Posted On:12/20/2014 2:02:09 AM
|
అష్ట వసువులు వసిష్ఠుని శాపము వలన శంతనుని ద్వారా గంగకు జన్మించిరి. వెనువెంటనే గంగలో, గంగచేతనే విసిరివేయబడి శాప విమోచన పొందిరి. అష్టమ వసువైన భీష్మున్ని కూడా గంగ తీసికెళ్లు సమయములో శంతనుడు వారించినందువలన భీష్మున్ని శంతనునికి వప్పగించి తాను వెళ్లుటకు సిద్ధపడెను.
శంతనుడు గంగను ఉద్దేశించి ఇట్లడిగెను- ఈ వసువులకు వసిష్ఠుడు శాపమెందుకిచ్చెను మరియు అష్టమ వసువైన భీష్ముడు భూలోకమున ఎందుకుండ వలెను?
గంగాదేవి ఇట్లు చెప్పెను- విశ్వ విఖ్యాతమైన వసిష్ఠుడు వరుణుని పుత్రుడు. అతడు మేరు పర్వతము దగ్గర ఉన్న ఆశ్రమములో ఉండేవాడు. కామధేనువు యొక్క పుత్రికయైన నందిని వసిష్ఠుని దగ్గర ఉండేది. ఒకనాడు వసువులెల్లరు తమ తమ భార్యల యుక్తముగా ఆ తావుకు విహారమునకు వచ్చిరి. అచ్చట ఉన్న నందినిని చూసి ద్యౌ అను వసువు భార్యయొక్క ప్రేరేపణ చేత ఇతర వసువులతో కలిసి ఆ గోవును తరలించుకు పోయెను. అందుకని వసిష్ఠుడు వారిని శపించెను. ప్రధాన కారకుడైన ద్యౌ అను వసువు భూలోకమున ఉండునట్లు చేసెను. ఆ రకముగా ఆ వసువే భీష్ముడు అని గ్రహించవలెను.
ఒకనాడు శంతనుడు గంగానది తీరమున విహరిస్తూ నదివైపు చూసి చిత్రపడెను, ఆ జీవనదిలో నీరు అంతంత మాత్రమే ఉండెను. విషయము కనుక్కున్న శంతనుడు మరీ విస్మయమొందెను. ఒక బాలుడు తన అస్త్ర విద్య చేత నీటి ప్రవాహమును ఆపివేసెను. శంతనుడు అయోమయమునకు గురికాగా బాలుడు అంతర్థానయ్యెను.
రాజర్షి శంతనుడు బాలుడుని చూపుమని గంగాదేవిని అడుగగా గంగ బాలుని కుడిచేతిని పట్టుకొని వచ్చెను. మహారాజా ! ఈ బాలుడు మన ఎనిమిదవ సంతానం. వసిష్ఠుని దగ్గర వేద వేదాంగాలు అభ్యసించి అ శ విద్యలన్నియు నేర్చుకొని, యుద్ధములో ఇంద్రునితో సమానుడు, బృహస్పతి మరియు శుక్రాచార్యునంతటి మేధస్సు గలవాడు మరియు పరశురామునంతటి తేజస్సు గలవాడు, దేవవ్రత నామధేయుడు ఇతనిని రాజధానికి తీసికెళ్లండి అని చెప్పెను. రాజర్షి శంతనుడు కుమారున్ని రాజధానికి తీసుకు వచ్చి యువరాజ పట్టాభిషేకము చేసెను.
-ఎ.నర్సింహారెడ్డి
No comments:
Post a Comment