Posted On:2/18/2015 2:58:07 AM
|
త్రోటీపుటం కరట కుడ్మల యాథ తాత
యావత్ ప్రతివ్రజతి నాకమయం మరాలః
నోచేద మంగళ కఠోరరవా విహంగాః
సర్వే భువీతి నిజసంసది శంసితానః ॥
అనుభవం గల ఒక పక్షి కాకితో, హంస అనే అతిథి తన స్థానానికి వెళ్ళేవరకూ కొంచెం నీ నోరు కట్టిపెట్టు. లేదంటే భూ లోకంలోని పక్షులన్నీ అమంగళంగా, కఠోరంగా అరుస్తాయని వారి లోకంలో చెబుతుందని అంటుంది. ఈ మాత్రం అభిమానం మనుషులకు లేదా! పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులు ఆ దోషాన్ని నెత్తిన వేసుకుంటారు. తల్లిదండ్రులే తప్పుచేస్తే పిల్లలు అనుభవించక తప్పదు. ఎంత కుటుంబ కలహాలున్నా బయటివారి ముందు లోకువ కాము. ఎంతటి చెడుగుణం కలవాడైనా విదేశీయుల ముందు చెడ్డగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఆ దేశమే అలాంటిదనే అభిప్రాయం ఏర్పడుతుంది.
అతిథిదేవోభవ అన్న సంస్కారమే ఆలంబనగా పెరిగిన భరతభూమిలో జన్మించిన మనమంతా పాశ్చాత్య ధోరణి అలవర్చుకొని ఆధునికంగా ఎదగడంలో తప్పులేదు. అలాగని కూర్చున్న కొమ్మనే నరికేసుకుంటే బాధపడేదీ మనమే కదా!
లోకంలోని అనేక జీవరాశులలో విలక్షణ తత్తంతో, వివేక గాంభీర్యంతో జనించిన మహామహుడు మనిషి. మనిషిని మనిషిగా సమాజానికీ, ప్రపంచానికీ పరిచయం చేసేది స్వీయ గౌరవమే. అదే ఆత్మగౌరవమై, జాతిగౌరవమై భాసిల్లుతుంది. శ్రీరామచంద్రుడు మనిషిగా జన్మించి మానవీ య విలువలనూ, ఔన్నత్యాన్నీ చాటిచెప్పాడు. వ్యక్తిలో మొదలైన మార్పు ఏదైనా కుటుంబాన్నీ, సమాజాన్నీ, జాతినీ, దేశాన్నీ, ప్రపంచాన్నీ, మార్చేస్తుందని, మార్పు మనతోనే మొదలవ్వాలనీ తెలియపరిచాడు. మనిషి తనను తాను గౌరవించుకోవాలి. ఏ సమయంలోనూ నిరుత్సాహపరుచుకోవద్దు. సహజంగా మంచి సంస్కారం గల వ్యక్తి మాత్రమే అంతరంగపు వాణి విని ఆదర్శపథంలో పయనిస్తాడు. మనిషిని మనిషి గౌరవించాలి. తద్వారా సమాజం గౌరవించబడాలి. జాతి గౌరవంతో విరాజిల్లాలి.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment