Sunday, January 11, 2015

వివేకానందుడు


వివేకానందుడు
★☞_/||\_☜★
భారత ఉపఖండం చీకటి ఖండమైన కాలమది. బ్రిటిష్ పాలనలో
భారతీయులు బానిస మనస్కులై నిర్వీర్యమైపోతున్న
యుగమది.
మూఢాచారాలే మతంగా, తంత్రమూ మంత్రమే మోక్షంగా,
సాటివారిని హీనంగా చూడటమే కులంగా, మెట్టవేదాంతమే
తత్త్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణీ
అవుతున్న
శతాబ్దమది. అలాంటి స్తబ్దమైన సంఘాన్ని తట్టిలేపిన
వైతాళికుడు
వివేకానందుడు.
భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన
మహనీయుడు. ‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా!
మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో.
మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’
అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి
వివేకానంద!
1863 జనవరి 12, సోమవారం!
ఉదయం 6 గంటల 49
నిమిషాలు. కలకత్తాలో
భువనేశ్వరీదేవి పండంటి
మగబిడ్డను కన్నది. తండ్రి
విశ్వనాథ్ దత్తా ఆ పిల్లాడికి
నరేంద్రనాథ్ అనే
పేరు పెట్టారు. నరేన్ అల్లరి
గడుగ్గాయి. గిన్నెలు, చెట్లు,
రాళ్లు – అన్నీ ఆ
చిచ్చరపిడుగుకి ఆటవస్తువులే!
పిల్లల్లోని అంతర్గత అనంత శక్తే అల్లరిగా
ఎగదన్నుకొస్తుంది. ఆ దివ్యశక్తిని వెలికి తీయడమెలాగో
భువనేశ్వరికి తెలుసు. రెచ్చిపోయే నరేన్ నెత్తిపై శివ శివ
అంటూ బిందెడు నీళ్లు గుమ్మరించేది. బుద్ధిగా ఆ
పిల్లాడిని కూచోబెట్టేది. రామాయణ భారత శ్లోకాల్ని వల్లె
వేయించేది. అందుకే ‘‘నాలోని మానసిక అభ్యుదయానికి, ధార్మిక
శక్తికి, సంస్కారానికి మా అమ్మే కారణం’’ అనేవారు స్వామి
వివేకానంద.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెలకొల్పిన బడిలో 1870లో నరేన్ ఒకటో
తరగతిలో చేరాడు. చిన్నప్పుడే వేణీగుప్త, ఉస్తాద్ అహ్మద్ఖాన్
దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. హార్మోనియం, ఫిడేల్పై
పట్టు సాధించాడు. న్యాయవాది అయిన విశ్వనాథ్ దత్తా తన
కొడుక్కి న్యాయశాస్త్రం, సైన్సు పుస్తకాల్ని
ఉద్దేశపూర్వకంగా ఇస్తూండేవారు. ఉపనిషత్తుల్ని,
పురాణాల్ని చదివిస్తూండేవారు. ఆయా విషయాలపై కావాలని
వాదనపెట్టి చర్చిస్తూండేవారు.
ఏ విషయాన్నయినా తర్కంతో హేతుబద్ధంగా పరిశీలించే శక్తి
నరేన్కి అలవడింది ఈ శిక్షణ వల్లనే!
చిన్నప్పటినుంచీ నరేంద్రుడికి ధ్యానం ఓ నిత్యక్రీడ.
పద్మాసనం వేసుకుని కళ్లు మూసుకుని ధ్యానంలోకి
వెళ్లిపోతే సమస్త ప్రపంచాన్నీ మరచిపోయేవాడు. అత్యంత
తీక్షణమైన ఏకాగ్రత వివేకానందుడికి అబ్బింది ఈ
ధ్యానం వల్లనే.
ఏవేవో ప్రశ్నలు…
1879లో 16 యేళ్ల నరేన్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.
రోజూ వ్యాయామం చేసేవాడు. వస్తాదులా ఉండేవాడు.
కర్రసాము, గుర్రపుస్వారీ, కుస్తీ, పడవ నడపడం,
పరిగెత్తడం, ఈతకొట్టడం… ఒకటా రెండా
అన్నింటిలోనూ ప్రవేశించడం, అంతు చూడటం… ఇదీ
వరస! చివరకు పాకశాస్త్రంలో కూడా గరిటె తిప్పిన చెయ్యి
నరేన్ది!
మరోపక్క హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టువర్ట్ మిల్, అగస్టె కామ్టె,
అరిస్టాటిల్, డార్విన్ లాంటి పాశ్చాత్యుల గ్రంథాల్ని
అధ్యయనం చేశాడు. దేశ చరిత్రల్ని, ప్రాక్పశ్చిమ
తత్త్వశాస్త్రాల్ని, తర్కం, క్రైస్తవ మహ్మదీయ బౌద్ధమత
గ్రంథాల్ని ఆకళించుకున్నాడు. వివిధ దేశాల్లో వివిధ
పరిస్థితుల్లో మానవ సమాజాలు ఎలా పరిణామం చెందాయో
అవగతం చేసుకున్నాడు.
అయితే భారతీయ సంస్కృతి, మతం, తత్త్వ చింతనలపై
మమకారం ఓ వైపు; ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు,
హేతువాదం పట్ల మక్కువ మరోవైపు – ఈ రెంటి మధ్య నలిగి
మధనపడ్డాడు. భగవంతుడు లేడనీ భౌతిక దృగ్విషయాలే
సత్యాలనీ చెప్పే పాశ్చాత్య సైన్సులో లోపం ఉందని
హృదయానికి అనిపించేది. సనాతన భారతీయ భావజాలం భౌతిక
దృష్టి కొరవడి వక్రీకరణకు గురైందని బుద్ధికి తోచింది.
తత్ఫలితంగా ఏవో ఏవేవో ప్రశ్నలతో వేగిపోయేవాడు. ఏవో ఏవేవో
ఘోషలతో ఊగిపోయేవాడు. సమాధానాల కోసం బ్రహ్మ సమాజంలో
చేరాడు. అయినా సంతృప్తి లేదు.
నిర్వికల్ప సమాధి…
1881లో స్కాటిష్ చర్చి కాలేజీలో బీఏలో చేరాడు నరేంద్రుడు.
ఓ రోజు క్లాసులో ప్రిన్సిపాల్ విలియం హేస్టీ – వర్డ్స్వర్త్
కవిత ‘ది ఎక్స్కర్షన్’ గురించి చెబుతున్నారు. ఆ మాటల్లో
‘సమాధి అవస్థ అనే ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది
తనకు తెలిసి రామకృష్ణ పరమహంస’ అని హేస్టీ అన్నారు.
నరేన్కి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. వెంటనే కలకత్తాకి
దగ్గర్లోని దక్షిణేశ్వరం వెళ్లాడు.
ఉసిరిచెట్టు కింద మాసిన గడ్డంతో ఒంటిపై ఒక్క
అంగవస్త్రం తప్ప మరే ఆచ్ఛాదనా లేని అలౌకిక ధ్యానముద్రలో
పరమహంస… దివ్యోన్మాదంతో కాళికాదేవి సాక్షాత్కారం కోసం నేలపై
దొర్లి ఏడ్చి చివరకు భగవద్దర్శనం పొందిన పరమహంస…
ప్రతిరోజూ గంగలో వెండి నాణాల్ని విసిరేసి
ధనవ్యామోహం వదిలించుకున్న పరమహంస… బ్రాహ్మణుడే
అయినా పంచముల ఇళ్లకు వెళ్లి, వారు చూడని సమయాల్లో
వారి పాయిఖానాల్ని వొట్టి చేతులతో శుభ్రం చేసిన పరమహంస…
సన్నిధిలోకి అడుగుపెట్టాడు నరేన్.
ఆయన పాడమంటే – కనులు మూసుకుని బాహ్య
ప్రపంచాన్ని మరచిపోయి తన్మయీభావంతో గాన ధ్యాన
సమాధ్యవస్థలో ‘‘మన్ చలో నిజనికేతన్’’ (మనసా! మన చోటుకి
వెళ్లిపోదాం) అన్న కీర్తన పాడాడు. పాట
వింటూ పరవశులైపోయారు పరమహంస.
హఠాత్తుగా నరేన్ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి
తలుపులేసేశారు. కళ్లల్లో ఆనంద భాష్పాలతో
‘‘ఇన్నాళ్లకు వచ్చావా?’’
అంటూ నరేన్ను స్పృశిస్తూ ఆర్ద్రమైపోయారు. అంతటి
తాదాత్మ్యతలోనూ నిశ్శబ్దాన్ని
చీలుస్తూ నరేంద్రుడు సూటిగా వదిలిన ప్రశ్నాబాణం –
‘‘మహాశయా! మీరు దేవుణ్ని చూశారా?’’
ఏమాత్రం తడుముకోకుండా ‘‘చూశాను’’
అన్నారు రామకృష్ణులు.
సంభ్రమాశ్చర్యానందాలతో నరేన్…
ఇన్నాళ్లుగా ఎందరెందరినో ఉన్మత్తుడిలా అడిగిన ప్రశ్న అది.
ఎన్నాళ్లుగానో చకోరంలా ఎదురుచూస్తున్న జవాబది.
మళ్లీ రామకృష్ణులు ‘‘నిన్ను చూస్తున్నట్లే
భగవంతుణ్ని చూశాను. నేను నిన్ను ఇప్పుడు ఎలా
చూస్తున్నానో అలాగే మనమూ భగవంతుణ్ని చూడొచ్చు’’
అన్నారు.
ఈ సంఘటన నరేన్ మనసులో గొప్ప విప్లవాగ్ని రగిలించింది.
గదులు, తలుపులు, కిటికీలు, చెట్లు,
సూర్యచంద్రులు, నక్షత్రాలు – అన్నీ
ఎగిరిపోతున్నట్లు, తునాతునకలై
అణువులు పరమాణువులుగా విడిపోయి ఆకాశంలో
లీనమైనట్లు అనిపించింది. నేను అనే మాయ మాయమై విశ్వ
చైతన్యమే నేనుగా భాసించింది.
నరేంద్రుడు వివేకానందుడిగా మారడం మొదలైందప్పుడే!
అప్పటినుంచి పరమహంస వద్దకు నిత్యం ఏవో ప్రశ్నలతో
వెళ్తుండేవాడు. అప్పుడప్పుడు గురువుతో
వాదించేవాడు. ఓ దశలో తానూ నిర్వికల్ప సమాధిని పొందాలన్నంత
ఆవేశవశుడయ్యాడు.
కష్టాలెన్నో…
అంతలో 1884లో తండ్రి విశ్వనాథ్ దత్తా మరణించారు.
అంతవరకు బాగా బతికిన కుటుంబం వీధినపడింది.
పెద్ద కొడుకుగా నరేన్పై ఇంటి భారం పడింది. ఆకలితో
ఉత్తకాళ్లతో మండుటెండలో కాళ్లు బొబ్బలెక్కినా ఆఫీసుల
చుట్టూ తిరగాల్సిన దీన స్థితి. ఇంటిలో అన్నం ఉండదని
తెలిసి స్నేహితుల ఇళ్లల్లో తినేశానంటూ కన్నతల్లికే
అబద్ధం చెప్పాల్సిన హీన స్థితి.
డబ్బు సాయం చేస్తామంటూ ఒకరిద్దరు సంపన్న
స్త్రీలు అతి జుగుప్సాకర ప్రతిపాదన చేస్తే ఛీకొట్టిన ధీర
స్థితి.
చివరకు ఓ న్యాయవాది దగ్గర అనువాదం చేసే
ఉద్యోగం దొరికింది – బొటాబొటీ జీతానికి! కానీ తాను జన్మించింది
ఇందుకోసం కాదని తెలుసు. అలాగని బాధ్యతల నుంచి
తప్పుకోలేననీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో 1885లో
రామకృష్ణులు గొంతు క్యాన్సర్కి గురయ్యారు. ఆయన
నిర్యాణం చెందడానికి ముందురోజు నరేన్తో, ‘‘నేను ఇచ్చిన
శక్తితో ప్రపంచానికి సేవ చెయ్యి’’ అన్నారు.
22 యేళ్ల లేత వయసులో ఉన్న నరేన్కి ఆ మాట రామబాణమైంది.
తనవారిని విడిచిపెట్టేశాడు. తోటి శిష్యులతో కలిసి బారానగర్లో ఓ
పాడుబడిన ఇంటిలో ‘రామకృష్ణమఠం’ స్థాపించారు. జపం,
ధ్యానం, వేదాంత చర్చ, ఉంటే తిండి, లేకుంటే పస్తులు,
చింపిరి దుస్తులు, కటిక నేలపై నిద్ర, యోగసాధన – రెండేళ్ల
పాటు ఇదే జీవితం!
ఆపై సన్యాసం స్వీకరించి స్వామీ వివిదిశానందగా
పేరు మార్చుకున్నారు. కాషాయవస్త్రాలు,
నడుముకు దిట్టచేల, తలకు పాగా, ఓ చేతిలో కమండలం, మరో
చేతిలో భగవద్గీత… ఇంతే! 1888 నుంచి 5
ఏళ్లపాటు భిక్షాటనంతో దేశాటనం. ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో…
పట్టణాల్లోని మురికివాడల్లో, పల్లెల్లోని పేదల గుడిసెల్లో…
ఎక్కడెక్కడ సంచరించారో! వాస్తవ విషాద భారతదేశాన్ని కళ్లారా
చూశారు.
వివేకవాణి…
చివరకు 1892 డిసెంబరు 25న కన్యాకుమారి చేరారు.
అది మూడు సముద్రాల కూడలి. భారతదేశపు చిట్టచివరి కొన…
సముద్రంలో దూరంగా కొండ… సాగరాన్ని ఈది ఆ
గుట్టను చేరారు స్వామి. అక్కడ విశాల వినీల ఆకాశం కింద
ప్రశాంతంగా మౌనంలో ధ్యానంలో సాగర తరంగాల నిర్ణిద్ర
సంగీతం వింటూ మూడు రోజులు గడిపారు.
ఆ కొండపై మాతృభూమికి అభిముఖంగా నిలబడితే ఎదురుగా
వేదోపనిషత్తులకు, ధార్మికతకు, నైతికతకు పుట్టినిల్లయిన
పునీత భారతదేశం… పారతంత్య్రం, దుర్భర దారిద్య్రం,
కులమత విభేదాలు, అంతులేని అజ్ఞానం, నిస్తేజమైన
యువత తనకోసం బతకడమే బతుకు అని
భ్రమిస్తూ నిర్వీర్యమైపోతున్న భరతజాతి… తలచుకుంటే
స్వామికి గుండె తరుక్కుపోయింది.
నయనాలు రెండూ అశ్రుసాగరాలయ్యాయి.
తన విధ్యుక్త ధర్మం తెలిసొచ్చింది.
‘‘పేదల్లో పీడితుల్లో అంధుల్లో కుష్టురోగుల్లో
ప్లేగు బాధితుల్లో… భగవద్దర్శనం అయ్యింది. ప్రాచీన
భారతీయంలో దాగిన పటిష్ఠ నైతిక సూత్రాల్ని, ధార్మికతలోని శీల
నిర్మాణాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ శిఖరాగ్రాన నిలబడి
ఎలుగెత్తి చాటాలి. వేదాంత శంఖం పూరించాలి. ఇదే నా జీవిత
కార్యం’’ అని అనుకున్నారు స్వామీజీ.
చికాగో (అమెరికా)లో జరగబోయే విశ్వమత సదస్సును ప్రథమ వేదిక
చేసుకున్నారు. వివేకానందుడిగా పేరు మార్చుకుని 1893 మే
31న బొంబాయి తీరంలో బయలుదేరారు. ఆగస్టు 20కి చికాగో
చేరుకున్నారు.
1893 సెప్టెంబర్ 11. విశ్వమత మహా సభాప్రాంగణం.
వేదికపై స్వామి వివేకానంద.
అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడగరి. విశాలమైన నుదురు,
వెడల్పయిన నేత్రాలు. తీక్షణమైన చూపులు. బలమైన ఛాతి.
నిండైన విగ్రహం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం.
రాజఠీవి. దర్పం. సరస్వతీదేవికి నమస్కరించి, ‘‘అమెరికా సోదర
సోదరీమణులారా’’ అంటూ ప్రసంగం ప్రారంభం. అంతే. ఆ
ఒక్క పిలుపుతోనే 7000 మంది ఒక్కసారిగా లేచి నిలబడి
రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో పులకించిపోయారు.
ఆ క్షణం నుంచి ఏడేళ్ల పాటు వివేకానందుడు అమెరికా,
ఇంగ్లండ్, భారత్… ఇంకా అనేకానేక ప్రాంతాల్లో వివేకవాణి
వినిపించారు. 1902 జూలై 4 శుక్రవారం రాత్రి 39వ యేట
తనువు చాలించారు. ‘కాలక్రమంలో ఎందరో
వివేకానందులు ఉద్భవిస్తారు’ అన్నది ఆయన ఆఖరిమాట.
స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకులందరి కండరాల్లోని
ప్రతికణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ.
నిప్పు కణికలై ప్రజ్వరిల్లనీ. అపుడే… నీ
స్వప్నం నిజమవుతుంది. ఈ స్వర్గం రుజువవుతుంది.
రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో
నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో! ప్రాచీన కాలపు గ్రీసులో
సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్లీ
మానవ చరిత్ర పరిణాహంలో గురువంటే రామకృష్ణుడు.
శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే
వివేకానందుణ్ని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్ధమే శిష్యరికానికి
గీటురాళ్లని, దరిద్ర నారాయణసేవే పరమధర్మమని ఆయన
అన్నారు.
కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన
రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి
అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్,
జతిన్దాస్లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే
బాటలయ్యాయి.
Like ·  · 

No comments: