Moksha Margam

మోక్షమార్గం
Posted On:12/5/2014 1:24:28 AM
ధర్మార్థకామమోక్షములు అనే చతుర్విధ పురుషార్థములలో చివరిదైన మోక్షమును ఉత్తమ పురుషార్థముగా మన శాస్త్రగ్రంథాలు, పూర్వులైన పెద్దలు ధృవపరచడం జరిగినది. ఉత్తమ పురుషార్థమైన మోక్షమును పొందుటకు కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తులు అనేవి నాలుగు శాస్త్ర సమ్మతమైన మోక్షమార్గాలు.
జనక చక్రవర్తి మొదలైనవారు కర్మమార్గం ననుసరిస్తూ మోక్షమును పొందినారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆసితా జనకాదయః అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పేర్కొనెను. కాని వేదపూర్వభాగంలో చెప్పబడిన రీతిలో వైదిక కర్మాచరణ అంత సులభం కాదు.
రెండవదైన జ్ఞానమార్గము మరింత క్లిష్టమైనది. ఎందుకంటే అనంత శాన్త్రం బహుళా చ విద్యాః అన్నట్లు వేదవేదాంగములు, పురాణేతిహాసములు, దర్శనములు, ఉపాంగములు మొదలైనవాటితో అతి విస్తృతమైనది వాఙ్మయము. ఇంకా మరెన్నో విద్యలు కలవు. కళలేమో అరవై నాలుగు. వీటన్నింటిని అభ్యసించుటకు మానవులకున్న ఆయుర్దాయమేమో తక్కువ. పైగా జీవితంలో బరువు బాధ్యతలు ఎన్నో. బంధాలు, ఎన్నెన్నో అనుబంధాలు, అనేక విఘ్నాలు అల్పోహి కాలః బహవశ్చ విఘ్నాః అని చెప్పబడినది.
మూడవదైన భక్తి మార్గాన్ని అనుసరించినవారు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనకాది మహానుభావులు. వీరివలె సర్వ కాలములయందు సర్వ అవస్థలయందు భగవంతునిపై ప్రేమను (భక్తిని) కలిగియుండుట అత్యంత దుర్లభము.
చివరిది ప్రపత్తి మార్గము. ఇది సులభమే. కాని ఈ మార్గానుయాయులకు అవసరమైనది విశ్వాసము. షడ్విధ శరణాగతిలో ్ర్ఙరక్షిష్యతీతి విశ్వాసః - పరమాత్మ తప్పక రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనే విశ్వాసం అత్యంత ప్రధానం.
ఈ కర్మజ్ఞాన భక్తి ప్రపత్తి మార్గాలే కాక, జ్ఞానానుష్ఠాన సంపన్నులైన సదాచార్యుని ఆశ్రయించి, ఆచార్యుని ఆచరణను, ఉపదేశములను అనుసరించుట వల్ల కూడా మోక్షము తథ్యమని మన పూర్వుల అభిప్రాయం. ఆచార్యాభిమానం కూడా మోక్షమార్గమని తెలియజేసి రి. దీనికే అంతిమోపాయనిష్ఠ అని పేరు. ఈ మార్గాన్ని పంచమోపాయ నిష్ఠ అని కూడా వ్యవహరిస్తారు. ఉత్తమ పురుషార్థమైన మోక్షమును పొందుటకు తగిన మార్గాన్ని ఎంపిక చేసుకుని త్రికరణ శుద్ధితో ఆ మార్గంలో పయనించే ప్రయత్నం చేద్దాం.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి