Posted On:2/11/2015 1:55:52 AM
|
మంచి ఎవరు చెప్పినా, ఎక్కడ నుంచి వచ్చినా నేర్చుకోవాలని వేదం చెబుతుంది. సామాజిక నేపథ్యంలో మనిషి ఎదగాలంటే తల్లిదండ్రులూ, గురువులూ, స్నేహితులూ, శ్రేయోభిలాషులూ, మార్గదర్శకులు ఇలా ప్రతి ఒక్కరూ మంచిమాటలు చెబుతూ భావితరాన్ని ప్రోత్సహించాలి. వారు చెప్పేమాటలు వింటూ పిల్లలు ఎదగాలి. జీవితం అందించే విభిన్న కోణాల్లో మనిషి మనుగడ కొనసాగాలంటే సుభాషితం మాత్రమే ఆలంబనం.
సుభాషితం హారి విశత్యధో గలాన్న
దుర్జనస్యార్క రిపోరివామృతమ్
తదేవ ధత్తే హృదయేన సజ్జనో
హరిర్మహారత్నమివాతి నిర్మలమ్॥
సూర్య భగవానుని శత్రువైన కేతువుకు తల తప్ప శరీరమే లేదు గనుక అమృతం హృదయంలోకి చేరదు. సహృదయమే లేని దుర్జనుడికి సుభాషితం హృదయాన్నెలా చేరుతుంది. అదే సుభాషితం శ్రీహరి హృదయసీమను కౌస్తుభం చేరినట్లుగా సజ్జనుని హృదయంలో నిలిచిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలను ఆధారం చేసుకొని వివేకానందుడు చెప్పిన సుమధుర భాషణం తరగని సుభాషితమై నేటికీ అలరారుతుంది. ఎందరినో కార్యోన్ముఖం చేస్తూ ఉత్సాహపరుస్తుంది. భారతీయ సాహిత్యంలోని సుభాషితాలు సర్పకాల సర్వావస్థల్లో, సంక్లిష్ట పరిస్థితుల్లో, స్తబ్ధత ఆవరించిన సమయంలో ఆపన్నహస్తాలై, మానసిక సంకల్పాలై మనిషికి దారి చూపిస్తాయి.
ఆశావహదృక్పథంతో ప్రతి ఒక్కరూ సత్సంబంధాలను కలిగివుంటూ, మంచి మాటలే మానసిక భావాలవుతూ, మచ్చుకైనా అలుపే లేని ఆనందం జీవితమవుతూ బతకాలి. పుట్టుకతో గానీ, పరిస్థితుల వలనగానీ మనిషి ఎంత క్రింది స్థానంలో ఉన్నా తనకున్న సహజమైన ఉత్తమగుణం సహృదయం. దానికి కావలసిన ప్రేరణ సుభాషితం. మానవ ధర్మాన్ని తారాస్థాయికి చేర్చగల సాధకుడవుతాడు మనిషి. సంతోషంలో, దుఃఖంలో, బాధలో, ఆలోచనలో గుంఫనంగా ఉన్న మనిషి భావాలను ప్రేరేపించే సుభాషితం నిర్దిష్ట మర్గాన్ని సుగమం చేస్తుంది. దాని ని ఆకళింపు చేసుకొని ఆచరించగలిగితే చాలు జీవితం ధన్యమవుతుంది. మనిషి మహనీయుడై భావితరానికి ఆదర్శంగా నిలుస్తాడు. వారసత్వ సంపదగా సుభాషితమనే రత్నకోశం తరతరాలకూ విస్తరిస్తుంది.
- ఇట్టేడు అర్కనందనా దేవి
No comments:
Post a Comment