Bhagavannama Smarana

భగవన్నామ స్మరణ
Posted On:12/2/2014 2:13:59 AM
ధర్మరాజు భీష్మాచార్యుల వద్దకు వచ్చి స్తువన్తః కం కమర్చన్తః ప్రాప్నుయు ర్మానవాశ్శుభమ్ ఎవరి గుణాలను స్తుతిస్తూ, ఎవరిని అర్చిస్తూ మానవులందరూ లౌకికమైన అభ్యుదయము ను, నిశ్రేయసమనెడు మోక్షాన్ని పొందుతారో తెలుపుమని ప్రార్థించెను. వెంటనే భీష్మాచార్యులు జగత్ప్రభువైన, పురుషోత్తముడైన, దేవదేవుడైన అనన్తుడైన శ్రీమహా విష్ణవును వేయి నామాలతో స్తుతిస్తే సకల ఫలములు, సర్వలాభాలు కలుగుతాయని పేర్కొన్నాడు. భగవంతుని నామ రూప గుణవైభవములను నిరంతరం స్మరిస్తూ అనన్య భక్తితో భగవంతుణ్ణి ఆరాధించేవారు ఒక్క క్షణకాలం పాటు భగవచ్చింతనకు దూరమైనా వారు అదొక హానికరమైన విపరీత పరిణామంగా భావిస్తారని
యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో న చిన్త్యతే
సా హానిస్తన్మహచ్ఛిద్రం సా భ్రాన్తిస్సాచ విక్రియా॥ అనే శ్లోకం తెలుపుతున్నది. భక్తులు చుట్టూ వ్యాపించిన అగ్నిజ్వాలల మధ్యనైనా ఉండగలరు కాని భగవంతుని తలంచని వ్యక్తుల మధ్య నివసించలేరని, దొంగలు సర్వస్వాన్ని దొంగిలిస్తే ఎంత బాధపడుతారో అంతటి బాధను భగవన్నామోచ్చారణకు ముహూర్తకాలం దూరమైనందు వల్ల పొందుతారని పరాశరభట్టరువారు విష్ణ సహస్రనామ భాష్యంలో పేర్కొన్నారు.
జగద్ధితమును కోరు పరమర్షులలో అగ్రగణ్యుడైన వ్యాస భగవానుడు ఐశ్వరాన్ని కోల్పోయినవారు, దుఃఖితులు, అశక్తులు, శత్రుభయాన్ని పొందినవారు, భయంకరమైన వ్యాధుల బారిన పడినవారు అందరూ భగవంతుడైన శ్రీమన్నారాయణుని నామాన్ని స్తుతించాలి. ఆ విధంగా స్తుతిస్తే సర్వదుఃఖాలు తొలగుతాయి. సుఖసంతోషాలతో జీవనాన్ని కొనసాగించ గలుగుతారు అనే విషయాన్ని విష్ణు సహస్రనామస్తోత్ర ఉత్తర పీఠికలోని
ఆర్తావిషణ్ణా శ్శిథిలాశ్చ భీతాః ఘోరేష చ వ్యాధిష వర్తమానాః
సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్తదుఃఖా స్సుఖినోభవంతి॥
అనే శ్లోకం ద్వారా లోకహితకరమైన రీతిలో ఉపదేశాత్మకంగా పేర్కొన్నారు. కలౌ నామ సంకీర్తనమ్ అనే సూక్తి కలియుగంలో భగవంతుని నామస్మరణ వల్లనే ముక్తి కలుగుతుందని తెలుపుచున్నది. అందువల్ల భగవంతునికి ప్రీతికరమైన నామస్మరణ తప్పక చేద్దాం.


Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి