Thursday, February 12, 2015

దుర్జన వచనాలు

దుర్జన వచనాలు
Posted On:2/9/2015 11:53:47 PM
అల్పుడెపుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను అనే పద్యము తెలుగువారందరికీ సుపరిచితమే. సజ్జనులు ఇతరుల మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా మాట్లాడుతారు. అల్పుడు తనను అందరూ గొప్పగా భావించాలనే ఉద్దేశ్యంతో తనలో లేని గొప్పతనాన్ని ఉన్నట్టుగా చెప్పుతాడు. గొప్పలకు పోతాడు. అసత్యాలను పలుకడానికి కూడా వెనుకాడడు. అయితే అల్పుల పలుకుల కన్న సజ్జనుల సంభాషణ కన్న భిన్నంగా దుర్జన వచనాలు ఉంటాయి. ఇవి ఇతరులను అమితంగా బాధించేవిగా ఉంటాయి. పైగా చాలా తీక్ష్ణంగా ఉంటాయి. మండు వేసవిలో భరించలేనంత తీక్ష్ణంగా ఉండే సూర్యకిరణాలవలె మలమల మాడుస్తాయి. తీవ్రంగా తపింపజేస్తాయి.
తెలిసి పట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాల్చే అగ్నివలె దుర్జనుల వాక్కులు తీవ్రంగా గాయపరుస్తాయి. మసిచేస్తాయి. స్వపరభేదం లేకుండా అందినదాన్నల్లా కాల్చేసే స్వభావం కల అగ్నికన్నా, వేల మైళ్ళ దూరంలో ఉన్నవారిని కూడా బాధించే సూర్య కిరణాల కన్నా ఎక్కువ తీక్షంగా ఉండేవే దుర్జన వచనాలు.
సూర్యకిరణాలలోని, అగ్నిలోని వేడిమి శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి. కాని దుర్జన వచనాలు మనసును గాయపరుస్తాయి. మనసుకు గాయమైతే మనిషి దుర్బలుడౌతాడు, క్రుంగిపోతాడు, కృశించిపోతాడు. దుర్జన వచనాలు తలచుకొని తలచుకొని బాధపడేలా ప్రభావితం చేస్తాయి. అందుకే నీతిశాస్త్రజ్ఞుడైన కవీశ్వరుడు సూర్యకిరణాలకన్న అగ్నికన్న దుర్జనవచనాలే తీక్షమైనవి.

దివసకరః కిల తీక్షో దివసకరాత్ పావకో మహాతీక్ష్ణః
దివసకర పావకాభ్యాం దుర్జనవచనాని తీక్ష్ణాని ॥ అని పేర్కొన్నాడు.
దుర్జనులు తమ మాటలతో ఇతరులను నిష్కారణంగానే బాధిస్తూ ఉంటారు. అని నొప్పించడం వారికి పట్టుబట్టలు కట్టుకొని పండుగ జరుపుకున్నంత ఆనందంగా ఉంటుందేమో. పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం చేసినంత సంతృప్తిని కలిగిస్తుందేమో. అలా మాట్లాడే దుర్జనులకు ఆప్తులు ఎవరూ ఉండరు. ఆత్మీయతను ఎవరూ పంచరు. అందరూ దుర్జనులను ఆమడదూరంలో ఉంచుతారు. అందుకే మనం కూడా దుర్జనులతో సాంగత్యం ఏర్పరచుకోకుండా, వారి మాటల బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుదాం.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular