అంతర్యామి - సాధన శక్తి - రామబంటు

అంతర్యామి - సాధన శక్తి 
‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అంటారు పెద్దలు. ఏ పనైనా సాధనతోనే సఫలీకృతమవుతుంది. పారమార్థిక మార్గంలో వెయ్యి గ్రంథాల పఠనమైనా ఒక గంట సాధనకు సమానం కాదని వారు చెబుతారు. ‘సాధన’ అనే మాట ఆధ్యాత్మిక రంగంలో ఎక్కువగా వినిపిస్తుంది. భగవత్‌ మార్గంలోని ప్రతి చిన్న పనీ సాధనే!

పంచాగ్ని యజ్ఞం నుంచి పుష్ప సేకరణ దాకా ప్రతి ఒక్కటీ సాధన అవుతుంది. తీవ్రమైన తపస్సు నుంచి నిర్మాల్య నిర్మూలన వరకు ప్రతిదీ సాధనే అనిపించుకుంటుంది. భగవంతుడి పేరును జత చేస్తే చాలు- ఎటువంటి పువ్వునైనా పరిమళాలు కమ్ముకుంటాయి. పుక్కిలించిన నీళ్లు సైతం పవిత్ర జలాలై అభిషేక అర్హత పొందుతాయి. ఎంగిలి పండ్లు కూడా అమృతతుల్యమై నైవేద్యంగా మారతాయి. అదీ భగవన్నామ ఘనత, సాధనలోని విలక్షణత. అదెంతో రుచిరం... అంతకు మించి, మనోభిరామం!

ఒకనాడు శంకరాచార్యులు వెళ్తున్న దారిలో, ఇంటి అరుగుమీద కూర్చుని సూత్రాలు సిద్ధాంతాలు వల్లెవేస్తున్న వ్యక్తి కనిపిస్తాడు. ‘వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటి? దైవాన్ని భజించు, సాధనతో జీవించు’ అని స్వామి బోధిస్తారు. అంత అవసరమైనది సాధన. భగవంతుణ్ని భజించడాన్ని మించిన సాధన లోకంలో మరేదీ లేదు.

ప్రతి చిన్న పనీ సాధనే అయినా, పరిణామ క్రమంలో దాని స్థాయి మారిపోతుంటుంది. అక్షరాల క్రమం నుంచి వ్యాకరణం, దాని నుంచి పాండిత్యం, ఆ తరవాత పరిశోధనల వరకు పరిణామం చెందుతుంది విద్య. అదే రీతిలో సాధన పక్వం కావాలి. దీప ప్రజ్వలనం నుంచి దినకర ఆరాధన దాకా, తపోనిష్ఠ నుంచి తత్వమసి భావన దాకా అది సాగిపోవాలి. అందరిలోనూ భగవంతుణ్ని చూడటం నుంచి ‘నేనే భగవంతుణ్ని’ అనే ‘అహం బ్రహ్మాస్మి’ భావనలోకి పరిణతి చెందే వరకు సమస్తమూ సాధనే!

ధ్యాన సాధన కంటే పుష్ప సమర్పణ గొప్పది. సమాధి స్థితి కన్నా ధూప సమర్పణే ఘనమైనది. ఇదంతా పరిణామ క్రమం. ప్రమిద లేనిదే చమురు పోయలేం. అది లేనప్పుడు వత్తి వేయలేం. వత్తి లేనిది జ్యోతిని వెలిగించలేం. పరిణామ క్రమమన్నా, సాధన క్రమమన్నా ఇదే! ధారగా మొదలైనదే నదిగా మారుతుంది. అదే ఉత్తుంగ తరంగ మహానది అవుతుంది. భక్తుడి సాధనా అంతే!

సమర్పణ లేదా సాధన చిన్నదిగానే మొదలవుతుంది. అదే కఠోర తపస్సుగా రూపాంతరం చెందుతుంది. కార్తిక మాసం చలిలో నిండు వస్త్రాలతోనే ప్రాథమిక సాధన ప్రారంభిస్తాడు భక్తుడు. క్రమానుగతంగా సంభవించే మార్పుల వల్ల, అతడే కౌపీనమాత్రధారిగా మిగిలే సాధకుడవుతాడు. అతడు రుషిలా ఘన పరిణామం చెందాలి. పతంజలి మహర్షి విరచిత అష్టాంగ యోగసాధన నియమావళి అదే చెబుతుంది.

యమ నియమ అనే సాధారణ స్థాయిలో సాధన ప్రారంభమవుతుంది. ముందుకు, మున్ముందుకు, ఇంకా పైపైకి సాగాలని నిర్దేశిస్తారు. మానవ విద్యాసాధనలో, జీవిక సాధనలో అక్షర క్రమంలోని ‘అ ఆ’లు ఎప్పటికీ ఉపయోగపడతాయి. ఎంతగానో ఉపకరిస్తాయి. అంతమాత్రాన అదే విద్య కాదు. అదే జీవితమూ కాదు. తరవాతి విద్యలోనే ఎంతో వైవిధ్యం ఉంటుంది. వివేకం, విశిష్టతా నెలకొంటాయి. సాధనా అంతే.

ఒక్కో దశలో పైపైకి సాగిపోతున్న శిష్యుణ్ని, గురువే ఆపుతాడు. మెల్లమెల్లగా అతడి చేయి వదిలి, ఇంకా పైకి వెళ్లనిస్తాడు. శిష్యుడు తనను మించి మరెంతో ప్రయోజకుడిగా ఎదగాలన్నదే గురువు ఆశయం. మరొక విశేష పరిణామమూ ఉంది. పరిణతి చెందుతున్న దశలో, మనసే సాధకుడికి మార్గదర్శనం చేస్తుంది. అప్పుడు అతడు పొరపాట్లు చేసే అవకాశమే ఉండదు. ప్రగతి సాధించాక, భగవంతుడే చేయి అందిస్తాడు. సాధకుణ్ని ఇంకా పైపైకి తీసుకొని వెళ్తాడు. అలాంటి ఉదాహరణలెన్నో పోతన, త్యాగరాజు, సక్కుబాయి వంటి భక్తుల జీవితాల్లో కనిపిస్తాయి.

- చక్కిలం విజయలక్ష్మి
అంతర్యామి - రామబంటు
విశ్వాసం, భక్తి, ఆరాధన భావాలతో సేవ చేసే వ్యక్తిని ‘బంటు’ అంటారు. తాను మనసా వాచా నమ్మిన మనిషి కోసం యావత్‌ జీవితాన్నీ వినియోగించడం అంత సులభం కాదు. దానికి నమ్మకం, సహనం, పట్టుదల, నేర్పు వంటి ఉత్తమ లక్షణాలుండాలి.

యజమానులకు సేవకులుంటారు. వారు అహర్నిశలూ యజమానిని అంటి పెట్టుకొని ఉండరు. ఉదర పోషణార్థమే సేవాధర్మాన్ని అవలంబిస్తారు. మరికొన్ని చోట్ల బానిసత్వ సేవ కనిపిస్తుంది. అది సేవ కాదు, బతుకు భయంతో చేసే వూడిగం!

కొంతమంది పుణ్యం కోసమో, పేరు కోసమో తమ సమయంలో కొంత వెచ్చించి మానవసేవ చేస్తారు. ఇంకొంతమంది భక్తిభావంతో దేవుణ్ని సేవిస్తారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఆలయాల్లో జరిగే వివిధ సేవాకార్యక్రమాల్లో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకుంటారు.

మనిషి ఎందులోనూ సంపూర్ణంగా తనను తాను అర్పించుకోవడం అనేది ఉండదు. తల్లిదండ్రులకు, గురువులకు సేవలు ఆయా దశల్లో అవసరార్థం సాగిపోతుంటాయి. అవి యావజ్జీవం నెరవేర్చేవి కావు. ఎవరికైనా బంటుగా మారాలంటే, ఆ వ్యక్తి సర్వలక్షణ శోభితుడు కావాలి. ధర్మానికి ప్రతీకగా నిలవాలి. వినయ విధేయతలనే భూషణాలు ధరించాలి. పెద్దల పట్ల గౌరవం కనబరచాలి. తనవారు, ఇతరులు అనే తారతమ్యాలు లేకుండా సమభావన కలిగి ఉండాలి. అందరితోనూ మనసు విప్పి సౌమ్యంగా, ప్రీతిగా మాట్లాడాలి. అటువంటి ఉత్తమోత్తమ వ్యక్తికే జీవితాన్ని ధారపోయాలని అనిపిస్తుంది.

శ్రీరాముడు అంతటి సద్గుణ సంపన్నుడు, మహోన్నతుడు కాబట్టి ఆంజనేయుడి మనసును ఎంతగానో స్వాధీనపరచుకున్నాడు. కిష్కింధలో పరిచయం మొదలు పట్టాభిషేకం వరకు రాముణ్ని ఏ దశలోనూ మారుతి వీడి ఉండలేదు. బంటు అనే పదం ఎక్కడ కనిపించినా, వినిపించినా సంపూర్ణ అర్థమివ్వదు. ఆ పదానికి ముందు ‘రామ’ అని చేరిస్తేనే, పరిపూర్ణ భావన కలుగుతుంది. రామబంటు అనగానే ఆంజనేయుడే మదిలో మెదులుతాడు!

తాను రామబంటునని ఆ కేసరి నందనుడు వినమ్రంగా ప్రకటించుకున్నాడు. తన జీవితాన్ని సంపూర్ణంగా రామార్పితం చేశాడు. సీతమ్మ జాడ తెలియక దుఃఖిస్తున్న రాముణ్ని, నవనీతం లాంటి మాటలతో శాంతపరచాడు. ముల్లోకాల్లో ఎక్కడున్నా ఆమెను వెతికి తెస్తానని మాట ఇచ్చాడు. అదే దృఢసంకల్పంతో ముందడుగు వేశాడు. ద్విగుణీకృత శక్తితో సముద్రాన్ని లంఘించాడు. రాక్షసులతో పోరు సాగించాడు. రావణుడికి సమానమైన ఎత్తులో ఉండి సంభాషించాడు. నిప్పంటించిన తోకతో లంకాదహనం గావించాడు. ధర్మమూర్తి రాముడు తన మనసులో కొలువుదీరి ఉన్నాడు కాబట్టి, హనుమకు అంత ధైర్యం కలిగింది. కొండంత అండగా రాముడు ఉండటం వల్ల, సాహసం ఇనుమడించింది. ఫలితంగా, రామాయణంలో కేవలం ఆంజనేయుడి కోసమే కొన్ని పుటలు ‘సుందరకాండ’గా రూపుదిద్దుకున్నాయి. రామలక్ష్మణుల ముందు వినయంగా మోకరిల్లే హనుమలో ‘మూర్తీభవించిన బంటుతత్వం’ గోచరిస్తుంది.

త్యాగరాజు శాశ్వతమైన రామభక్తి సామ్రాజ్యాన్ని కోరుకున్నాడు. ‘బంటురీతి కొలువియ్యవయ్య రామ!’ అని హంసనాద రాగంలో వేడుకొన్నాడు. ఆయన రాముడి పట్ల అపార భక్తి, అచంచల విశ్వాసం కలిగినవాడు. రామతారక మంత్రాన్ని గురువుల నుంచి గ్రహించి, నిష్ఠగా సాధన చేసినవాడు. సిద్ధి పొందిన తరవాత, రాముడి గుణవైభవాల్ని వర్ణిస్తూ వేల సంకీర్తనలు రచించాడు. ‘రామచరణాలే శరణు’ అని భావించిన పరిపూర్ణ యోగిపుంగవుడు త్యాగయ్య. అన్నింటినీ భక్తితో సాధించి, రాముడి మనసులో బంటు రీతి కొలువు సంపాదించి, ధన్యచరితుడయ్యాడు!

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి