వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతి స్త్యజ్యతామ్ !
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం
ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్ !! ౧
ప్రతిదినము వేదాధ్యయనం చేయుము. అందులో చెప్పబడిన కర్మలను అనుష్ఠించుము. ఈ కర్మాచరణమే ఈశ్వర పూజ అగు గాక, కామ్యముతో కర్మలను చేయుటను త్యజించుము. పాపములను పోగొట్టుకొనుము. సంసార సుఖములను (నిత్య అనిత్యాది విషయ సుఖములు) అనుసంధానించి పరిశీలించుము ఆత్మజ్ఞానము పొందడంలో కోరికను పెమ్చుకొనుము. గృహ నుండి అతి శీఘ్రముగా బయటికి వెళ్ళుము (శీఘ్రముగా శరీరభ్రాంతి నుండి దూరము అవ్వడానికి ప్రయత్నించుము).
సఙ్గః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం
శాన్త్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సన్త్యజ్యతామ్ !
సద్‍విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం
బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్ !! ౨
సత్సాంగత్యమును నెరపుము, సజ్జనులతోటి కలిసి మెలసి ఉండుము. భగవంతునిపై దృఢమైన భక్తిని కలిగి ఉండుము. శాంతి మొదలగు గుణములను ఆర్జించుము, కామ్య కర్మలను వర్జింపుము. సద్విద్వాంసులను, సద్గురువులను ఆశ్రయింపుము, వారి పాదుకలను ప్రతిదినమూ సేవింపుము . బ్రహ్మప్రాప్తికి తోడ్పడు ఏకాక్షర బ్రహ్మమంత్రమగుఓంకారమంత్రమును అర్థించుము. శ్రుతుల శిరస్సులగు (వేదాంతములు) ఉపనిషత్తుల వాక్యములను వినుము.
వాక్యార్థ్యశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతాం
దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసన్థీయతామ్ !
బ్రహ్మైవాస్మి విభావ్యతామహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహేఽహం మతిరుజ్ ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్ !! ౩
తత్త్వమస్యాది మహా వాక్యములను అర్థం చేసుకొనుటకు ప్రయత్నింపుము (విచారణ చేయుము), శ్రుతిశిరస్సులైన వేదాంత పక్షాన్ని పొందుము/ఆశ్రయింపుము.కుతర్కము వీడుము. శ్రుతి సమ్మతమగు తర్కమునే గ్రహించతగినది. ’నేను బ్రహ్మమును’ అని ప్రతిదినము భావింపుము. గర్వాహంకారములను వీడుము. శరీరమున’అహం’-’నేను’ అను బుద్దిని వీడుము. బుధజనులు/పండితులతో అనవసర వాదు పరిత్యజించుము.
క్షుద్‍వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్ !
శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం
ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్యముత్సృజ్యతామ్ !! ౪
ఆకలిదప్పులను వ్యాధికి చికిత్స చేయుము, ప్రతిదినము భిక్షాన్నమను ఔషధము సేవింపుము. రుచికరములగు భోజన పదార్థములను యాచింపక, విధివశమున లభించినదానితో తృప్తిని పొందుము. శీతోష్ణాది ద్వంద్వములను తితిక్షాబుద్ధితో సహింపుము. వ్యర్థముగా వాక్యములను మాట్లాడకుము. ఉదాసీనతను వహింపుము (ప్రతి దానికీ కదిలిపోకుండా ఉండే గుణాన్ని అలవర్చుకొనుము) , లోకుల యెడ నిష్ఠూరుడవు కాబోకు.
ఏకాన్తే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ !
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం
ప్రారబ్ధస్త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ !! ౫
ఏకాంతం ప్రదేశంలో సుఖముగ కూర్చుండుము. పరబ్రహ్మతత్త్వమునకై చిత్తమున సమాధాన పరచుము. ఈ జగత్తును పూర్ణబ్రహ్మముగా జూచుచు, అది విలీనమైనట్లు భావింపుము. జ్ఞానమునాశ్రయించి రాబోవు కర్మలయందు ఆసక్తుడవు కాకుండుము, ప్రారబ్ధను (భోగమును, దుఃఖమును) అనుభవించుచు, బ్రహ్మముయందే నిలచి ఉండుము (పరబ్రహ్మస్థితియందే నిమచు ఉండుము).
ఫలశ్రుతి
యఃశ్లోక పఞ్చకమిదం పఠతే మనుష్యః
సఞ్చిన్తయత్యనుదినం స్థిరతాముపేత్య !
తస్యాశు సంసృతిదవానలతీవ్రఘోర
తాపః ప్రశాన్తిముపయాతిచితి ప్రసాదాత్ !!
ఇతి శ్రీ శఙ్కరభగవత్పూజ్యపాద విరచిత సాధన పఞ్చకమ్
ఏ మానవుడు ప్రతిదినమూ ఈ శ్లోక పంచకమును పఠించుచు స్థిరచిత్తముతో భావార్థమును చింతించుచుండునో, అతడు శీఘ్రముగానే సంసృతి- తీవ్ర దావానల - తీవ్ర ఘోర - తాపమును, చైత్యన్య స్వరూపుడైన ఈశ్వరప్రసాదమున పోగొట్టుకొనును.
ఇది పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య కృత సాధనా పఞ్చకము
No comments:
Post a Comment