Posted On:1/13/2015 1:33:55 AM
|
పవిత్రమైన, ప్రాచీనమైన జ్ఞానాన్ని మనం సంపాదించాలంటే గురువు దగ్గరకు వెళ్ళవలసిందే. గురుపరంపర ద్వారా అందుకోవలసిందే. వివిధ గ్రంథాలలో దాగియున్న ఎన్నెన్నో ధర్మసూక్ష్మాలను, వివిధ శాస్త్ర సంపదను, వేదవేదాంగములను జ్ఞాననిధియైన గురువుద్వారా ఉపదేశరూపంలో పొందవలసిందే. సంప్రదాయ రహస్యాలను, వేదమంత్రాలను, బ్రహ్మవిద్యలను, అస్త్ర విద్యను, అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ, గాయత్రి మొదలైన మహామహిమాన్వితమైన మంత్రాలను, సంగీత సాహిత్యాలను గురువువద్ద శ్రద్ధగా అభ్యసిస్తేనే అవి ఫలవంతమై నిలుస్తాయి.
అందుకే హనుమంతుడు వ్యాకరణ శాస్ర్తాన్ని, వేదవేదాంగములను గురువులు వర్షించే జ్ఞానధారల రూపంలో అందుకున్నాడు. రామానుజాచార్యస్వామి శాస్త్ర పాండిత్యాన్ని, సంస్కృతభాషా ప్రావీణ్యాన్ని కలిగియుండి కూడా భగవంతుని సన్నిధికి చేర్చే మంత్రమంత్రార్థరూపమైన జ్ఞానధారను గురుపరంపర ద్వారా అందుకొనవలసిందే తప్ప వేరొక మార్గం లేదు అనే సత్యాన్ని గుర్తించిన మహనీయులు.
రామానుజాచార్యస్వామి తమిళనాడు శ్రీరంగక్షేత్రం నుంచి బయలుదేరి సుమారు 200 కిలోమీటర్ల దూరాన్ని 17 సార్లు ప్రయాణించి చివరకు 18వ సారి గురువు యొక్క విశ్వాసానికి పాత్రులై శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 18వ అధ్యాయం చివరలో అర్జునునికి ఉపదేశరూపంగా పేర్కొన్న సర్వధర్మాన్ పరిత్యజ్య అనే చరమశ్లోకరూపమైన మంత్రాన్ని, మంత్రార్థాన్ని గురువు అనుగ్రహంతో పొందారు.
గురుపరంపరగా తమకు సంప్రాప్తించిన జ్ఞానధారను జిజ్ఞాసువులైన శిష్యుల పైన మాత్రమే వర్షించే సంప్రదాయం నేటివరకూ కొనసాగుతున్నది. ఈ సంప్రదాయం ఇకముందు కూడా కొనసాగాలని ఆశిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment