Posted On:1/2/2015 1:52:46 AM
|
మానవులు తమకు జన్మనిచ్చిన తల్లిదగ్గర ప్రాథమికమైన జ్ఞానాన్ని అభ్యసిస్తారు. ఆ తర్వాత తండ్రిదగ్గర, గురువుల ద్వారా, ఎన్నెన్నో గ్రంథాల ద్వారా, పరిసరాల ద్వారా, సమాజంలోని వ్యక్తుల ద్వారా ఎంతో విజ్ఞానాన్ని ఆర్జిస్తారు.
ఈ జ్ఞానం మనిషికి నిండుగా ఉండవలసిందే. అయితే జ్ఞానం ఎంత ఎక్కువగా ఉన్నా, తగిన ఆచరణ లేకపోతే ప్రకాశించదు.
జ్ఞాని ఆపదల్లో కుంగిపోకుండా, సంపదల్లో పొంగిపోకుండా, ధీరచిత్తుడై జీవితాన్ని కొనసాగిస్తేనే అతడు అభ్యసించిన జ్ఞానానికి సాఫల్యం చేకూరినట్లు.
ఏతావదేవ హి ఫలం పర్యాప్త జ్ఞాన సత్త యుక్తస్య
యద్యాపత్సు న ముహ్యతి నాభ్యుదయే విస్మితో భవతి ॥
అని ఆర్యాసప్తశతి కర్తయైన సుందరపాండ్యుడు ప్రబోధించారు.
మనిషి తాను సంపాదించిన జ్ఞానాన్ని ఆచరణలో నిలుపుకుంటేనే జీవితానికి సమన్వయం చేసుకుంటేనే జ్ఞానానికి సార్థకత ఏర్పడుతుంది. అనారోగ్యం ఏర్పడితే రోగాన్ని పోగొట్టే ఔషధం పేరును ఒకటికి పదిసార్లు పలికినా, రోగనిర్మూలనం జరుగదు.
సుచింతితం చౌషధం ఆతురాణాం న నామమాత్రేణ కరోత్యరోగంఅని కదా ఆర్యోక్తి.
రోగాన్ని పోగొట్టే శక్తిగల ఔషధాన్ని మింగితేనే అనారోగ్యం తొలగి ఆరోగ్యం సిద్ధించినట్లు, అభ్యసించిన జ్ఞానాన్ని ఆచరణలో పెడితేనే అతడు విద్వాంసుడిగా కీర్తించదగినవాడు.
యస్తు క్రియావాన్ పురుష స్సవిద్వాన్ అని చెప్పబడినది.
తన కుటుంబం యొక్క తోటివారి యొక్క సంక్షేమానికి, సంరక్షణకు తన విజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా కార్యాచరణను కలిగిఉండాలి.
ఉత్తమమైన జ్ఞానాన్ని, ఉన్నతమైన ఆచరణను కలిగిఉండే మహనీయులను ఆదర్శంగా గ్రహించి, వారిని అనుసరించే ప్రయత్నం చేద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment