Wednesday, December 6, 2017

అంతర్యామి ప్రతి క్షణం... సద్వినియోగం!


అంతర్యామి ప్రతి క్షణం... సద్వినియోగం!
 మనిషి మనసులో ఎన్నో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని సాధించేందుకు కొన్ని వనరులూ అవసరమవుతాయి. వనరులకు ఉండే ముఖ్య లక్షణాలు రెండు. ఒకే వనరు పలు విధాలైన ప్రయోజనాలు సాధించేందుకు ఉపకరిస్తుంది. దేనికి ఎంత కేటాయించాలో తెలిసి వ్యవహరించేవాడే నేర్పరి. రెండోది- వనరులు ఎప్పుడూ పరిమితమే. అవి అన్ని అవసరాలకూ సరిపడా ఉండవు. కలల లోకంలోని దృశ్యాల్ని సాకారం చేయగల మోతాదులో అసలుండవు. ఉన్న వనరుల్ని మనిషి తన ముందు గల లక్ష్యాల సాధనకు వినియోగిస్తాడు. అప్పుడు అతడు తీసుకునే నిర్ణయాలు, చేసుకునే ఎంపికలు, వాటి ఫలితాల సారాంశమే జీవితం. నిర్ణయాల్లో, ఎంపికల్లో ఆచితూచి ప్రవర్తించే వ్యక్తి తన జీవితాన్ని చక్కదిద్దుకుంటాడు. అనుకున్నవి సాధించడంలో ఎక్కువ సాఫల్యం సాధిస్తాడు. దూకుడు, సోమరితనం, తెలివితక్కువ వంటి లక్షణాలున్నవాడు తక్కువ సాఫల్యం పొందుతాడు. పరిమితమైన వనరుల్ని లక్ష్యసాధనకు వినియోగించుకోవడంలో వ్యక్తికో పోకడ ఉంటుంది. అందులో కొంత భాగం అతడి సహజ స్వభావం! చాలా భాగం- తన చుట్టూ గల ప్రపంచానికి సంబంధించి అతడి అనుసరణ, అనుకరణలకే సరిపోతుంది. ఆ రెండింటి కలగలుపూ వ్యక్తి ప్రవర్తనను, జీవనవిధానాన్ని నిర్దేశిస్తుంది. బాగుపడాలనుకునేవాడు ఉత్తముల పోకడల్ని గమనించి, తనకు అనువైన రీతిలో అనుసరిస్తాడు. మనిషికి ఉన్న పరిమితమైన వనరుల్లో సమయం ఒకటి. దాన్ని ఎంత నైపుణ్యంగా వినియోగించుకుంటే అంత శ్రేయోదాయకమని పెద్దలు చెబుతారు. సనాతన సంప్రదాయంలో శ్రేయస్సు అంటే ఇహ పర క్షేమం. జీవుడి మనుగడకు ఈ జన్మలో ఇహలోక జీవనం ఆరంభం కాదు, అంతమూ కాదు. ఆరంభం, అంతం- అన్నీ శరీరానికే వర్తిస్తాయి. శరీరం జీవుడికి సొంతం కానే కాదు. అది కేవలం ధర్మసత్రం గది లేదా తాత్కాలిక వసతిగృహం. అన్నింటి కంటే ముఖ్యం- ఆ గది ఖాళీ చేసిన తరవాతి దశలో క్షేమం! అది సుదీర్ఘమైన దశ. మోక్షప్రాప్తి కలిగే దాకా ఎన్నో జన్మలపాటు సాగేది. పగలు పనిపాటలతో గడిపి రాత్రికి విశ్రమించే మనిషి, తన భోజనాది ఏర్పాట్లు ముందే చేసుకోవాలి. వానకాలంలో పనులు సజావుగా సాగవు కాబట్టి, ఆ కాలానికి సరిపడా పదార్థాల్నీ ముందుగానే సిద్ధపరచుకోవాలి. అదే కోవలో పారలౌకిక జీవనాన్ని క్షేమకరం చేసుకొనేందుకు ముందుజాగ్రత్త అవసరం. ఆ పుణ్యఫలాన్ని ఇహలోకంలో ఈ జన్మలోనే సంపాదించుకోవాలని సంప్రదాయం చెబుతుంది. ఇహలోకంలో పుణ్యకర్మలు చేసుకొనేందుకు భౌతిక శరీరమనే సాధనం ఉంది. శరీరం లేకుంటే, జీవుడికి సాధనమూ లేనట్లే! అందుబాటులోని సమయంలో ఎక్కువ భాగాన్ని మనిషి పలు ఇతర ప్రయోజనాలు, బాధ్యతల కోసం వినియోగిస్తాడు. ఉన్న సమయమంతా పూర్తిగా వాటికే కేటాయించడం, కాలాన్ని కరిగించడం సరికాదు. అది, పరిమితమైన వనరును సద్వినియోగం చేయడం అనిపించుకోదు. ‘నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకు ఉన్నాను’ అని ప్రశ్నించుకోవాలి మనిషి. ‘నా గమ్యం ఏమిటి, ఈ లోకాన్ని నడిపే శక్తి ఏది’ అని తర్కించుకోవాలి. ఆధ్యాత్మిక అన్వేషణ అంటే అదే! పఠన, శ్రవణ, ధ్యానాది సాధనల ద్వారా సాగించేందుకు సమయాన్ని కేటాయించుకోవాలనీ పురాణ గాథలు చెబుతాయి. ‘ఆ అన్వేషణ ఇప్పుడే ఎందుకు’ అని ఎవరైనా భావిస్తే, అది అమాయకత్వం. అన్ని శక్తులూ ఉన్నప్పుడే ఆ అన్వేషణ కష్టసాధ్యం. అటువంటిది అన్ని జవసత్వాలూ ఉడిగిన తరవాత అన్వేషణ అంటే- అది అంతుపట్టేది కాదు, ఒంటపట్టేదీ లేదు! - మల్లాది హనుమంతరావు

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drive...

Popular