Posted On:12/3/2014 1:59:08 AM
|
ఆదౌ కులం పరీక్షేత తతో విద్యాం తతో వయః!
శీలం ధనం తతో రూపం దేశం పశ్చాద్వివాహయేత్!!
ఉలితో చెక్కని రత్నం, పూర్వజన్మ పుణ్యాల అఖండఫలం కూతురు. కనుక బాధ్యత గల తల్లిదండ్రులు వివాహ సంబంధ విషయంలో వంశమర్యాదను చూసి తర్వా త చదువు, వయస్సు, నడవడిక, సంపద పరిక్షించాలి. ఆతర్వాత అందం. నివాస స్థానాలకు ప్రాధాన్యం ఇవ్వాలని శాస్ర్తోక్తం. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు. అతి జాగ్రత్తగా, అల్లారు ముద్దుగా పెంచుకొని, అన్ని గుణాలనూ నేర్పి, విదుషీమణిగా ఎదగనిచ్చిన కన్యారత్నం మంచి కుటుంబంలో అడుగుపెడితే ఉన్నతమైన కుటుంబాన్ని సమాజానికి అందిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. రూపం కన్నా గుణం మేలు. ధనం కన్నా బాంధవ్యం మేలు. స్త్రీ రత్నం దుష్కులాదీపి. సామాన్య వంశంలో పుట్టినా స్త్రీ రత్నాన్ని భార్యగా స్వీకరించాలని మనుస్మృతి చెప్పినట్లు స్వీయ వైశిష్ట్యం గల స్త్రీని గౌరవించాలి. ఆదరించాలి. వివాహబంధంలో అవినాభావ దార్శినికత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఏ ధర్మకార్యం చేయాలన్నా ధర్మపత్నియే కదా మూలకారణం.
సమాజంలో కూతురు, భార్య, తల్లి గౌరవించబడితేనే కుటుంబ విలువలు నిలబడుతా యి. వారూ ఆదర్శంగా బతికితేనే సమాజం గర్విస్తుంది. యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రదేవాతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారన్న వేదోక్తి ప్రమాణంగా తల్లిదండ్రులూ, పురుషాధిక్య సమాజం స్త్రీని గౌరవించాలి. సంస్కృతీ పరంపర స్త్రీజాతి ఆదరణతో సుసమాజ నిర్మాణం గావించాలి.
-ఇట్టేడు అర్కనందనాదేవి
No comments:
Post a Comment