Posted On:2/21/2015 1:36:50 AM
|
దానధర్మాలకు, అనుభవం కోసం ధనాన్ని ఉపయోగించకపోతే ఆ ధనం నశిస్తుందని, ధనానికి దానము, భోగము, నాశము అనే మూడు గతులే ఉన్నాయి
దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య
యో న దదాతి, న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥
అని భర్తృహరి మహాకవి పేర్కొన్నాడు.
రాశులకొద్ది ధనం ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న ధనాన్ని తన అవసరాలకో, తన పరివారం యొక్క అనుభవానికో ఏ మాత్రం ఉపయోగించకపోతే, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో అలమటించేవారికి, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారికి సహాయంగా అందించకపోతే, విద్వాంసులను, కళాకారులను సత్కరించుటకు, దేవాలయ నిర్మాణమునకు, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించుటకు వీలుగా దానంగా ధర్మంగా సమర్పించకపోతే ఆ ధనరాశులు ఇతరుల వశమయ్యే ప్రమాదమున్నది.
పంట పొలాల్లో గడ్డితో తయారుచేసి పెట్టే దిష్టిబొమ్మ పంటకు కాపలాగా ఉంటుంది. పొలం యజమాని శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది. అంతేకానీ ఆ పంటను అనుభవించదు. అట్లే ధనాన్ని తాననుభవించక, ఇతరులకు దానం చేయకుండా ఉండే వ్యక్తి కూడా బొమ్మవలె ధనానికి కాపలాదారుగా మాత్రమే ఉంటాడు తప్ప యజమానిగా ఉండడు.
యో న దదాతి, న భుంక్తే విభవే సతి నైవ తస్య తద్ద్రవ్యమ్
తృణ కృత కృత్రిమపురుషః రక్షతి సస్యం పరస్యార్థే ॥ అని చెప్పబడినది.
సత్కార్యాలకు దానంగా ఉపయోగించడం, ధనానికి సద్గతి. యజమానికి, అతని పరివారానికి ఉపకరించడం సహజగతి. దుర్జనుల వ్యసనాలను తీర్చుకోవడానికి, దుర్మార్గులు ఆక్రమించుకోవడానికి, విలువ తెలియనివారి చేతికి చిక్కి నిరుపయోగంగా పడివుండడానికి కారణమయ్యే ధనం అధోగతిని పొందినట్లగును.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment