అంతర్యామి ఏకాగ్రత ఆ త్మశుద్ధి లేని ఆచారం, భాండశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివపూజ వ్యర్థమంటాడు వేమన. ఏకాగ్రత లేని పనులు సైతం వ్యర్థమైనవే. కార్యం- అది లౌకికమైనా, ఆధ్యాత్మికమైనా ఏకాగ్రత కొరవడితే చెడిపోతుంది. ‘ధ్యానం’ అనే మాట తరచుగా వింటుంటాం. ధ్యానం, ఏకాగ్రత- రెండూ సహ భావనలే! ఆ రెండింటికీ సన్నిహిత సామ్యం ఉంది. ధ్యానం అనే మాటను పారమార్థిక దృష్టితో వాడతాం. సర్వసాధారణంగా ‘పరధ్యానం’ అనే మాటనూ ఉపయోగిస్తుంటాం. ఎవరికైనా ధ్యానం అలవడాలంటే, ఏకాగ్రత కుదరాలి. అది సాధించాలంటే, ధ్యానం సాగించాలి. ప్రహ్లాదుడిది అనితరసాధ్యమైన విష్ణుభక్తి. తండ్రి ఎన్ని హింసలకు గురిచేసినా, అతడి మార్గానికి అవరోధం కలగలేదు. నమ్మిన దైవం పట్ల అచంచలమైన ఏకాగ్రతే దానికి కారణం. అలాగే, తండ్రి ప్రేమ పొందాలని ధ్రువుడు చెక్కుచెదరని దీక్షతో తపస్సు చేశాడు. ఆ ధ్యానానికి మూలం ఏకాగ్రత. వసిష్ఠుణ్ని మించిన బ్రహ్మర్షి కావాలన్నదే రాజర్షి విశ్వామిత్రుడి ప్రగాఢ కోరిక. దాన్ని ఆయన ఏకాగ్ర చిత్తం, పట్టుదలతో తపస్సు చేసి సాధించాడు. ‘భగీరథ ప్రయత్నం’ అనే మాట వింటుంటాం. తన పూర్వీకులకు పుణ్యలోకాలు ప్రాప్తింపజేయాలన్న తపన ఆయనది. అదే దీక్షతో, ద...