అంతర్యామి
సంకర్షణుడు
భగవానుడు ఎన్ని అవతారాలు దాల్చినా, వాటి లక్ష్యం ఒక్కటే. అది లోకరక్షణ లేదా సకల జీవరాశి శ్రేయస్సు. మానవుడు బుద్ధిజీవి కాబట్టి, రక్షణే లక్ష్యంగా తన వంతు ప్రయత్నం సాగించాలి. జీవన శైలిలో మార్పుల్ని ఆహ్వానించాలి. వాటిని ఆచరణకు తెచ్చిన వివేకవంతుడే బలసంపన్నుడవుతాడు. సమాజ క్షేమానికీ ఉపయోగపడతాడు. తానే ఓ రక్షణ కవచంలా నిలిచి గెలుస్తాడు.
సకల జీవరాశులకూ జీవంగా ప్రకాశించే భగవానుడే మహాబలుడు. ఆయన అనంతమైన బలం కలిగినవాడు, లోక రక్షకుడని పురాణ వాఙ్మయం చెబుతుంది. బలం ఉండేది బలహీనుల్ని కాపాడేందుకే అని ఆర్యోక్తి. అందుకే శారీరక, మానసిక బలాలు భగవానుడు తనకు ప్రసాదించిన దివ్యశక్తులని మానవుడు గ్రహించి వ్యవహరించాలి.
శ్రీకృష్ణుడి అగ్రజుడు బలరాముడు. ఆయన ఆదిశేషుడి అవతారం. బల పరాక్రమాలకు పేరొందినవాడు. రాముడు అంటే, హృదయాన్ని రంజింపజేసేవాడు అని అర్థం. మనిషి ఉనికి, అతడు చేసే ప్రతి పనీ ఇతరులకు ఆనందం పంచేలా ఉండాలన్న సందేశమిస్తుంది బలరామావతారం!
దేవకీ వసుదేవుల్ని చెరసాలలో ఉంచాడు కంసుడు. యోగమాయ భగవానుడి ఆజ్ఞ ప్రకారం దేవకీదేవి సప్తమ గర్భాన్ని రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది. అప్పుడు గర్భస్త పిండం సంకర్షణకు గురైంది. ఒరిపిడి చెందింది. రోహిణి గర్భవాసాన బలరాముడు జన్మించాడు. అందుకే శాస్త్రపురాణాలు ఆయనను ‘సంకర్షణుడు’ అని వ్యవహరిస్తాయి.
శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడై దేవకీదేవి అష్టమ గర్భంగా జన్మించాడు. ఆ భగవానుడికి బలరాముడే తోడు, నీడ. అక్కడే రమ్యమైన జగత్కథ మొదలైంది. పరమాత్మతో బాల్యక్రీడలు, విద్యాభ్యాసం మొదలుకొని అవతార సమాప్తి వరకు బలరాముడిది సుదీర్ఘ గాథ. ఆ చరితం పురాణ ప్రసిద్ధం. భగవానుడిలో తనను, తనలో భగవానుణ్ని దర్శనం చేసుకున్న ఆత్మజ్ఞాని ఆయన. ఏ సందర్భంలోనూ సోదరుడి మాటకు ఎదురాడలేదు. రాక్షస మాయల్ని ఛేదించడంలో బలరాముడే కృష్ణుడికి సచివుడు. కంస సభలో చాణూరాది దానవుల్ని సోదరుడితో కలిసి సంహరించి అపార పటిమ చాటాడు. విపత్తుల నుంచి రక్షించే కవచాలు శారీరక, బుద్ధిబలాలేనని బృందావనం, మధురల్లో పలు ఘట్టాల ద్వారా తెలియజెప్పాడు.
సకల విద్యలకు, సమస్త శాస్త్రాలకు ఆదిశేషుడే అధిదేవుడు. అంతకుమించి భగవానుడికి ఆయనే సమస్తం! గురుముఖతః నేర్వని విద్య శోభించదు. అందుకే సోదరుడితో కలిసి సాందీప మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశాడు. అది అవతార ధర్మం. బలరాముడు తానే గురువై భీముడికి, దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పించాడు. కృష్ణుడు పాండవ పక్షం వహించడంతో, ఆయన కౌరవులకు కొంత దగ్గరయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో దూరంగా ఉన్నాడు.
శిష్యుడైన దుర్యోధనుడి పట్ల బలరాముడికి వాత్సల్యం ఉండేది. జగన్నాటకం రక్తికట్టాలి కాబట్టి, అంతటి అవతార పురుషుడికీ కొంత సాధారణ వైఖరి తప్పలేదు. కురుక్షేత్ర సంగ్రామం చివరిదశలో- భీమ, దుర్యోధనుల గదాయుద్ధం వేళ నీతిరాహిత్యాన్ని బలరాముడు నిరసిస్తాడు. ఆ తరవాతి పరిణామాల్లో తీర్థయాత్రలకు వెళ్లిపోతాడు. అన్నదమ్ముల అన్యోన్యతకు వారి బంధమే నిదర్శనం. అవతార పురుషులైనా, భూమిపై జన్మించినందుకు ‘నిష్క్రమణలు’ తప్పవు. వారు వచ్చిన బృహత్కార్యాలు పూర్తయ్యాయి. అందువల్ల బలరాముడు తిరిగి వైకుంఠానికి చేరతాడు.
పూరి వంటి మహాక్షేత్రాలు శ్రీకృష్ణ, బలరామ, సుభద్రల అనురాగ బంధాల్ని అవతారాల ఆంతర్యాన్ని తెలియజేస్తాయి. దివ్యసందేశాల్ని అనుగ్రహిస్తాయి. అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాలు ఉండాలే తప్ప, మాట పట్టింపులు ఉండకూడదు. ఏదో ఒక సందర్భంలో కోపతాపాలు ప్రదర్శించినా, మనసు ఎప్పుడూ నవనీతంలా ఉండాలి. ప్రేమాభిమానాలు సదా వెల్లివిరియాలని బలరామ అవతార తత్వం చాటి చెబుతుంది.
- దానం శివప్రసాదరావు
No comments:
Post a Comment