Posted On:11/25/2014 1:56:54 AM
|
మనిషి బతికినంతకాలం సుఖంగా బతికే అవకాశం లేకుండా మనోవ్యాధులు, అనేక రోగాలు పట్టిపీడిస్తూ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాయి.సంపదలు ఎక్కువ అవుతున్న కొద్దీ అనూహ్యంగా అడ్డు అదుపులేని ఆపదలు కుప్పలు తెప్పలుగా వచ్చి మీద పడుతుంటాయి. పుట్టిన ప్రతిప్రాణిని మాయదారి మృత్యువు తన పొట్టన పెట్టుకుంటూనే ఉన్నది. దైవాధీనమైన ఈ జగత్తులో ఏ ఒక్కటి కూడా సుస్థిరమని పేర్కొనుటకు అవకాశమే లేదు.
కాబట్టి మనిషి తన జీవితంలో ఆడంబరాలకు, అట్టహాసాలకు తావివ్వకుండా మితిమీరిన కోరికలకు అడ్డుకట్ట వేస్తూ వైరాగ్య భావ సంపున్నుడై జీవితాన్ని కొనసాగించినప్పుడే సుఖశాంతులు చేరువవుతాయి అనే భావాన్ని భర్తృహరి మహాకవి ఓ శ్లోకం ద్వారా వెల్లడించాడు.
ఆదివ్యాధి శతైర్జనస్య వివిధైరారోగ్యమున్మూల్యతే
లక్ష్మీర్యత్ర పతంతి తత్ర వివృతద్వారా ఇవ వ్యాపదః
జాతం జాతమవశ్యమాశు వివశం మృత్యుః కరోత్యాత్మసాత్
తత్కిం నామ నిరంకుశేన విధినా యన్నిర్మితం సుస్థిరమ్॥
భర్తృహరి ప్రబోధాన్ని, మహనీయుల మహితోక్తులను, గురూపదేశాలను శిరసావహిస్తూ భౌతిక సుఖాలకన్న ఆముష్మికమైన శాశ్వతానందాన్ని పొందాలనే తపనను అలవరచుకుందాం. క్షణికసుఖాల పట్ల భోగైశ్వర్యాల పట్ల ఉదాసీన వైఖరిని వైరాగ్యాన్ని కలిగి ఉందాం. వైరాగ్యభావ సంపన్నులమయ్యేందుకు ప్రయత్నిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment