Posted On:1/22/2015 2:14:41 AM
|
యైరత్యంత దయాపరైర్న విహితా వంధ్యార్థినాం ప్రార్థనా
యైః కారుణ్య పరిగ్రహాన్న గణితః స్వార్థః పరార్థం ప్రతి
యే నిత్యం పరదుఃఖ దుఃఖితధియస్తే సాధవొస్తం గతాః
మాతః సంహార బాష్పవేగమధునా కస్యాగ్రతో రుద్యతే?॥
స్పందించే గుణం కల తత్తం మానవత్వం. నాగజాతికి చెందిన శంఖచూడుడిని గరుడుడు చంపడానికి వచ్చినప్పుడు, తనను చూసి దుఃఖిస్తున్న తల్లితో అన్న సందర్భం. జీమూత వాహనున్ని చలింపజేసి ప్రాణత్యాగం చేసిన అపూర్వఘట్టం చరిత్రలో జరిగిన సామాజిక మార్పులను ప్రస్తావిస్తుంది.
అతిథిదేవోభవ అని నమ్మిన భారతీయత నీడలో యాచించినవారిని దైవస్వరూపంగా ఆదరించిన వారు, కారుణ్యం నిండిన హృదయంతో పరోపకారంలో స్వార్థమునకు తావివ్వని గొప్పవారు, తోటివారి కష్టాలను చూసి చలించిపోయే ఉదారతగలవారు అలనాటి సజ్జనులు. అలాంటివారి ఛావు ఎన్నడో చీకటైపోయింది.
ఎవరున్నారని, నీ మొర ఎవరు ఆలకించేదని, నీ రోదన వినేదెవరని శంఖచూడుడు ప్రశ్నించిన తీరు మనసున్న ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది.
సత్యమైన, సర్వవ్యాపకమైన సనాతన ధర్మంలో అహింస, దయ, దానాలు వేర్లు పాతుకుపోయిన మహావృక్షాలు. నేడు ఆ చెట్లను సమూలంగా నాశనం చేసి వాటిపై నివాసం ఏర్పరుచుకొని జనారణ్యంగా మార్చివేసిన మానవత్వానికి రూపం ఏది? ఆ తత్తానికి అర్థం ఏదీ?
సద్భావన సహృదయునికి అలంకారమై అలరారుతుంది. పంచభూతాల సాక్షిగా సవిశాల ప్రపంచం బాగుండాలి. పరస్పరద్వేషాలు లేని, ఆపదలు తొలగి, మంచి మార్గంలో ప్రతీ ఒక్కరూ బ్రతకాలి. కుటుంబం, బంధుమిత్రులు, సమాజం సహజీవనంతో ఆనందంగా ఉండాలి. ఇలాంటి సనాతన భావముల వారసత్వం నేటిసమాజానికి అనివార్యం. అశాశ్వతమైన సంపద వారసత్వంలో పొంది వారు నేర్పిన మానవత్వాన్ని మరవని సుహృదయత్వం అందరూ పొందాలి. సర్వేజనాః సుఖినోభవంతు అన్నది జాతిమంత్రం కావాలి.
No comments:
Post a Comment