Posted On:12/18/2014 1:50:21 AM
|
శ్రీకృష్ణావతార సందర్భంలో భగవానుడు ఆయుధం పట్టనని తాను చేసిన ప్రతిజ్ఞకన్నా తన భక్తుడైన భీష్మాచార్యుడు పరమాత్మచేత ఆయుధం పట్టిస్తాను అని చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తూ యుద్ధభూమిలో రథచక్రాన్ని చేపట్టాడు.
అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరుటకు తన చక్రంతో సూర్యకిరణాలను అడ్డుకొని సూర్యాస్తమయం అయినట్లు భావించేరీతిలో ఒక సందర్భాన్ని కల్పించాడు.
హిరణ్యకశుపుని, రావణాసురుని తపస్సులను మెచ్చి బ్రహ్మరుద్రులు ఇచ్చిన వరాలకు ఆటంకం లేకుండా శ్రీహరి నృసింహ, శ్రీరామాది అవతారాలనెత్తాడు. పరమాత్మ అంతటా వ్యాపించియున్నాడు అని భక్తప్రహ్లాదుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుటకు చైతన్యం లేని స్తంభంలోనుండి నృసింహరూపంలో ఆవిర్భవించాడు.
భగవంతుని స్థిరంగా నమ్మినవారికి ఎట్టి ఆపదలు సంభవించవు - న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ అని చెప్పబడిన విషయాన్ని ధ్రువపరుస్తూ ఆర్తికలిగిన గజేంద్ర - ధ్రువ - విభీషణ - అంబరీష - ద్రౌపది మొదలైన వారెందరినో శ్రీహరి రక్షించాడు.
తను అనన్యభావనతో ఆరాధించే భక్తులకు ఎటువంటి ఆపదలు సంభవించకుండా వారిని తప్పక రక్షిస్తానని లోకులందరు గుర్తుంచునట్లుగా తన భక్తుడైన అర్జునితో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేయించాడు - కౌంతేయ! ప్రతిజానీహిన మే భక్తః ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నటికీ వినాశమును పొందడని ఓ కుంతీ పుత్రుడా ప్రతిజ్ఞ చేయుము. నీ ప్రతిజ్ఞను నేను నెరవేరుస్తూ భక్తకోటిని రక్షిస్తాను అని తెలిపాడు. తన దగ్గర విద్యలనభ్యసించిన శిష్యునిచేతిలో తానోడిపోవాలని గురువు భావించునట్లు తన అభివృద్ధిని మించినరీతిలో కుమారుని ప్రగతిని కోరే తండ్రివలె భక్తసులభుడైన శ్రీహరి ప్రతిజ్ఞ నెరవేర్చుటకే సంసిద్ధుడై ఉంటాడనే సత్యాన్ని గుర్తిద్దాం. భగవంతుని విషయంలో భక్తిని కలిగియుందాం.
- సముద్రాల శఠగోపాచార్యులు
No comments:
Post a Comment