Posted On:2/13/2015 12:25:41 AM
|
వాసః కాంచన పంజరే నృపకారమ్భోజైస్తనోర్మార్జనం
భక్ష్యం సాధు రసాల దాడి మపలం పేయం సుధాభం పయః
పాఠః సంసది రామనామ సతతం ధీరస్స కీరస్యమే
హావాహన్త తథాపి జన్మవిటపిక్రోడే మనోధావతి॥
స్వేచ్ఛాకజీవిగా, ధీరగా జీవించిన నేను చిలుకను, బంగారు పంజరంలో నివసిస్తున్నారు. రాజు తన చేతులతో నన్ను ప్రేమగా స్పృశిస్తుంటాడు. మంచి మామిడి, దానిమ్మ పళ్ళను ఆరగిస్తున్నాను. అమృతం లాంటి నీళ్ళు తాగుతుంటాను. రామనామం స్మరిస్తుంటాను. ఇన్ని ఉన్నా నా మనస్సు నే పుట్టిన చెట్టు ఒడివైపే పరుగెడుతుంది. ఎంతటి భావగాంభీర్యత దాగుందీ మాటల్లో. లోకంలో భగవంతుడు ప్రతీదీ పొందిగ్గా అందంగా, సున్నితంగా స్పష్టించాడు. ఎక్కడుంటే ఏముందిలే! హాయిగా బ్రతికితే చాలు. అంటూ మనసు ను పదే పదే సమాధానపరుస్తూ బ్రతికేస్తాం. ఆ మనసు నొచ్చుకుంటే నా ఊరైతే ఎంత సౌకర్యంగా ఉండేదోననే సందర్భాలు జీవితంలో లేకపోవు. తన నా వాళ్ళూ, తల్లిదండ్రులూ, బంధువులు లేకుండా ఎంత ఆర్భాటంగా బ్రతికినా సంతృప్తి కలుగదు. కన్నూరిలో ఆనందంగా బ్రతికితే లభించే మానసిక సాంత్వనే వేరు. అది అనుభవైకవేద్యమే కానీ అనిర్వచనీయం.
రామారావణయుద్ధం ముగిసి విభీషణుని కోరిక మేరకు లంకలో అడుగుపెట్టారు సీతారామలక్ష్మణులు. అందమైన బంగారు లంక. ప్రాకారాలన్నీ సువర్ణమయం. ఎటుచూసిన స్వర్ణమే. అందులోనూ అద్భుతమైన భవన నిర్మాణ కౌశలం అబ్బురపడిన లక్ష్మణుడు తన్మయత్వంలో రామా మన మూ ఈ బంగారు లంకలోనే ఉండిపోదామా? అని అడిగినదే తడవు చిరుమందహాసంతో శ్రీరాముడు జననీ, జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవని సెలవిస్తాడు. ప్రపంచంలో భోగభాగ్యాలన్నీ కల్పించిన పరాయి స్థానంలో కడుపునిండదు. కమ్మని నిద్రారాదు. ఎదో వెలితి. అదే పుట్టినగడ్డపై మనసులో ఉన్న ఆంతరంగిక మమకారం తాలూకు జ్ఞాపకం. తడి ఆరని కన్నీటి చెమ్మ. స్వేచ్ఛాజీవిగా పుట్టిన నీకు అస్తిత్వం ఇచ్చిన స్వస్థలానికి ఆదరణతో అంకితం చేయాలి జీవితం.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment