Posted On:2/4/2015 1:33:07 AM
|
అహింసా సత్యవచనం ఆనృశంస్యం దమో ఘృణా
ఏతత్ తపోవిదుః ధీరా న శరీరస్య శోషణమ్ ॥
అని మహాభారతం శాంతిపర్వంలోని సూక్తి మనకు ప్రబోధిస్తున్నది. మాటలతో కాని, చేష్టలతోకాని, మన సంకల్పములలోగాని ఎవరినీ ఏ రకంగా కూడా బాధించకపోవడాన్ని అహింస అంటారు. మూడు కాలాలలో బాధింపబడని సరైన వాక్కును సత్యమని అంటారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం కాకుండా సర్వ ప్రాణి సంక్షేమా న్ని కోరుతూ చెప్పే మాటలే, చేసే క్రియలే సత్య శబ్దముచే ప్రకటింపబడుతాయి సత్యం భూతహితం ప్రోక్తం యథార్థ కథనం నహి అనే వ్యాస భారతసూక్తి వెల్లడిస్తున్నది.
బాహ్యంగా ఉండే ఇంద్రియములను నిగ్రహించడాన్ని దమము అని వ్యవహరిస్తారు. అహింస, సత్యము, దమము అను లక్షణములను కలిగియుండడంతో పాటు నీచబుద్ధి లేకుండా, మృదుస్వభావాన్ని కలిగియుండుట, సర్వప్రాణులపట్ల దయతో మెలగుట అను గుణములను అలవరచుకొనుటయే తపశ్చర్యగా మన ప్రాచీన వాఙ్మయం పేర్కొంటున్నది. మన పూర్వులైన మహర్షుల, మునుల ఆచరణ కూడా మహాభారతం శాంతిపర్వంలోని సూక్తిని ధృవపరచునట్టిదే.
శరీరాన్ని బక్కచిక్కించుకొనేరీతిలో ఉపవాసాలు చేస్తూ, గడ్డాలు మీసాలు పెంచుకుంటూ, కళ్ళుమూసుకొని అడవిలో కూర్చోవడమే తపస్సు అనే కొందరి ఆలోచనా విధానానికి భిన్నంగా తపశ్చర్య అని దేనిని పేర్కొనాలో మనకు శాంతిపర్వ సూక్తి విశదంగా పేర్కొన్నది. వ్యాసభారతోక్తులను అనుసరించి మనం కూడా ఈ రకమైన తపశ్చర్యను ఆచరించే ప్రయత్నం చేద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment