Posted On:2/13/2015 11:33:37 PM
|
తనలో శక్తిసామర్థ్యాలు అపరిమితంగా ఉన్నప్పటికీ, తనను తాను స్తుతించుకోకూడదు. ఎవరైతే ఇతరులను ఎప్పుడు కూడా నిందించరో, అట్లాగే తమను తాము స్తుతించుకోరో, తమ గొప్పతనా న్ని తామే చెప్పుకుండా ఉంటారో, అటువంటి వ్యక్తులే గుణసంపన్నులుగా కీర్తింపబడుతారు. గొప్పనైన యశస్సును పొందుతారు.
అబ్రువన్ కస్యచిత్ నిందాం ఆత్మపూజాం అవర్ణయన్
విపశ్చిత్ గుణసంపన్నః ప్రాప్నోత్యేవ మహద్యశః॥
అని వ్యాసమహాభారతం శాంతిపర్వంలోని శ్లోకం ద్వారా ప్రకటింపబడినది.
కొందరు తమను తాము ఎక్కువగా ప్రశంసించుకుంటూ ఉంటారు. ఇతరులు కూడా ఈ ప్రశంసలను విని వారు తమను గొప్పగా భావించి గౌరవించాలని భావిస్తారు. ఇట్టివారిని వ్యాసమహాభారతం శాంతిపర్వంలోని సూక్తి- మూర్ఖులు నలోకే దీప్యతే మూర్ఖః కేవలాత్మప్రశంసయా అని సంబోధించి, ఇట్టివారికి లోకంలో ప్రకాశం కలుగదు, సత్కీర్తి ప్రతిష్ఠలు లభించవు అని పేర్కొన్నది.
పూలలో ఉండే సుగంధాన్ని గురించి ఎవరూ చెప్పకపోయినా, సుగంధం అంతటా వ్యాపిస్తుంది కదా! ఆకాశంలో ప్రకాశించే సూర్యనారాయణుడు తన ప్రకాశాన్ని గురించిగానీ, తాను చేయు సత్కార్యాల గురించిగానీ ప్రచారం చేసుకోడు కదా! అట్లే మనం కూడా మన గురించి ఎక్కువగా చెప్పుకోరాదు, స్వస్తుతి చేసుకోరాదు.
అబ్రువన్ వాతి సురభిర్గంధః సుమనసాం శుచిః
తదైవ అవ్యాహరన్ భాతి విమలో భానురంభరే ॥
అని శాంతిపర్వంలోని సూక్తి మనకు ప్రబోధిస్తున్నది.
ప్రతిభావంతులు, ప్రజ్ఞావంతులు అయినట్టి వారు ఎంత మారుమూలన ఉన్నా, వారి కీర్తిప్రతిష్ఠలు అంతటా తప్పక వ్యాప్తమౌతాయి. అందువల్ల తమ కృషి మరుగున పడిపోకూడదు అనే ఉద్దేశ్యంతోనైనా సరే స్వస్తుతి అసలే పనికిరాదు.
ఇతరులలో ఏవో చిన్న లోపాలున్నాయని, వారిలో స్వార్థచింతన ఎక్కువ ఉన్నదని భావిస్తూ ఒకటికి పదిసార్లు ఇతరులను నిందిస్తూ ఉంటే మనకు శాంతి సౌఖ్యాలు దూరమౌతాయి. అందుకే మన పూర్వులు పరనింద తగదని, స్వస్తుతి కూడదని హితవు పలికారు. పూర్వుల హితప్రబోధాన్ని శిరసావహిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment