Posted On:11/28/2014 12:38:26 AM
|
మాతా గురుతరా భూమేః ఖాత్పితోచ్చ తరస్తథా I
మనఃశీఘ్రతరం వాతాత్ చింతా బహుతరీతృణాత్ II
లోకంలో తల్లిదండ్రులను మించిన దైవం లేదు. అస్తిత్వాన్ని అందించిన గొప్పవారు వారు. తల్లి భూమి కన్నా గొప్పది. తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడు. మనసు గాలికంటే వేగమైనది. చింత గడ్డిపరక కన్నా వృస్తృతమై అడుగడుగునా తానే ఉంటుంది. కుటుంబానికి రూపమిచ్చిన తల్లిదండ్రులను ఆదరిస్తూ, మానసిక పరిపక్వత గలిగి అనవసర ఆందోళనలకు తావివ్వకూడదు.
మనిషికి ధన్యత చేకూర్చే సద్గుణాలలో నేర్పు ఉత్తమమైనది. అన్ని ధనాలలో కన్నా విద్యాధనం ఎన్నటికీ తరగని నిధి. లాభాలలో గొప్పలాభం ఆరోగ్యం. సుఖాలలో ఉత్తమమైనది సంతృప్తి. జీవితం అందించే పరిస్థితులను నేర్పుతో చక్కదిద్దుకుంటూ, చదువు నేర్పిన విజ్ఞతతో మెలుగుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని తలచి సంతృప్తితో బతకాలి.
మనిషి తనను తాను పోషించుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతూ ఎవ్వరికీ రుణపడక ఉన్న ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం రాకుండా ఆనందంగా బతకగలిగితే నిత్యసంతోషం సంతృప్తిగా తలుపుతడుతుంది. జీవితాంతం తోడుంటుంది.
ధర్మం యొక్క యధార్థ స్వరూపం అతిరహస్య మైనది. ధర్మనిరతితో బతికిన మహనీయుల మార్గాన్ని అనుసరించి వెళ్లడమే మానవ ధర్మం. ఎందుకంటే కాలపురుషుడు ప్రాణికోటిని అజ్ఞానమనే పెద్దబాణలిలో వేసి, సూర్యుడనే అగ్నిని రగిల్చి,రాత్రి పగళ్లు అనే కట్టెలను ఇంధనంగా చేసి మాసాలూ, సంవత్సరాలూ అనే గరిటెలతో వండుతున్నాడు.. అనే వార్తను ధర్మజుడు చెబుతూ కాలగతిలో యుగాలు గడిచిపోతూనే ఉంటాయి. లభించిన జీవితాన్ని ధర్మపోషణతో సార్థక్యం చేసుకోవాలని చెప్పకనే చెబుతున్నాడు. ఈ చరాచర ప్రపంచంలో అన్ని బతుకుతాయి. కానీ వివేకం, ధర్మం తెలిసిన మావన జీవితం ఆదర్శం కావాలి. ధర్మ సంస్థాపన కొనసాగాలి.
-ఇట్టేడు అర్కనందానాదేవి
No comments:
Post a Comment