవహించే కాలంలో కమ్మని, చేదు అనుభవాలు మిళితమై ఉంటే అది ఒక అరుదైన నిజం. ఆ ఊహ, ఈ నిజం కలిసి మూర్తీభవిస్తే అదే నూతన ఒరవడి. భవిష్యత్తుకు ప్రాణం పోసే జీవననాడి.
గడచిన కాలం ద్వారా మనసులో నింపుకున్న అనుభవంతో ఆగామి కాలంలో అతీత స్థితికి ఎదిగిపోవాలి. సత్యం కల్పన కంటే కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో, అది ఈ జీవితాన్ని అర్థవంతం చేస్తుందో నిర్ధారించుకొని ముందుకు సాగడమే మన కర్తవ్యం.
జరిగినదంతా మంచే జరుగుతున్నదీ మంచిదే. జరుగబోయేదీ మంచికే. కనుక భూత, భవిష్యత్ చింతనలను వదిలి వర్తమానాన్ని ఆస్వాదిస్తూ జీవించాలి. వర్తమానాన్ని గత అనుభవ వివేకంతో గడిపితే తప్పక ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. మానవ నైజం మీద చరిత్ర రాసిన నిందా లేఖనం చెరిపేసి నూతన ఒరవడిలో ఆదర్శ అధ్యాయాలను లిఖించే వేదికవ్వాలి కాలం. ఇదే కాలమిచ్చే అపూర్వ సందేశం.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment