Posted On:2/12/2015 3:39:44 AM
|
మానవులు శతం జీవ శరదః అనే రీతిలో వంద సంవత్సరాలు జీవించాలని వేదమాతెక్క ఆకాంక్ష. శతమానం భవతి అంటూ మనుష్యులు నూరు సంవత్సరాలు జీవించాలని వేద పండితులు ఆశీర్వదిస్తూ ఉంటారు. సర్వేజనాః సుఖినో భవంతు (జనులందరూ సుఖంగా ఉందురుగాక), లోకాస్సమస్తా స్సుఖినో భవంతు (లోకాలన్నీ సుఖంగా ఉండుగాక), స్వస్తి ప్రజాభ్యః (ప్రజలకు శుభం కలుగుగాక) అని పురోహితులు ఆశీర్వాద పురస్సరంగా ఆకాంక్షిస్తూ ఉంటారు.
జనులలో సజ్జనులు, దుర్జనులు ఉంటారు కదా. అందరూ బాగుండాలి అని కోరుకుంటే సజ్జనులతో పాటు దుర్జనులు కూడా బాగుండాలని కోరినట్లు అవుతుంది. దుర్జనులు బాగుంటే వారు చేసే దుర్మార్గాలు కూడా రోజురోజుకీ పెరిగిపోతుంటాయి కదా. అందువల్ల జనులందరూ ముందుగా సజ్జనులు కావాలి. సజ్జనులందరూ క్షేమంగా ఉండాలని కోరడంలోనే ఔచిత్యం ఉంటుంది. సర్వేజనాః సజ్జనాః భవంతు, సజ్జనాః సర్వే సుఖినో భవంతు అని సమాజానికి హితాన్ని ప్రబోధిస్తున్న కొందరు ఆధ్యాత్మిక గురువులు భావిస్తున్నారు.
అన్యాయాలకు అధర్మాలకు పాల్పడే వారివల్ల సమాజంలో శాంతి కొరవడి సమాజక్షేమానికి, భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. అధర్మాత్ములైనవారికి పదేపదే దీర్ఘాయుష్యం కలగాలని కాంక్షించడం సముచితం కాదు. అధర్మం చేసేవాడికి చిరంజీవిత్వం వ్యర్థం అనర్థం కూడాను. అందువల్ల ధర్మనిష్ఠలు, తమ శ్రేయస్సుతో పాటు తోటి ప్రాణుల యోగక్షేమాలను కూడా కాంక్షించేవారు స్వపరభేదం లేకుండా ఔదార్యబుద్ధితో విశ్వమానవశ్రేయస్సును కలిగియుండాలి.
చిరజీవిత్వ మనర్థం పురుషస్యాధర్మచారిణో భవతి
చిరజీవిత్వం సఫలం భవతి హి ధర్మైకనిరతస్య॥
అని సుప్రసిద్ధ నీతి శాస్త్రజ్ఞుడైన సుందరపాండ్యుడు పేర్కొన్నాడు.
ధర్మనిరతులు పెరగాలని, ధర్మనిష్ఠలు దీర్ఘాయుష్యం కలవారు కావాలని, వీరిని ఆదర్శంగా గ్రహిస్తూ అధర్మాత్ములు తమ జీవనశైలిని మార్చుకోవాలి అనే సుందరపాండ్యుడు భావనకనుగుణంగా లోకోపకార బుద్ధి కలిగిన మహనీయులు అందరూ దీర్ఘాయుష్యులై, పరిపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలని ఆకాంక్షిద్దాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment