అంతర్యామి
పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే రూపంలో పరమాత్మను దర్శించి పూజించేవారూ ఉంటారు. అరుణాచలం పేరు విన్నా, పలికినా ముక్తి లభిస్తుందంటారు. అరుణాచలమే కైలాసమని రమణ మహర్షి భావించేవారు. ఆయన భావనలో- ఆ కొండపైనే శివకుటుంబం ఉంది. అక్కడే పార్వతీ పరమేశ్వరులతోపాటు వారి తనయులు వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. వారిని బ్రహ్మ, విష్ణువు దర్శించుకొని వెళ్లేవారని మహర్షి భావం. అందుకే ఆయన గిరి ప్రదక్షిణానికి ప్రాముఖ్యమిచ్చేవారు. అందుకు శిష్యుల్ని, ఇతర భక్తుల్ని ఎంతో ప్రోత్సహించేవారు.
అరుణగిరిపై కార్తిక మాసంలో పౌర్ణమినాడు అఖండజ్యోతి వెలిగిస్తారు. సంధ్యాసమయంలో ఆవునేయి, కర్పూర వినియోగంతో నిర్వహించే కార్యక్రమమది. ఆ జ్యోతి దర్శనం కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు అరుణాచలానికి తరలి వెళతారు. జ్యోతిని దర్శించి పులకరిస్తారు. అది కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికీ గోచరిస్తుంది. అందువల్ల పలువురు అక్కడి నుంచే జ్యోతి పరమాత్మను దర్శించుకుంటారు. నమ్మకమే ప్రధానంగా, అనేకులు తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యస్థలాల్ని సందర్శిస్తే ప్రశాంత చిత్తం ఏర్పడుతుందని భావిస్తుంటారు.
అవతారం చాలించే ముందు- శబరిమల అయ్యప్పస్వామి శబరిగిరిని చేరినప్పుడు, అష్టాదశ దేవతలు ఎదురవుతారు. స్వామి ఆ కొండను ఎక్కడానికి వీలు కల్పిస్తూ, పద్దెనిమిది మెట్లుగా ఏర్పడతారు. అక్కడ మణికంఠుడు కాలు మోపి, శబరిగిరిని అధిరోహించి, చిన్ముద్ర- అభయహస్తంతో దర్శనమిస్తాడు. ఆయనను అంతకుముందు అనుసరించి వెళ్లిన మహారాజు, రాణి, ప్రజలు భక్తిపరవశులవుతారు. పెంచిన మమకారం వల్ల రాజు, రాణి ‘నిన్ను చూడకుండా ఉండలేం’ అంటారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతినాడు సంధ్యాసమయంలో దర్శనమిస్తానంటాడు స్వామి. కనీసం మండల కాలం బ్రహ్మచర్య దీక్ష పాటించి శరణాగతితో శబరిమల చేరినవారు తన జ్యోతి స్వరూపాన్ని దర్శించవచ్చని చెబుతాడు. ఆ తరవాత జ్యోతి రూపంలోనే అంతర్థానమవుతాడనే ఒక కథ ప్రచారంలో ఉంది.
అనంతరం పరశురాముడు ఆ స్వామి విగ్రహాన్ని శబరిమల శిఖరంపై ప్రతిష్ఠిస్తాడు. ఆయనే పద్దెనిమిది మెట్లూ నిర్మించాడని అంటారు. నియమాల్ని పాటించి శబరిమల యాత్ర చేసినవారికి జ్యోతి దర్శనం కలుగుతుందని చెబుతారు. కలియుగ వరదుడు, ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు- ఆ హరిహర సుతుడు. శబరిమల ఆలయ సిబ్బంది మకర సంక్రాంతి రోజు సాయంత్రం వేళ స్వామిని ఆభరణాలతో అలంకరిస్తారు. గుడిలో హారతి ఇవ్వగానే, పొన్నంబలమేడు శిఖరంపై జ్యోతి కనిపించే ఏర్పాటు ఉంది.
శబరిమల సన్నిధానంలో అదే సాయంత్రం అయిదున్నర నుంచి ఇంచుమించు గంటసేపు భక్తులు స్వామి శరణుఘోష చేస్తారు. ఆ నామాలు చెబుతూ, పారవశ్యంతో తూర్పు దిక్కు కొండపై దృష్టి కేంద్రీకరిస్తారు. అప్పుడు ముందుగా ఆకాశంలో మకర నక్షత్రం కనిపించి, ఆ తరవాత ముమ్మారు దివ్యజ్యోతి దర్శనమవుతుంది. అవి కొంతసేపు గోచరించి అంతర్థానమవుతాయి. ఆ దివ్యజ్యోతిని, మకర జ్యోతిని చూడటానికే లక్షల సంఖ్యలో భక్తులు వెళతారు. స్వామి దీక్ష చేసి, అడవుల్లో కొండల్లో నడిచి, శబరిమల యాత్ర సాగిస్తారు!
- మహాభాష్యం నరసింహారావు
No comments:
Post a Comment