శ్రేయోమార్గం

శ్రేయోమార్గం Posted On:2/6/2015 2:55:40 AM పశుపక్ష్యాదులకంటె విశిష్టుడైన మానవునికి శ్రేయస్సును కలిగించే మార్గాలను ఆర్షవాఙ్మయం మనకు విస్పష్టంగా తెలుపుతున్నది. సర్వప్రాణుల పట్ల మృదు ప్రవర్తనను, వ్యవహారాలలో ఋజుప్రవర్తనను కలిగియుండుట, తోటి వ్యక్తులతో మధురంగా మాట్లాడుట, నిస్సంశయమైన శ్రేయోమార్గం - మార్దవం సర్వభూతేష వ్యవహారేష చార్జవమ్ వాక్ చైవ మధురా ప్రోక్తా శ్రేయ ఏతదసంశయమ్ ॥ అని మహాభారతం శాంతి పర్వంలో చెప్పబడింది. మిత్రులపట్ల అనుగ్రహమును, శత్రువులపట్ల నిగ్రహమును కలిగియుంటూ శాస్త్రోక్త ప్రకారంగా ధర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా ధనార్జనను, భోగానుభవాన్ని కొనసాగించెడివారు శ్రేయస్సును పొందుతారు. అనుగ్రహం చ మిత్రాణాం అమిత్రాణాం చ నిగ్రహమ్ సంగ్రహం చ త్రివర్గస్య శ్రేయ ఆహుర్మనీషిణః ॥అని శాన్త్రపండితులు పేర్కొన్నారు. వ్యాస మహాభారతంలోని గురుపూజా చ సతతం, వృద్ధానాం పర్యుపాసనమ్‌ శ్రవణంచైవ శాస్త్రాణాం కూటస్థం శ్రేయ ఉచ్యతే ॥ అనే శ్లోకము పేద-ధనిక, పండిత-పామర తారతమ్యం లేకుం డా జాతి-మత-వయో-ప్రాంత భేదము లేకుండా, అందరూ తమకు విజ్ఞానాన్ని ప్రబోధించిన గురువులకు, వయోవృద్ధులకు, జ్ఞాన వృద్ధులకు, అనుభవజ్ఞులకు గౌరవమర్యాదలతో సపర్యలను అందించుట లౌకిక విజ్ఞానాన్ని అందించే శాస్త్రాలతో పాటు, ఆధ్యాత్మిక గ్రంథాలను, బ్రహ్మవిద్యలను, వేదవేదాంగములను అధ్యయనం చేయుటవంటివి శాశ్వతమైన శ్రేయస్సును కలిగించే పద్ధతులని ఉద్బోధించినది.శ్రేయస్సును కోరువారు పరిమితమును తప్పి వ్యవహరించరాదు. ఇంద్రి య సుఖములను కూడా మితముగనే అనుభవించవలెను. శబ్ద రూప రస స్పర్శాన్ సహగంధేన కేవలాన్ నాత్యర్థముపేవేత శ్రేయసో-ర్థీ కథంచన ॥అని చెప్పబడినది. శాస్త్రోక్తమైన, గురూపదేశమైన శ్రేయోమార్గాన్ని అనుసరిద్దాం, జన్మను సార్థకం చేసుకుందాం. -సముద్రాల శఠగోపాచార్యులు

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి