Sunday, January 11, 2015

బాపూతత్త్వం

బాపూతత్త్వం
☞_/||\_☜
చెరగని చిరునవ్వు. ప్రశాంతమైన ముఖం. మృదువైన
మాటలు. వ్యక్తిత్వాన్ని స్వయంగా పెంపొందించుకోవడం.
ఇవి ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. అహింసనే ఆయుధంగా
స్వీకరించాడు. సత్యవ్రతాన్ని జీర్ణించుకున్నాడు.
పరుషవాక్కుకు దూరంగా ఉన్నాడు.
సాత్వికాహారం తీసుకున్నాడు. ప్రకృతితో మమైకమై జీవనాన్ని
సాగించాడు. ప్రజలతో సహజీవనం చేసి ‘నాయకుడు అంటే ఇలా
ఉండాలి’ అని ఆచరణపూర్వకంగా చూపాడు. కోట్లాది
భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
మహత్ముని ఆశయం...
‘గ్రామాల్లోనే భారతదేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే
భారతదేశం అంతరించినట్లే. అందుకోసమే గ్రామాల్లో
కుటీరపరిశ్రమలను, ఇతర చిన్నతరహా
పరిశ్రమలను స్థాపించేలా ప్రోత్సహించాలి’… ఇది మహాత్ముని
ఆశయం. భారీ పరిశ్రమల పట్ల తన వైముఖ్యాన్ని ప్రకటిస్తూ,
రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణే గ్రామీణాభివృద్ధికి అవసరమని
పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి ఏ ఒక్కరిదీ కాదు…
‘భారతీయ సంస్కృతి అందరి భావాల మిశ్రమం. ఇంట్లో అన్ని
భాగాలలోకి వెలుగునిచ్చే సంస్కృతి నాది’ అన్నారు గాంధీజీ.
ఆయనకు భారతీయ సంస్కృతి అంటే వల్లమాలిన అభిమానం.
ఆయన సిద్ధాంతవేత్త కాదు. కాని నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే
వ్యక్తి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఇంక
తిరుగులేదు. అదే ఆయనను బలమైన శక్తిగా
రూపొందించింది. ఆయన
సిద్ధాంతాలను వ్యతిరేకించినవారు సైతం ఆయనను జాతిపితగా
కీర్తిస్తున్నారు. సామాన్యుడిగా జన్మించినప్పటికీ భారతావనికి
జాతిపితగా కీర్తి పొందారు. స్వాతంత్య్ర సాధనకు ఆయన చేసిన
సేవ ఒక ఎత్తయితే, మహాత్ముడిగా మానవాళికి అందించిన
సేవలు మరో ఎత్తు.
స్వయంగా ఎదిగినవాడు…
మహాత్ముడు తనకు తానుగానే ఎదిగిన మహోన్నత
ప్రజానాయకుడు. ఆయనలో ఉన్న నైతికవర్తనే
ఆయనను నేతను చేసింది. ‘రవి అస్తమించని బ్రిటిష్
సామ్రాజ్యమ’ని విర్రవీగిన ఆంగ్లేయులను… చేతిలో
ఆయుధం లేకుండా, సత్యాగ్రహమనే ఆయుధంతో పారదోలిన
వీరుడు.
భిన్నత్వంలో ఏకత్వం…
సామాన్యుల్లో ఎంతో ప్రభావం చూపిన ఆయన ఆలోచనలు,
ఆచరించిన విధానాలు ఈనాటికీ ప్రపంచ
దేశాలు గుర్తిస్తున్నాయి. తాను అనుసరించనిదేదీ
ఇతరులకు చెప్పలేదు. సత్యం, అహింసల ప్రేరణతో
దేశస్వాతంత్య్రం కోసం ఆయన చేసిన సహాయ
నిరాకరణోద్యమం ప్రజలందరినీ ఒకచోటకు చేర్చి, జాతీయభావాన్ని
పెంపొందించింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారు.
హింస, రక్తపాతం, మతకల్లోలాలకు వ్యతిరేకంగా ఆయన
నిర్వర్తించిన పాత్రను ‘ఒన్మాన్ ఆర్మీ’గా భారత తొలి గవర్నర్
జనరల్ మౌంట్బాటన్ అభివర్ణించారు. వేలాది సైనికులు చేయలేని
శాంతిస్థాపనను ఆయన ‘ఒక్కరే’ సాధించారని కొనియాడా రు.
అంతవరకు వారు చూసిన నేతలకు, గాంధీజీకి మధ్య ఉన్న
తారతమ్యాన్ని గమనించారు.
నెహ్రూ ప్రశంస…
జవహర్లాల్ నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో…
‘‘తాను చెప్పిన మాటల్నే ఆయన కొలబద్దగా తీసుకుని
అనుసరించేవారు. తానెన్నుకున్న మార్గాన్ని
అనుసరించడంలో అవరోధాలు కలిగినప్పుడు వాటిని
అధిగమించేందుకు ప్రయత్నించేవారు. తన మాటలకు,
మార్గానికి తానే ప్రారంభకుడు అయ్యేవారు. సత్యం,
అహింసల నేపథ్యంలో నైతికవర్తనకున్న ప్రాముఖ్యతను,
దానివలన అలవడే క్రమశిక్షణను గమనించారు’’ అని
వివరించారు.
అందరికీ అనుసరణీయం…
ఒకరి మార్గం మరొకరికి అపమార్గంగా కనబడవచ్చు. ఒకరి
విధానం ఇంకొకరికి అనుసరణీయం కాకపోవచ్చు. కానీ గాంధీజీ
అనుసరించిన మార్గమే తమకు సమ్మతమని భారతీయులంతా
భావించారు. ఆయన నెలకొల్పిన ఈ నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ
ప్రపంచదేశాలను ఆకర్షిస్తున్నాయి.
జాతిభేదాలు వద్దు… మనిషిని మనిషిగా చూడు
ఒకసారి మాటల సందర్భంలో
‘మీరు స్వదేశీయులను ప్రేమించినంతగా
విదేశీయులను ప్రేమించరు కదా!’ అని ఒక
ఆంగ్లేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన,
‘నేను మనిషిని మనిషిగానే చూస్తాను. స్వదేశీయుడా?
విదేశీయుడా? అన్నది ముఖ్యం కాదు. పొరుగువాడికి
తోడ్పడమే మానవసేవ’ అని చెప్పారు. ఈ సందర్భంలోనూ ఆ
వ్యక్తి, ‘ముస్లింలీగ్కు ఎందుకు తోడ్పడం లేదు’ అని
మరో ప్రశ్న వేశాడు. ‘సహకరించడానికి నాకేమీ
అభ్యంతరం లేదు. అయితే, నా మార్గంలో లేనివారిపై నా
సేవలను రుద్దలేను’ అని జవాబిచ్చారు.
దేవాలయాలలోకి…
హరిజనుల దేవాలయ ప్రవేశానికి సంబంధించి ఆయన, ‘ఒకసారి
వారిని దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతించిన తరువాత
వాళ్లు లోపలికి వస్తారా? రారా? అనేది సమస్య కాదు. దేవాలయ
ప్రవేశానికి తమకు హక్కు ఉందని హరిజనులు వాదించే ప్రశ్నా
కాదు. వారికి కూడా దేవాలయ ప్రవేశార్హత ఉందని
భావించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అన్నారు.
ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ సత్యాహింసలు ఉంటాయి. ఆ
రెండూ జీవితాంతం ఆయనతో అంటిపెట్టుకునే ఉన్నాయి.
స్వాతంత్య్ర సముపార్జనలో ప్రజలశక్తి ఆయనే. ప్రజల
విశ్వాసం ఆయన పట్లే. జనానికి దూరంగా ఆయన ఏనాడూ లేరు.
‘నేత అనేవాడు జనంతోనే మమైకమైపోవాలి. వారితో కలిసే పనిచేయాలి.
వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి ఇష్టాయిష్టాల్ని
తెలుసుకోవాలి’ అని ఆచరించి చూపించారు. నిజమైన నేతగా
విశ్వాసం పొందాలంటే ఇంతకంటే కావలసినదేముంటుంది?
నిరుపేద కూడా ‘ఇది నా దేశం’ అని భావించే
భారతదేశం కోసం పాటుపడతాను, పేదలకు ఆహారం రూపంలో
పరమాత్ముడిని అందించాలి… అని ఆలోచించిన గాంధీజీని
స్మరించుకోవడం భారతీయుల ధర్మం.
విడిచిపెట్టవలసినవి…
గాంధీజీ సూచించిన ఏడు విసర్జనీయ సూత్రాలు నేటికీ
అనుసరించదగినవి.
సోమరితనం, ఇతరులకు నచ్చని విధంగా నడుచుకోవడం,
వ్యక్తిత్వం లేని జ్ఞానం,నైతికత లేని వ్యాపారం,
మానవత్వం లేని విజ్ఞానం, త్యాగంలేని
మతం,సిద్ధాంతం లేని రాజకీయం.
వీటిని తప్పనిసరిగా విసర్జించాలని చెప్పారు. అంతేకాక వీటిని
అనుసరిస్తే దేశానికి, సమాజానికి వాటిల్లే నష్టాలను కూడా
తెలియజెప్పారు.
మాటలో శక్తి…
సహాయ నిరాకరణ ప్రారంభించినప్పుడు… ఒకచోట
ప్రజలు పోలీసు స్టేషన్ తగులబెట్టి హింసకు పాల్పడ్డారని
తెలిసి, మొత్తం ఉద్యమాన్నే నిలిపివేశారు. అంత ఆగ్రహంలో
ఉన్న ప్రజలు కూడా ఆయన మాటను శిరసావహించి
ఉద్యమానికి విరామం ప్రకటించారంటే గాంధీజీ మాటల్లో దాగి
ఉన్న శక్తి ఎంతటిదో అర్థమవుతుంది.
కలలుగన్న భారతం
‘నా ఆకాంక్ష ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాలు లేని దేశం.
అంటరానితనం, మద్యపానం, మాదకద్రవ్యాలు లేని విధంగా
నాదేశం రూపుదిద్దుకోవాలి. పురుషుల్లాగే మహిళలు కూడా
సమానహక్కులు అనుభవించగలగాలి.’ ఇదీ
మహాత్ముడు కలలుగన్న భారతదేశం.
తుదిశ్వాస విడుస్తూ "హేరామ్" అని భగవద్ధ్యానం చేశాడు. మహత్మా మీకు పాదాభి వందనములు

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular