పవిత్ర జీవనం

పవిత్ర జీవనం
Posted On:2/24/2015 12:27:18 AM
జీవన దార్శనికత దైనందిన చర్యల్లో ప్రస్ఫుటమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎదుటివారు ఎలా బతకాలో సలహాలివ్వచ్చు. నీటిలోకి దిగితేనే లోతెంతో తెలిసేది. అలాగే ఎవరి బతుకు వారిది. ఒక చిన్న వస్తువు కొనాలంటేనే ప్రణాళిక వేసుకొని, ముందు వెనుకా ఆలోచించి నిర్ణయం తీసుకునే మనం బతికేందుకు వేదం ఏనాడో అద్భుత కర్తవ్యోపదేశం ప్రణాళికబద్ధంగా సూచించింది. పవిత్ర జీవనానికి మార్గం చూపింది.

పునంతు మా దేవజనాః పునంతు మనవో ధియా
పునంతు విశ్వాభూతాని పవమానః పునంతు మా ॥
నైతిక విలువలతో మనిషి ఎదిగేందుకు నాలుగు విషయాలను జీవన సూత్రాలుగా మలుచుకొని బతకాలనేది వైదిక ప్రబోధం. భావనాజగత్తులో దివ్యగుణాల పరిపాలకులు దేవతలనీ, అసుర గుణసంపత్తి గలవారు రాక్షసులనీ అనుకుంటే సత్యభాషణం. పరోపకారం, దయ, తృప్తి గలిగిన మహజనులతో సహవాసం చేయగలిగితే జీవితం పావనం అవుతుంది.

మననశీలి మనిషి. వివేకంతో, బుద్ధితో సామాజిక దృక్పథాన్నీ, మంచి చెడులనూ ఆలోచిస్తూ ఆశావహ దృక్పథంతో, మంచి భావనలతో మనసును పదేపదే ప్రేరేపించే శక్తిని మనిషి సాధించాలి. మంచి ఆలోచన తప్పక మంచి కర్మలనే చేయిస్తుంది. పవిత్ర భావనలతో సమాజం వర్ధిల్లుతుంది.
పంచభూతాత్మకమైన ప్రకృతి, పంచేంద్రీయ సహిత మనిషీ లోకంలో సత్సంబంధంతో నిలబడతారు. ప్రకృతిలోనే మావనత్వం పరిమళిస్తుంది. దానికి అతీతమైన జీవనమే లేదు. అనంతమైన ప్రకృతిలో భాగమైన మనిషికి స్వార్థచింతన ఉండదు. పరార్థ భావనలో పరస్పర సహకారానికి ఆస్కారముంటుంది. ఆలోచన విశాలమవుతుంది.
సమాజం బాగుండాలి. మనుషులందరూ క్షేమంగా ఉండాలి. అనే భావనలు పారమార్థిక తత్తంతో భగవంతుని ప్రార్థించే సత్సంకల్పాలై మానసిక ధైర్యాన్నిస్తాయి. మనలోని భగవత్తత్వానికి ఏరూపమిచ్చినా సృష్టిని నడిపే శక్తి అతీంద్రియమై, అణువణువులోనూ దాగుంది. లోకాస్సమస్తాః సుఖినోభవంతు అనే విశ్వమానవ సౌభ్రాతృత్వం, సామాజిక వికాసం వంటి భావనలే భగవంతునికర్పించే నీరాజనాలు.

గొప్పదారి సహవాసంతో నేర్చిన గుణసంపద, మనిషి మేధస్సులో సంకల్పించే సుహృద్భావన, ప్రపంచమనే ఉదాత్తభావన నేను నుంచి మనం వరకు చేసే ప్రస్థానం, లోకక్షేమం లోనే స్వీయక్షేమం ఉందనే ఆలోచనాపరంగా చేసే భగవత్ప్రార్థన అనే నాలుగు విషయాలు పవిత్ర జీవనాన్ని మానవత్వానికి అంకితం గావిస్తాయి.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి