Posted On:1/30/2015 3:25:30 AM
|
లోకంలో వారి వారి శక్తియుక్తులను, అవసరాలను అనుసరించి అందరూ ధనాన్ని, ధాన్యాన్ని ఇంకా ఇతర సంపదలను సంపాదిస్తూనే ఉంటారు. ధనధాన్యాది సంపదలను సంపాదించే శక్తి అందరికీ సహజంగానే అబ్బుతుంది. ఈ శక్తి ఒక్కటే మనిషి జీవితానికి పరమార్థ కాదు, కారాదు. వేదవేదాంగాలనో, వివిధ శాస్ర్తాలనో, పురాణేతిహాసాలనో, విస్తృతమైన లౌకిక వాజ్ఞయమునో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పండితునిగా విఖ్యాతిని పొందడం మాత్రం చాలా అరుదు. అందుకే వేలసంఖ్యలో ఒక్కడే పండితుడు కాగలుగుతాడు. సహస్రేషు చ పండితః అని చెప్పబడినది. సందురపాండ్యుడు అనే నీతికారుడు కూడా డబ్బు పరమార్థం కాదు, డబ్బును అందరూ సంపాదించగలుగుతారు. అందరికీ అందని, కొందరు మాత్రమే పొందునట్టి విద్యాధనాన్ని ఆర్జించుటకై కృషి చేయవలెను -
విద్వత్తే యతితవ్యం నార్థేష్వేవాదరః సదా కార్యః
అర్థః సర్వజనగతః విద్వత్తా దుర్లభా లోకే ॥
అని మనకు సుందరపాండ్యుని ఆర్యోక్తి ప్రబోధిస్తున్నది.
విద్వాంసుల వద్దకు ధనరాశులు వచ్చి చేరుతాయి. అంతేకానీ ధనవంతులు అందరూ విద్యావంతులు కాలేరు. ధనికుని వద్దనున్న ధనాన్ని దొంగలు దొంగిలించవచ్చు. అధికారులో రాజులో కొంతభాగాన్ని పన్నుల రూపంలో స్వీకరించవచ్చు. సోదరులో బంధువులో తమకు కొంత పంచి ఇవ్వమని కోరవచ్చు. కానీ ఈ విధంగా విద్యాధనాన్ని ఎవరూ స్వీకరించలేరు. పైగా సంపదలు వ్యయమౌతుంటాయి, కానీ విద్యాధనం ఉపయోగిస్తున్న కొద్దీ ఎన్నోరెట్లు వృద్ధి పొందుతుంది. అట్టి విద్యాధనాన్ని ఆర్జించేందుకు శ్రద్ధగా కృషిచేద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు