Posted On:11/29/2014 12:05:58 AM
|
యజ్ఞదానతపఃకర్మన త్యాజ్యం కారమేవతత్!
యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామ్!
మానవ ఔన్నత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సంస్కృతి యజ్ఞం-దానం- తపస్సు-త్యాగం అనే విలువలకు ప్రతీకగా నిలిచింది. యజ్ఞదాన తపస్సులలో అంతర్గతంగా త్యాగం ఉంది. త్యాగనిరతితో, కృతజ్ఞతాభావంతో, కర్తవ్యతా జ్ఞానం తో మనిషి బతకాలి.
ఆధ్యాత్మిక చింతనతో పూజా పురస్కారాదులు చేయడం దేవయజ్ఞం. వంశంలోని పూర్వికుల జ్ఞాపకంలో నిర్వహించే శ్రాద్ధాది కర్తవ్యవిధి పితృయజ్ఞం. పరస్పర సహకార తత్తం కలిగి సాటివారికి సహా యం, దానం చేయడం మనుష్యయజ్ఞం. సకల ప్రాణికోటిలోనూ ఆత్మ తత్తం చూస్తూ దయకలిగి ఉండటం భూతయజ్ఞం. అనాదిగా ఎందరో మహానుభావులు అందజేసిన విద్య నూ, విజ్ఞానాన్ని నశించిపోకుండా కాపాడటం రుషియజ్ఞం. ఈ ఐదు విధాలైన విశేష యజ్ఞాలను కర్తవ్యంగా భావించి ఆచరించడమే అసలైన జీవిత యజ్ఞం.
ప్రతిఫలాపేక్ష లేకుండా, సంపూర్ణ నిశ్చలతతో యథాశక్తి అన్న, ధన, వస్త్ర, విద్యాదులు ఇవ్వడం దానం. ఒకవంతు దానం కోటిరెట్ల సంతృప్తిని అందిస్తుంది. సంతృప్తిని మించినదీ, విలువైనదీ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి లేదు.
మనసా వాచా కర్మణా ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ, మానసిక పరిణతిని పెంపొందించుకొని, ఇంద్రియాలను జయించి సంకల్పబలంతో బతకడమే తపస్సు. సన్యాసాశ్రమంలోనే తపస్సు భాగం కాదు. సానబట్టిన సంసారయోగి నిర్వహించే గృహస్థాశ్రమంలోని తపస్సు మహోన్నతమైంది. సంస్కృతి పంచిన యజ్ఞ, దాన, తపస్సులనే సంస్కారాలలో అపారమైన, అత్యున్నతమైన త్యాగం ఇమిడి ఉంది. త్యాగనిరతి కలిగిన మనిషి కుటుంబానికి ఆకాశమే హద్దు. లోకంలోని ప్రతీబంధం తాననుభవించే ఆనందానుభూతుల హస్తాక్షరమై విరాజిల్లుతుంది.
-ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment