Posted On:12/17/2014 1:22:18 AM
|
సదాచారణ, సదాశయాలు కలిగిన సాధుసజ్జనులతో సాంగత్యాన్ని కలిగివుంటే ఐహికమైన సుఖసంతోషాలతో పాటు ఆముష్మికమైన శ్రేయస్సును కూడా పొందవచ్చు. సత్పురుషుల దర్శనం పుణ్యాన్ని కలిగిస్తుంది. సత్పురుషుల స్పర్శవల్ల సకల పాపాలు తొలగుతాయి. సత్పురుషులతో మాట్లాడటం వల్ల పవిత్రమైన అనేక నదుల్లో స్నానం చేసినట్టి ఫలితం కలుగును. సత్పురుషులకు చేసే నమస్కారం ముక్తిని ఇస్తుంది.
సాధూ నాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్
సంభాషణం తీర్థకోటి వందనం మోక్షకారణమ్ ॥ అని ఆర్యోక్తి.
సత్యాంగత్యం వల్ల మందబుద్ధి తొలగుతుంది. సత్సాంగ త్యం సత్యమైన వాక్కులనే పలికిస్తుంది. పాపాన్ని దూరం చేస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. కీర్తిప్రతిష్ఠలను అంతటా వ్యాపింపచేస్తుంది. సత్సాంగత్యాన్ని కలిగియున్న భక్తులకు అందరి అభిమానం సులభంగా అందుతుంది.ఈ విధమైన బహుళ ప్రయోజనాలను అందించే సత్సాంగత్యం మనకు చేయలేని మేలు అంటూ ఏదీ ఉండదు
జాడ్యం ధియో హరతి వాచి సత్యం
మానోన్నతిం దిశతి పాపమపాకరోతి
చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం
సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్ ॥ అని భర్తృహరి పేర్కొనెను.
చిత్రవిచిత్రమైన బంధుత్వాలతో, బాధ్యతలతో, బంధాలతో, వివిధ ఆకర్షణలతో, రకరకాల సమస్యలతో సతమతమవుతూ యంత్రాలతో పోటీపడుతూ యాంత్రికమైన జీవనాన్ని కొనసాగిస్తూ తమ జీవితానికి గమ్యమేదీ, లక్ష్యమేదీ అని పరితపించేవారికి చందనస్పర్శవలె చంద్రునివెన్నెలవలె హాయిని ఆనందాన్ని కలిగించేది సత్సాంగత్యమే. ఇట్టి సత్సాంగత్యాన్ని ఏర్పరచుకుందాం. జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment