Posted On:2/6/2015 11:53:44 PM
|
ఏమీ చేయలేకపోయామనే బాధ మనసును తొలి చేస్తుంటే అసంతృప్తి హుదయ సామ్రాజ్యాన్ని ఆక్రమిస్తుంది. అశాంతి జీవితాన్ని చీకటి చేస్తుంది. నేను అనే భావనలో భగవంతుడున్నాడు. ప్రపంచమంతా భగవత్సరూపం. పరస్పర స్నేహభావంతో, నేను-నాకు అని కాక ఏ ఒక్కరికైనా చేసిన సహాయం, దానం మంచి పనులుగా జీవిత ఖాతాలో చేరిపోతాయి. పుణ్యకర్మలు జీవితాన్ని పునీతం గావిస్తాయి.
శిక్షాక్షయం గచ్ఛతి కాలపర్యయాత్
సుబద్ధమూలా నిపతన్తి పాదపాః
జలం జలస్థానగతం చశుష్యతి
హుతం చదత్తం చ తథైవ తిష్ఠతి॥
కాలం అనేది గడుస్తూ వుంటే నేర్చుకున్న విద్యలన్నీ మరుపుచే మరుగున పడిపోతాయి. భూమి లోతుల్లోకి అతిదృఢంగా పాతుకుపోయిన మొదళ్లు ఉన్నా చెట్లు కూలిపోతాయి. చెరువుల్లోని నీరూ ఎండిపోతుంది. కానీ చేసిన యజ్ఞాలూ, దానాలూ మంచి పనులుగా, పుణ్యకర్మలుగా శాశ్వతంగా లోకంలో నిలిచిపోతాయి.ఎందరో మహానుభావులు ఆదర్శమంటే అర్థం చెప్పేలా జీవించి కాలగర్భంలోకి వెళ్లిపోయారు. వారు చేసిన మంచిపనులు అనే కారణంతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. సేతుబంధన శాశ్వత్వాన్ని కార్యంలో భాగంగా చిన్నప్రాణి ఉడత ఇసుకను ఇచ్చి రామకథలో శాశ్వతత్వాన్ని పొందగలిగింది. ఆలోచన వివేకం, సంకల్పం గల మనిషి తలుచుకుంటే చేయలేనిది లోకంలో ఉంటుందా!
పంచభూత్మాతక ప్రపంచంలో పంచప్రాణాలు నిలుపుకునేందుకు శాయశుక్తుల పోరాడే మనిషి తోటివారి ఆకలిని గ్రహించకపోవడం అసంభవం. యధాశక్తి సాటి మనిషికి సాయపడటం, దానధర్మాది కార్యక్రమాలు చేయడం ఆపద సమయంలో సమాజం నిద్రపోదని చెప్పేలా ప్రవర్తించడం.. ఇవి చాలవా! మానవత్వాన్ని పరిమళింపజేసే మనిషిని చరిత్ర పుటల్లో చేర్చడానికి. లేదు-కాదు అనే పదాలు మానవ పదకోశంలో ఇమడలేక మనిషి సద్గుణ సంపత్తిని చూసి చెరిగిపోవాలి. సుహృదాలోచన పరంపరకు మానవత్వం శ్రీకారం చుట్టాలి.
- ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment