Sunday, December 10, 2017

Antaryami

అంతర్యామి

వైరాగ్య వైభవం
క మహారాజు, తన మంత్రితో పాటు దేశాటనం సాగించాడు. ఇద్దరూ మారువేషాలతో వూరి బయట ఉన్న శిథిలాలయానికి చేరుకున్నారు. అక్కడ చెట్టు కింద ఓ సాధువు ఆనందంగా వైరాగ్య గీతాలు ఆలపించడం గమనించారు. మహారాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ బైరాగి చినిగిన వస్త్రాలతో ఉన్నాడు. ఒంటి మీద ఉన్నవన్నీ చింకిపాతలే! పక్కనే సత్తు గిన్నె పడి ఉంది. కటిక నేలమీద పడుకొన్న అతడు, ప్రపంచంలోని ఆనందమంతటినీ ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఎంతో పరవశించి పాడుతున్నాడు.
‘ఇదెలా సాధ్యం’- అని ప్రశ్నించాడు రాజు.
ఆ సాధువు ఇలా బదులిచ్చాడు... ‘మనిషి తనకు తానుగా బంధనాల్లో చిక్కుకుంటున్నాడు. కోరి సంకెళ్లు తగిలించుకుంటున్నాడు. నా వంటి విరాగికి బంధనాలు ఏముంటాయి? ఒకవేళ ఉన్నా, వాటిని సునాయాసంగా తెంచుకుంటున్నాను. నా విచారానికైనా, ఆనందానికైనా కారణమేమిటో తెలిసింది కదా! వైరాగ్యానికి మించిన మహా వైభవం జీవితంలో మరేదీ లేదు. విరాగి స్వేచ్ఛాజీవి. అన్ని లోకాలూ అతడివే. ఆనందమంతా అతడి సొత్తే...’ అంటూ, సాధువు మరో పాట అందుకున్నాడు.
నిజమే. మహారాజు అధికారం తన రాజ్యపరిధుల వరకే ఉంటుంది. కుటుంబీకుడి యాజమాన్య హక్కు అతడి గృహం హద్దులకే పరిమితమవుతుంది. విరాగికి హద్దులూ ఉండవు. వేషంలో తప్ప, ఇతరులతో పోలిస్తే అతడి మానసిక స్థితిలో ఎటువంటి తేడా ఉండదు. అలాగని సాధు వేషధారులంతా విరాగులని ఎవరూ పొరపడకూడదు.
వైరాగ్యం అనేది వేషంలో ఉండదు. మనసులో ఉంటుంది. మనోవైరాగ్యమే అసలైన వైరాగ్యం. వస్తు ప్రేమ, బంధుజన ప్రేమ, భోజన ప్రియత్వం, లాలస- ఇవన్నీ మనసును అంటిపెట్టుకుని ఉండే మాలిన్యాలు. ఇవేవీ సాధారణ స్నానంతో వదిలేవి కావు. మనిషి ఆత్మస్నానం చేయాలి. ఆత్మ తేజోవంతం కావాలంటే, ఎన్నింటినో మనిషి త్యాగం చేయాలి. అన్నీ తనకే కావాలని మనసు అనుకుంటుంది. అందువల్ల మనిషి తన మనసుకే త్యాగబుద్ధిని అలవాటు చేయాలి. క్రమంగా మనసు అతడి మాట వింటుంది. వైరాగ్య చింతనకు లోబడుతుంది.
మోహాన్ని త్యాగం చేశానని ఎవరైనా సాధకుడు అనుకుంటే, ఆ తరవాత స్థితిగతులు మారతాయి. అతడి సమక్షానికి ఓ అందాలరాశి రాగానే, మానసికంగా అలజడి మొదలవుతుంది. ఆ స్థితిని అతడు తట్టుకోలేనప్పుడు- విశ్వామిత్రుడవుతాడు. తట్టుకోగలిగితే నారాయణ రుషిగా మారతాడు. మేనకా విశ్వామిత్ర కథే దీనికి ఉదాహరణ.
నారాయణ రుషిని కొందరు ప్రలోభపెట్టాలని ప్రయత్నిస్తారు. అప్పుడు అప్సరసలు సిగ్గుపడేలా, వారిని మించిన సౌందర్య దేవతను ఆయన సృష్టిస్తాడు. ఆ యువతే వూర్వశి! మానసిక నిగ్రహశక్తికి ఆ వృత్తాంతమే నిదర్శనం. క్రోధానికి మారుపేరు దుర్వాసుడు. ఆ లక్షణం వల్ల ఆయన అనేక అగచాట్లు పడాల్సి వచ్చింది. మహా శివభక్తుడైనప్పటికీ, రావణుడు మదమాత్సర్యాల్ని జయించలేకపోయాడు. అందుకే అతడికీ గర్వభంగం తప్పలేదు.
పురాణాలన్నీ చూసుకుంటూ వెళ్తే, సంపూర్ణ వైరాగ్య వైభోగిగా పరమ శివుడు కనిపిస్తాడు. మన్మథుణ్ని భస్మం చేయడం ద్వారా, మోహావేశానికి తాను అతీతమని నిరూపించుకున్నాడు. సాక్షాత్తు కుబేరుడే తన మిత్రుడైనా, శివుడు ఏనాడూ కాసు కోసం ఎదురుచూడలేదు. రుద్రనేత్రుడైనా, పరమ శాంతుడైనా ఆయనే!
మహేశ్వరుడు విశ్వప్రభువైనా, అధికారాలన్నింటినీ అందరికీ పంచిపెట్టాడు. వైరాగ్యధామమైన శ్మశాన సంచారి, విభూతి ధారి ఆయనే! సృష్టికి అతీతుడైనా, సృష్టి నియమాల్ని గౌరవించిన మహోన్నతుడు. అన్నీ తానే అయినా, ‘ఏమీ లేనివాడు’గా గోచరిస్తాడు. ఎప్పుడూ ఏకాంతవాసిగా, ధ్యానంలో నిమగ్నుడై ఉంటాడు.
పరమ శివమే వైరాగ్య భోగం. శివానందమే వైరాగ్య వైభవం. అందరి జ్ఞానతృష్ణనూ తీర్చగల అమృతజల రూపుడు శివుడు. ఆ దక్షిణామూర్తి, ఏకేశ్వరుడి ఉపాసనే భక్తజన మానసిక వైరాగ్య వైభవ సాధనం. అలనాటి మహర్షుల వైరాగ్య వైభవానికి, వారి శివభక్తే మూలాధారం!
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular