అంతర్యామి ఏకాగ్రత

అంతర్యామి


ఏకాగ్రత
త్మశుద్ధి లేని ఆచారం, భాండశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమంటాడు వేమన. ఏకాగ్రత లేని పనులు సైతం వ్యర్థమైనవే. కార్యం- అది లౌకికమైనా, ఆధ్యాత్మికమైనా ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది. ‘ధ్యానం’ అనే మాట తరచుగా వింటుంటాం. ధ్యానం, ఏకాగ్రత- రెండూ సహ భావనలే! ఆ రెండింటికీ సన్నిహిత సామ్యం ఉంది.
ధ్యానం అనే మాటను పారమార్థిక దృష్టితో వాడతాం. సర్వసాధారణంగా ‘పరధ్యానం’ అనే మాటనూ ఉపయోగిస్తుంటాం. ఎవరికైనా ధ్యానం అలవడాలంటే, ఏకాగ్రత కుదరాలి. అది సాధించాలంటే, ధ్యానం సాగించాలి.
ప్రహ్లాదుడిది అనితరసాధ్యమైన విష్ణుభక్తి. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా, అతడి మార్గానికి అవరోధం కలగలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. అలాగే, తండ్రి ప్రేమ పొందాలని ధ్రువుడు చెక్కుచెదరని దీక్షతో తపస్సు చేశాడు. ఆ ధ్యానానికి మూలం ఏకాగ్రత. వసిష్ఠుణ్ని మించిన బ్రహ్మర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక. దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తం, పట్టుదలతో తపస్సు చేసి సాధించాడు. ‘భగీరథ ప్రయత్నం’ అనే మాట వింటుంటాం. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న తపన ఆయనది. అదే దీక్షతో, దివి నుంచి భువికి గంగ దిగివచ్చేలా తపస్సు ఆచరించాడు.
ఒకే విషయం మీద దృష్టిని లగ్నం చేయడం ఏకాగ్రత. దాన్ని ‘లక్ష్యం’ అనీ పిలుస్తుంటాం. ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం, దాని కొమ్మమీద గల పక్షి కన్ను అర్జునుడి లక్ష్యమైంది. అందుకే మేటి విలుకాడయ్యాడు. అంటే- లక్ష్యం, ఏకాగ్రత ఒక్కటే.
మనిషి మనసు నిండా ఆలోచనల పరంపరలుంటాయి. అతడి స్వేచ్ఛకు, బంధానికి మనసే కారణమని విజ్ఞులు చెబుతారు. పరమ చంచలమైనది మనసు. దానికి స్థిరత్వం లేదు. ఆ స్థిరత్వాన్ని ఎలాగైనా సాధించడమే ఏకాగ్రత. అభ్యాసం కూసువిద్య అంటారు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అనీ చెబుతారు. అభ్యాసం, సాధన వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. ఒకే లక్ష్యంపై మనసును కేంద్రీకరించవచ్చు. నిరంతర అభ్యాసం వల్ల మనసును ఎలా నిరోధించవచ్చో భగవద్గీత, పతంజలి యోగసూత్రాలు తెలియజేస్తాయి.
ఏకాగ్రతతో ఏదైనా పని చేయాలంటే, ముందుగా దానిమీద ఇష్టం ఉండాలి. అది లేకుండా ఏ పని చేసినా, ఏ కోశానా ఏకాగ్రత కుదరదు. వ్యక్తి ఎప్పుడైతే సర్వశక్తుల్నీ ఒక అంశంపైనే కేంద్రీకరిస్తాడో, అప్పుడే అతడి లక్ష్యసాధన మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అందుకు వివేకానంద, గాంధీజీ జీవితాలే ఉదాహరణలు.
అవధానాలు చేసే పండితులు ఏకాగ్రతకే అధిక ప్రాధాన్యమిస్తారు. వారి దృష్టి ఎప్పుడూ సంబంధిత అంశం మీదే ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప, వేరేవీ వారి మనసులోకి ప్రవేశించవు.
‘శబ్దం’ అనేది మనసును ఒక విషయంపై కేంద్రీకృతం చేయడానికి తోడ్పడుతుంది. పిల్లలు బిగ్గరగా చదువుతారు. అలా చదవడం వల్ల, వారి స్వరం సృష్టిస్తున్న శబ్దాలు చెవుల ద్వారా మనసులోకి చేరతాయి. ఆ మనసు వారు వల్లె వేస్తున్న విషయాలపైనే నిలిచి ఉంటుంది. బయటకు చదవడం వల్ల, వారి ఏకాగ్రత స్థిరపడుతుంది. వేదమంత్రాల్ని గట్టిగా చదవడం, వల్లె వేయడం వెనక అంతరార్థం అదే! ఏకాగ్రత సాధించేందుకు అదే మొదటి మెట్టు.
అందరిలోనూ ఏకాగ్రత స్థాయి ఒకేలా ఉండదు. అందరికీ అన్ని విషయాలపైనా ధ్యాస నిలవదు. చేసే పని మీద ఇష్టం పెంచుకుంటే, మనసులో దృఢమైన సంకల్పం ఉంటే, ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఇష్టం, సంకల్పం- ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలు. వ్యాకులత, ఆరాటం, చంచలత్వం ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. మనిషి ముందుగా వాటిని జయించాలి!
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి