Posted On:1/9/2015 2:01:14 AM
|
భగవానుడు వ్యాధుని బాహ్యాచరణను పట్టించుకోలేదు. ధ్రువుని లేతవయస్సును లెక్కపెట్టలేదు. గజేంద్రుడు అభ్యసిం చిన విద్య ఏపాటిది, అతడు శరణాగతి చేయుటకు ఎట్లు అర్హుడు అని భావించలేదు. సుగ్రీవ, జాంబవంత, విదుర, శబర్యాదుల జాతి-కుల-లింగములను గురించి పర్యాలోచన చేయలేదు. కుబ్జ యొక్క సౌందర్య మెట్టిదని తలచలేదు. కుచేలుని ధనమెంతటిదని పరిగణించలేదు. భక్తప్రియుడగు శ్రీపతి కేవలం భక్తిచేతనే ప్రీతినొందును, అంతేకానీ విద్యా-ధన-సౌందర్య-జాతి-లింగ-వయో గుణములచే సంతోషించడని, భగవంతుడు భక్తినే గ్రహిస్తాడు.
భక్తిభావ తత్పరులై నన్ను ఎడబాయలేక నా దివ్య చేష్టితములను, గుణసంపత్తిని, అద్భుత కృత్యములను, నాతో వారికుండే గాఢ (నవవిధ) బంధమును గుర్తించి, నిత్యము నా వైభవాన్ని కీర్తించే భక్తాగ్రేసరులపై, వారు ప్రసాదించిన దివ్య ప్రబంధములపై నాకు ఎంతటి ప్రేమ కలదో, అంతటి ప్రేమ నన్ను క్షణకాలమైనను వదలి ఉండలేక ఎల్లప్పుడూ నా హృదయమందే నివసిస్తూ నన్ను రంజింపజేసే లక్ష్మీదేవిపై కూడా ఉండదు.
న ప్రీతిరస్తి మమ వక్షసి లాలితాయాం
లకాష్యైం తథా సకలభూత నిదానసీమ్ని
మజ్జన్మ కర్మగుణ బంధ కృతాన్ ప్రబంధాన్
సంకీర్తయత్యనఘ భక్తజనే యథైవ॥
అనే శ్రీహరి కంఠోక్తి రూపమైన శ్రీమద్భాగవత సూక్తిలోని సారాన్ని విశ్వసిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment