Seavadharmam

సేవాధర్మం
Posted On:2/17/2015 2:01:16 AM
శిశువును నవ మాసాలు గర్భంలో ధరించి, ఆ తరువాత జన్మనిచ్చి దేహ పోషణకు అవసరమైన పాలను ఇచ్చి, నడక నేర్పి, మాటల మూటను అందించే మాతృమూర్తి యొక్క సేవాతత్పరత మహనీయమైనది. మాటలతో వర్ణించలేనిది. తల్లిప్రేమకు సాటిరాగల ప్రేమగాని, తల్లి సేవలను వివరించే మాటలుగాని లభించుట దుర్లభము. సేవాభావం కల వ్యక్తులు అక్కడక్కడ మనకు దర్శనమిస్తారు. శిష్యులు గురువుల సేవలో, దేశసేవలో సైనికులు, రోగుల సేవలో వైద్యులు, అధికారుల సేవలో ఉద్యోగులు, ప్రజల సేవలో ప్రభువులు పాల్గొనటం జగద్విదితమే. వనవాస సమయంలో సీతారాములకు లక్ష్మణస్వామి చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుచునట్టివి. శ్రీరామచంద్రు డు రాజ్యాన్ని పరిపాలించే సందర్భంలో తనను తాను ప్రభువుగా కాకుండా, ప్రజలకు సేవచేసే వ్యక్తిగానే భావించుకున్నాడు.
చూపులేని తల్లిదండ్రులకు శ్రవణకుమారుడు చేసిన సేవ, అరణ్యవాసియైన వ్యాధుడు తల్లిదండ్రుల పట్ల సేవాధర్మమును కలిగియున్న తీరు అందరికీ ఆదర్శ ప్రాయమైనట్టిదే. అయితే లోకంలో చాలాచోట్ల సేవలనందుకునే వ్యక్తులు సేవాభావంతో సేవలను అందిస్తున్నవారిపట్ల కృతజ్ఞతాభావం లేకుండా వ్యవహరిస్తారని, సేవచేసే వారిలో తప్పులు వెదుకుచూ మాటిమాటికి ఆక్షేపిస్తూ మందలిస్తూ ఉంటారని, సేవాధర్మాన్ని నిర్వర్తించడం చాలా కష్టమని భర్తృహరి మహాకవి ఈ క్రింది శ్లోకంలో వివరించాడు.
మౌనాన్మూకః ప్రవచనపటుః వాచకో జల్పకో వా
దృష్టః పార్శ్వే భవతి చ వసన్ దూరతో‚ ప్యప్రగల్భః
క్షాంత్యా భీరుః యది న సహతే ప్రాయశో నాభిజాతః
సేవాధర్మః పరమగహనః యోగినామప్యగమ్యః ॥

సేవలనందుకునేవారు తమకు సేవలనందించే వ్యక్తి ఎక్కువగా మాట్లాడకపోతే మూగివాడా అని, ఎక్కువ మాట్లాడితే వదురుబోతు, వాగుడుకాయ అని సంబోధిస్తారు. దగ్గరగా నిలబడితే భయభక్తులు లేనివాడని, దూరంగా నిలిచేవాణ్ణి అసమర్థుడని అంటారు. సేవలందించే వ్యక్తి సహనం కలవాడైతే అతణ్ణి భయగ్రస్తుడని, సేవలనందించునపుడు తనకు కలిగే ఇబ్బందులు అవమానాలను గురించి అతడు వివరిస్తే ఆ వ్యక్తి మంచి వంశంలో పుట్టనివాడని పేర్కొంటారు. ఎంతో జాగ్రత్తగా సేవలనందించినా ఆక్షేపణలు తప్పవని, అనేక విధములైన సేవలతో ప్రభువులను మెప్పించడం యోగీశ్వరులవల్ల కూడా కాదని సేవాధర్మాచరణ చాలా క్లిష్టమని భర్తృహరి ప్రబోధించెను.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి