అంతర్యామి_దత్తావతారం _భ్రమర నాదాలు 


 అంతర్యామి  దత్తావతారం 

బ్రహ్మ, విష్ణు, మహేశ్వర సమైక్య రూపమే దత్తావతారం. అది త్రిమూర్తుల సమన్వితం. వారి వరప్రభావం వల్ల అత్రి, అనసూయ దంపతులకు దత్తుడు జన్మించాడు. దత్తం అంటే ఇవ్వడం. అత్రి కుమారుడు కాబట్టి ఆయనను ‘ఆత్రేయుడు’ అనీ పిలుస్తారు. దత్తాత్రేయుడు మార్గశిర పౌర్ణమినాడు అవతరించాడు. ఉపనయనం తరవాత దత్తుడు తపస్సు ఆచరించాడు. పరిపూర్ణమైన జ్ఞానార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి అనేకమందికి ఆయన ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు అనే గ్రంథాలు రచించాడు. దత్తుడు మహాత్ముడు. ఆయనే ఆదిగురువైన పరబ్రహ్మం. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్య రూప విలక్షణ మూర్తి. ఆయన చుట్టూ ఉన్న నాలుగు ప్రాణులే నాలుగు వేదాలు. అహంకారాన్ని దండించడానికే దండం ధరించానని, జోలె పట్టింది భక్తుల సంచిత కర్మలకోసమేనని ప్రవచించాడాయన. దత్తాత్రేయ బోధలు లోక కల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలి నుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం స్వీకరించాలని ఉద్బోధించాడు. అగ్ని నుంచి నిర్మలత్వాన్ని, సముద్రజలం నుంచి గాంభీర్యాన్ని, కపోతం నుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. అప్రయత్నంగా వచ్చే ఆహారాన్ని మాత్రమే మానవులు స్వీకరించాలి. కొండచిలువలా భ్రాంతి వలలో పడకూడదు. స్పర్శానందానికి దూరంగా ఉండటం అంటే ఏమిటో మిడతను చూసి తెలుసుకోవాలి. ఏనుగు నుంచి పట్టుదల, చేప నుంచి త్యాగచింతన అలవరచుకోవాలి. చీమలా జిహ్వచాపల్యానికి లోను కారాదు. అప్పుడే సుఖానికి మూలం అవగతమవుతుందని దత్తాత్రేయుడు ప్రబోధించాడు. మానావమానాల్ని సమానంగా చూడటాన్ని బాలల నుంచి నేర్చుకోవాలి మనిషి. వృద్ధిక్షయాలు శరీరానికే గాని ఆత్మకు కావన్న అక్షర సత్యాన్ని చంద్రుడి నుంచి గ్రహించి మసలాలి. లేడి నుంచి త్యాగనిరతిని, సాలె పురుగు నుంచి ‘సృష్టి స్థితి లయ కారకుడు పరమాత్మే’నన్న తెలివిడిని పొందాలి. ఆత్మానందం దొరికే చోట సంచరించాలని సీతాకోక చిలుక నుంచి నేర్వాలి. ఆర్తుల్ని కాపాడే పారమార్థిక చింతను జలం నుంచి సొంతం చేసుకోవాలి. అవన్నీ తానూ నేర్చుకున్నందువల్ల ఎందరో గురువులయ్యారని పలికిన జ్ఞానానందమయుడు, జగద్గురువు దత్తాత్రేయ స్వామి! శ్రీదత్తుడు సతీ మదాలస ముద్దుల పట్టి అలర్కుడికి యోగవిద్య నేర్పించాడు. ఓంకారోపాసన విధానాన్ని ప్రబోధించాడు. పరశురాముడికి శ్రీవిద్యను ఉపదేశించాడు. ప్రహ్లాదుడికి ఆత్మజ్ఞానం ప్రసాదించాడు. అవధూతలకే అవధూత, పరమహంసలకే పరమహంస దత్తుడు. విష్ణుదత్తుడి యోగ్యత గ్రహించిన ఆయన, వేదాంతాన్ని విశదీకరించాడు. తాను చాటి చెప్పినవి లోకుల ఆత్మజ్ఞాన ప్రాప్తికి, మోక్ష తృష్ణకు సోపానాలని వర్ణించాడు. దత్తుడి అనుగ్రహానికి ఎందరెందరో పాత్రులయ్యారు. త్రిమూర్తుల అనుగ్రహ అవతారం కావడంతో, దత్తుడి రూపం మూడు తలలతో ప్రకాశిస్తుంది. ఆయనకు మేడిచెట్టు ప్రీతిపాత్రమైనది కావడంతో, దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గురుదత్తుడికి పదహారు అంశ రూపాలున్నాయని ‘దత్తపురాణం’ చెబుతుంది. అనేకులు దత్తోపాసనతో తరిస్తుంటారు. ‘మత్స్య పురాణం’ శ్రీదత్త చరితను అభివర్ణిస్తుంది. దత్తక్షేత్రాలు 12 అని ఆ క్షేత్ర మహిమల గ్రంథం వివరిస్తుంది. మనుషులందరూ సమానులే. ప్రేమ, అహింస, ఆత్మజ్ఞానం, త్యాగశీలత, భూతదయ వారికి రక్షణ కవచాలు. దత్తతత్వం బోధించే ఇవన్నీ సర్వదా అనుసరణీయాలు! - చిమ్మపూడి శ్రీరామమూర్తి
 అంతర్యామి
భ్రమర నాదాలు  
భ్రమరం అంటే తుమ్మెద. దీనికి మధువ్రతం, మధుకరం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, అళి మొదలైన పేర్లు ఉన్నాయి. పూలలోని తేనెను తాగుతూ, ఝుమ్మని నాదాలు చేయడం తుమ్మెదకు అలవాటు. విష్ణువును స్తుతించిన శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’ రచించి, లోకానికి ప్రసాదించారు. షట్పది అనే మాటకు అర్థం ‘ఆరు పదాలు గలది’. తుమ్మెదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి, ఆ పదం సరిపోతుంది. భగవత్పాదుల స్తోత్రంలోనూ ఆరు పదాలు విరాజిల్లుతున్నా, అవి తుమ్మెదకు సంబంధించినవి కావు. విష్ణువును ఉద్దేశించిన నామాలు అవి. అందువల్ల ఆ స్తోత్రం ‘షట్పది’ అయింది. పద్మం చుట్టూ తుమ్మెద తిరిగినట్లే, తన ముఖం అనే పద్మం చుట్టూ ఆరు పదాలూ తిరుగుతుండాలని హరిని భగవత్పాదులు కోరుతున్నారు. ‘నారాయణా, కరుణామయా, శరణం కరవాణి తావకౌ చరణౌ’ అనే వాక్యంలో ఆరు పదాలు ఉన్నందువల్ల, అది షట్పదీ స్తోత్రమైంది. తుమ్మెదలు పద్మం నుంచి మకరందాన్ని తాగుతాయి. అలాగే ముఖపద్మంలో నుంచి ఆరు విష్ణు పదాల మకరందం గ్రోలడానికి స్తోత్రం అనే తుమ్మెద తిరుగుతుండాలని సారాంశం. ఆ ఆరింటి మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే. ‘ఓ హరీ! మొదట నా అవినయాన్ని పోగొట్టు. నా మనసును నియంత్రించు. భూతదయను పెంపొందించు. సంసారం అనే సముద్రం నుంచి నన్ను ఒడ్డుకు చేర్చు. నీ పాదాలు కమలాలు. ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ మకరంద ప్రవాహం వంటిది. సచ్చిదానందాలే ఆ పద్మాల సుగంధాలు. సంసార బంధాలవల్ల కలిగే భయాల్ని పోగొట్టేవి ఆ పాదపద్మాలే! హరీ! నీకు, నాకు భేదం లేకున్నా- ఎప్పుడూ నేను నీవాణ్ని అవుతాను కానీ, నువ్వు నా వాడివి కాదు. అదెలా అంటే- కెరటాల్ని చూసే జనం అవి సముద్రానివే అంటారు. అంతే తప్ప, సముద్రమే కెరటాలకు సంబంధించినదని ఎవరూ అనరు. పర్వతాల రెక్కల్ని తొలగించిన ఇంద్రుడి సోదరుడివి నువ్వు. అందుకే నీకు ‘ఉపేంద్రుడు’ అని పేరు. రాక్షసులకు నువ్వు శత్రువు. సూర్యచంద్రులే నీ కళ్లు. ఇంతటి మహిమ గల నిన్ను చూస్తే చాలు, సంసార దుఃఖాలన్నీ దూరమవుతాయి. ఓ హరీ! లోకాల్ని రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తావు. ఎందరినో రక్షించావు. సంసార బంధాలతో భయపడుతుండే నన్ను కాపాడేదీ నువ్వే! నువ్వు వనమాల ధరించావు. గుణాలన్నీ నీలో మణుల్లా వెలుగుతున్నాయి. నీ వదనం అనే పద్మం ఎంతో అందమైనది. సంసార సాగరాన్ని మధించడానికి మందర పర్వతంలా నిలుస్తావు నువ్వు. నా భయాలన్నింటినీ పోగొడతావు...’- ఇలా షట్పదీ స్తోత్రం అంతా మానవుడిలోని ఆర్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆర్తుల్ని ఉద్ధరించాలంటూ స్వామిని స్తుతించడమే భగవత్పాదుల పరమార్థంగా స్పష్టమవుతుంది. మహర్షులు, యోగులు, మహాకవులు విశ్వక్షేమాన్నే కాంక్షిస్తారు. లోకుల భయాల్ని పోగొట్టడానికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తారు. అదే పనిని శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’లో చేశారు. ఆరు శ్లోకాలు, ఆరు విష్ణునామాంకిత పదాలు మకరంద బిందువుల వంటివి. వాటిని ఆస్వాదించే ఆ స్తోత్రమే ఒక తుమ్మెద. ‘అది ఎప్పుడూ ఇలాగే నా వదన సమీపంలో తిరుగుతుండాలి’ అని కోరడం అంటే, స్తోత్రాన్ని నిరంతరం పఠించే భాగ్యాన్ని అర్థించడమే! ఇదే ఆ స్తుతిలోని అసలు రహస్యం. మనిషిని సంసారం అనేక విధాలుగా బాధిస్తుంది. ఇలాంటి భయాలు, బాధల నుంచి మనసుకు శాంతి కావాలి. అది భగవన్నామ స్మరణతోనే సాధ్యమని పెద్దల మాట. షట్పదీ స్తోత్రం ద్వారా శంకర భగవత్పాదులు చేసిన మహోపదేశం ఇదే. మనిషి తనలోని ఆత్మశక్తిని విస్మరించకూడదు. మనిషిలోనే శాంతి ఉంటుందని, దాన్ని అతడే తెలుసుకోవాలని స్తోత్ర భ్రమరం ఉపదేశిస్తుంది. ఆ భ్రమర నాదం హృదయంగమం! - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Comments

Popular posts from this blog

ANNAMA CHARYA KIRTANAS G. BALAKRISHNA PRASAD 300 KIRTANAS LINKS

Happy Ganesh Chaturthi songs, download MP3 songs free

SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి