Posted On:1/1/2015 1:15:27 AM
|
ధర్మార్థ కామమోక్షాణాముపదేశ సమన్వితమ్!
పూర్వవృత్త కథాయుక్త మితిహాసం ప్రచక్షతే!!
ప్రపంచానికి వారసత్వధనంగా, నైతిక ధార్మిక ఆశయాలకు ఆధారంగా లభించినవే రామాయణ మహాభారతాలు. ఇవి రెండూ మన పూర్వీకుల జీవిత ప్రతిభలకు సంబంధించిన సర్వస్వాలు. మనిషి సాధించాల్సిన ధర్మం-అర్థం-కామం-మోక్షం అనే పురుషార్థాలను వివరిస్తూ గతించిన ధర్మ, నైతిక, ఆదర్శ జగతిని పూర్వవృత్తంగా చెప్పే అందమైన కథే ఇతిహాసం. దీనిలో ఆదర్శ నాగరికత వర్ణించబడింది. అది తరతరాలకూ నిత్యనూతనమై మార్గనిర్దేశనం చేస్తుంది. మనిషి ఎలా ఉండాలో, మానవ సంబంధాలు ఎంత ఉన్నతమైనవో, మనిషిలో ఏర్పడిన మార్పు వ్యవస్థనూ, దేశాన్నీ, ప్రపంచాన్నీ, ఏ విధంగా మార్చేసిందో ఇలా ఒక్కటేమిటీ మానవ జీవన చిత్రం అద్భుతంగా వర్ణించబడిన ఉద్యంధం రామాయణం.
మనిషిని అల్లుకునే కుటుంబంం దాని విలువ, సమాజంలో వృత్తిలో నిర్వర్తించాల్సిన బాధ్యతలు, జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు మనిషి సాధించాల్సిన పురుషార్థాలు, భారతీయ సంస్కృతీ వైభవం మహోన్నతంగా వివరించిన మహాభారతం నేటికీ ఆదర్శం.
భారతీయులే కాక ప్రపచమంతా ఆరాధించే రామాయణ భారతాలు కేవలం గడచిపోయిన చారిత్రక వైభవం కాదు. ఆధునికత ముసుగులో అశాంతిని ఆశ్రయిస్తూ తృప్తిలేని యాంత్రికజీవనం గడుపుతున్న నేటి తరానికి మానసిక సంయమనం అందిస్తూ ఆత్మగౌరవం పెంపొందించే ఔషధ గుళికలు, మానవ జీవితానికి సౌరభాన్నద్ధి ప్రపంచమంతా నైతిక పరిమళం వెదజల్లే ఇతిహాస సుమాలు. తల్లిదండ్రులూ వారసత్వ సంపదగా పిల్లలకు రామాయణభారత గాథలు వినిపిస్తూ ఆదర్శజీవం గడిపేందుకు మార్గదర్శకం చూపించండి. మనిషి మనిషి గౌరవించే నైతికతకు ఆస్కారమివ్వండి.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment