Parusha Vakku

పరుషవాక్కు
Posted On:12/24/2014 1:51:55 AM
విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు.
ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు.
యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్రాణాల ను హరిస్తుంది. నిప్పు నిలువునా మనిషిని కాల్చివేస్తుంది. పాపకర్మలు మనిషిని అప్పుడప్పు డూ ఆయా సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి. కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుకులే .

న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః
పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥
అని సుందరపాండ్యుని ఆర్యోక్తి. (ఆర్యావృత్తంలో పలికిన సూక్తి).

కఠినంగా, పరుషంగా మాట్లాడేవారికి ఆప్తులు, ఆత్మీయులు దూరమౌతారు. సన్మార్గంలో పయనించేవారు అట్లే అన్యమార్గంలో పయనించేవారు అనే భేదం లేకుండా స్త్రీలు-పురుషులు చిన్నలు-పెద్దలు అనే తేడా లేకుండా అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరికీ మనోవేదనను కలిగించేవి పరుషవాక్కులే అనే సత్యాన్ని గుర్తిద్దాం. పుల్లవిరుపు మాటలతో, వ్యంగ్యోక్తులతో, అధిక్షేపాలతో, నిష్ఠరమైన వాక్కులతో హృదయానికి గాయాన్ని కలిగించే విధానానికి స్వ్తిచెప్పే ప్రయత్నాన్ని చేద్దాం.
పాముకాటుతో, విషప్రయోగంతో, అగ్నిప్రమాదంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి. ఈ విషాదాన్ని మించినరీతిలో పరుషవాక్కులచేత గాయపడినవారు అటు ప్రాణాలు పోక, ఇటు ప్రశాంతంగా ఉండలేక ప్రతిక్షణం సతమతమవుతూ విలవిలలాడుతూ ఉంటారు. ఇటువంటి బాధ మనవల్ల మరొకరికి కలగడం సరికాదనే సత్యాన్ని గుర్తిద్దాం. ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం.

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి