Saturday, November 23, 2013

PARAMA PAVANAM_RAMA NAMAM_srju nanda

Sraju Nanda
Sraju Nanda5:05pm Nov 23
పరమపావనం - రామనామం

భగవన్నామ స్మరణకు మించిన ఉత్తమ సాధన కలియుగంలో లేదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ప్రతీ భగవన్నామంలో ఒక నిగూఢ అంతరశక్తి, మహిమ వుంటుంది. మనకున్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండక్షరాలా "రామ" మంత్రం శ్రేష్టమైనదని మనుస్మృతి తెలుపుతుంది. ఇది హరిహరతత్వంబు కలిసిన మహామంత్రం.
'ఓం నమోనారాయణాయ' అనెడి ఆష్టాక్షరి మంత్రములో "రా" అను అక్షరం జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'రా' తొలగించినచో ఓం నమో నాయణాయ అన్నది అర్ధం లేనిదవుతుంది) 'ఓం నమశ్శివాయ' అనెడి పంచాక్షరి మంత్రంబులో "మ" అనునది జీవాక్షరం. (ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగించినచో ఓం నశ్శివాయ అంటే శివుడే లేడని అర్ధం) ఈ రెండు జీవాక్షరముల సమాహారమే "రామ". శివకేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం. అందుచే రామమంత్రం సర్వశక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రముగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
100 కోట్ల శ్లోకాలతో రామాయణం వాల్మికిచే రచింపబడినది. అది త్రైలోక్యవాసుల సొత్తు. దానిని పరమశివుడు అందరికి పంచెను. 33 లక్షల 33 వేల 333 శ్లోకముల వంతున పంచగ 1 శ్లోకం మిగిలిపోయింది. దానిని కూడా పంచమని మునులు కోరారు. ఆ శ్లోకంలో 32 అక్షరములు ఉన్నవి. దానిని దశాక్షరి రూపమున ముగ్గురికి పంచగా రెండక్షరములు మిగిలినవి. ఆ రెండక్షరములు శివుడు తనకై తీసుకున్నాడని కధనం. ఆ రెండక్షరములే "రామ".

*రామనామ ప్రభావం*
"రామ" అను రెండక్షరములు మనోహరమైనవి. మధురమైనవి. అమృత సమానం. ఈ రెండు అక్షరములు ముక్తి అను అమృతమును ఇచ్చును. సులభమైన ఈ నామం ఇహమందు సుఖమును, సంపదలను ఇస్తే, పరమునందు విష్ణుసాయుజ్యం ఇస్తుంది. లౌకికముగా భవభూతి, పారమార్ధికముగా ఆత్మానుభూతి రామనామం వలన కల్గుతుంది.
రాశబ్దోచ్చారణే జాతే వక్ర్తాత్పాపం విగచ్ఛతి / మకార శ్రవణే జాతే భస్మీభావం గమిష్యతి // (ఉమాసంహిత)
('రా' అను శబ్దం ఉచ్చరించగానే పాపం వదనమునుండి బయటపడును. పిదప 'మ'కారము వినుటతోడనే భస్మమైపోవును)
రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ / యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః // (ఉమాసంహిత)
(రామ, రామచంద్ర, రామభద్ర, అను ఈ మంత్రాలలో దేనినైనను జీవితాంతం వరకు జపించు మనుజుడు జీవన్ముక్తుడు కాగలడు. ఇందులో సంశయం లేదు)
కృశాను (అగ్ని) 'ర'అక్షరం అగ్నిబీజాక్షరం. భాను (సూర్యుడు) 'అ'అక్షరం సూర్యబీజాక్షరం. హిమారక (చంద్రుడు) 'మ'అక్షరం చంద్రబీజాక్షరం. ఈ మూడు బీజాక్షరములు కలసి "రామ" శబ్దమయ్యెను. అగ్నిగుణం దహించుట. అగ్నిబీజాక్షరమగు 'ర' శుభాశుభ కర్మలను దహించి మోక్షమును ఇచ్చును. సూర్యుని వలన అంధకారం నశించును. అటులనే సూర్య బీజాక్షరం 'అ' మోహాందకారమును పోగొట్టును. చంద్రుడు తాపమును హరించును. అటులనే చంద్రుని బీజాక్షరం 'మ' తాపత్రయమును హరించును.
ఉత్పత్తి కర్తయగు బ్రహ్మవంటివాడు చంద్రుడు. పోషణ కర్తయగు విష్ణువువంటివాడు సూర్యుడు. సంహార కర్తయగు శివునివంటివాడు అగ్నిదేవుడు. ఈ త్రిమూర్తిస్వరూపుడు శ్రీరాముడు.
రామ మంత్రము ఎటువంటిదంటే - పుట్టుట, గిట్టుట అనెడి అలలు గల సంసారమను సముద్రం దాటించునదియును, బ్రహ్మవిష్ణురుద్రాదుల చేత పొగడదగినదియును, బ్రహ్మహత్యాది మహాపాపములను నశింపజేయునదియును, కామక్రోధలోభ మోహమదమాత్సర్యాలాది దుర్గుణములను సంహరించునదియును, నేను జీవుడనేడి అజ్ఞానం తొలగించునదియును, పరబ్రహ్మం (చైతన్యం) నేననెడు దివ్యజ్ఞానం వలన కలిగిన నిరాతిశయానందమును వర్ధిల్లుజేయునదియును, వేదముల కడపటిభాగమైన జ్ఞానకాండం చేత విచారింపదగినదియుయగును. ( శ్రీ సీతారామాంజనేయ సంవాదం)
రా శబ్దోశ్చారణాదేవ ముఖాన్నిర్యాంతి పాతకాః / పునః ప్రవేశ భీత్యాచ మకారస్తూ కవాటవత్ //
(నోరు తెరిచి "రా" అని చెప్పునప్పుడే పాపములన్నియు నోటినుండి బయటికి వెళ్లిపోవుచున్నవి. మరల అవి లోపలకు ప్రవేశించకుండా "మ"కారం తో నోటిని మూసి బంధించుచున్నది)
"రా" అక్షరం ఉచ్చరించుటవలన నోరు తెరవబడి పాపములు పోయి ముఖం మధురముగా ఉండును. "మ" అక్షరం ఉచ్చరించుటవలన నోరు మూతపడి సంతోషం కలుగును.
"రా" అక్షరం బ్రహ్మస్వరూపుడునగు ఆదికూర్మముతో సమానం. "మ" అక్షరం జీవస్వరూపుడగు ఆదిశేషువుతో సమానం.
"రా" అక్షరం ఛత్రం వలెను, "మ" అక్షరం కిరీటం వలెను సర్వ వర్ణములకంటే అధికముగా ప్రకాశించును. ఇటువంటి రామనామమును జపించిన సిద్ధత్వమును పొందుదురు.
"రా" అగ్నిబీజాక్షరం కావున దానిని స్మరించిన మాత్రమున సకలపాపములు భస్మము కావించుననియు, "మ" అమృతబీజాక్షరం కావున దానిని స్మరించిన యెడల సత్యముగా మోక్షం ఇచ్చుననియు ఋషులు తెలిపారు.
"రా" అనగా పరబ్రహ్మం, "మ" అనగా చిచ్ఛక్తి. "రా" అనగా క్షేత్రజ్ఞుడు, "మ" అనగా జీవుడు. "రా" అనగా శివుడు, "మ" అనగా శక్తి. "రా" అనగా విష్ణువు, "మ" అనగా లక్ష్మి. "రా" అనగా బ్రహ్మం, "మ" అనగా సరస్వతి. "రా" అన్న మాత్రమున యముడు గజ గజ వణుకును, "మ" అన్న మాత్రమున అతని పాశం తెగిపోవును. రామ అన్న భవబంధములు నశించును. రామ అన్న సమస్త సంపదలు కల్గును. రామ అన్న సర్వార్ధములు సిద్ధించును. రామ అన్న బ్రహ్మహత్యాదిపాతకములెల్ల నివర్తియగును. రామ అన్న సకల సంశయములు నివృత్తియగును. రామనామం స్మరణం చేసేవారికి మోక్షం కరస్థమై రామమయమై ఉన్నది. రామ మంత్రముకంటే అధికమైన యజ్ఞంగాని, తపంగాని, వ్రతంగాని, మంత్రంగాని, మరియొకటి లేదు.
*తారక మంత్రం*
తారకం సర్వవిషయం సర్వధా విషయమక్రమం చేతి వివేకజం జ్ఞానం // (పతంజలి యోగం)
(వివేక జన్య జ్ఞానం తారకం. ఆత్మానాత్మ వివేకజ్ఞానముచే కలిగెడు శుద్ధమైన ఆత్మజ్ఞానమునకు తారకమని పేరు. (సంసార సాగరమునుండి తరింపజేసేది కాబట్టి ఇట్టి వివేకజ్ఞానమునకు తారకం అంటారు)
రామ మంత్రం ఒక్కటియే తారకమంత్రమైనది.
తా, రకం - తన యొక్క స్వరూపం. తన స్వరూపం తాను తెలిసికొనినచో ఏ చింతయు లేక మనస్సు నెమ్మది పొందును. పరమాత్ముడైన శ్రీరామునితో ప్రత్యగాత్మ స్వరూపుడైన తాను వియ్యమగుటయే యోగమనబడును.
రామ ఏవ పరబ్రహ్మ రామ ఏవ పరం తపః రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మతారకం//

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే / సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే //
(నేను సదా రామనామమును ధ్యానించెదను, అది విష్ణు సహస్రనామములకు సమానమైనది. నీవును ఆ నామమును జపించుమని శివుడు పార్వతీదేవికి ఉపదేశించెను)
తారక మంత్రమునే శివుడు సదా జపించెను. జీవుడు ముక్తి పొందవలెనని తలచి కాశీలోని మరణకాలమున ఈశ్వరుడే తారకమంత్రం స్వయముగా జీవుల దక్షిణ చెవియందు ఉపదేశించును. రామ అను శబ్దమును మరా అని జపించి దోపిడిదొంగ రత్నాకరుడు వాల్మికి మహాముని అయ్యెను. సహస్రనామములతో సమానమని శివుని వచనమును విని, పార్వతీ రామనామమును పఠించి శివుని సాంగత్యం నొందెను. తన వచనములయందామెకు గల విశ్వాసం జూచి, సంతచించి ప్రసన్నుడై పార్వతికి శివుడు తన శరీరములో ఎడమభాగమును ఇచ్చెను. రామనామ స్మరణతో రాయిరూపంలోఉన్న అహల్య రామస్పర్శకు నోచుకొని పునీతురాలైనది.
రామ అను తారకమంత్రము చేత సకల పాతకములు నశించును. పార్వతీదేవికి పరమేశ్వరుడు, వాల్మికికీ నారదుడు, భరద్వాజునకు వాల్మికి, వ్యాసులకు పరాశరులు, శుకులకు వ్యాసుడు ఉపదేశించినది తారక మంత్రమే.
తారకమంత్రము కంటే ఉత్తమమంత్రం లేదు. ఈ మంత్రమును త్రికరణశుద్ధిగా అనుష్టించినవారు భవసాగరమును నిస్సంశయమముగా తరింపగలరు. నిరంతంను ప్రాణావాయువు లోపల వెలుపల సంచరించు నప్పుడెల్లను తదేకధ్యానముతో తారకమంత్రమును మననింపుచు ఉన్నను కాలక్రమేణ ఈ మహామంత్ర ప్రభావంచే ముక్తిని పొందుదురు. (మహాభక్త విజయం)
రామ అన్నది ఒక్క నామమే కాదు, మంత్రం కూడా. రామ మంత్రం మనిషిని తరింపజేసేది కావునా అది తారకమంత్రమైంది. ఇందుకు ఉదాహరణముగా ఓ కధని కంచి పీఠమునకు అధిపతి అయిన శ్రీ చంద్రశేఖరసరస్వతివారు ఓసారి చెప్పారు. ఓ అడవిలో కొందరు దొంగలు తాము చేద్దామనుకుంటున్న దొంగతనం గురించి ఇలా మాట్లాడుకొని ముక్తిని పొందినట్లు ఓ కవి చమత్కారముగా చెప్పింది చెప్పారు.
వనే చ రామః వసు చాహరామః
నదీం స్తరామః నభయం స్మరామః
వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే
అంటే - వనే చ రామః (అడవిలో నివశిద్దాం), వసు చాహరామః (ఈ దారిలో వెళ్ళే ప్రయాణికులనుండి సంపదను దొంగలిద్దాం), నదీం స్తరామః (దొంగాలించాక నదిని దాటేద్దాం), నభయం స్మరామః (నదిని దాటేస్తే పట్టుబడతామనే భయం వుండదు) అని అనుకున్నారు. వారు దొంగలైనప్పటికి వారి మాటలలో రామః అను శబ్దం వుండడం వలన వనే కిరాతః ముక్తిం గతాః షంగాతే .... ఆ అడవిలో కిరాతకులు మరణించినతర్వాత ముక్తిని పొందారు. రామ అన్న పదమహిమ తెలియకున్నా ఆ కిరాతకులు వారివారి మాటలమద్య అసంకల్పితముగా రామ అని పలికినందులకే ముక్తి లభిస్తే, భక్తితో శ్రద్ధతో స్మరిస్తే ఇహపరములందు ఎంతలా తరిస్తమో గుర్తించండి.
శ్రీరామప్రాతిపదికమవశేనాపి సంగృణన్ / ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం పునర్బుద్ధిపూర్వకమ్ // (ఉమా సంహిత)
(శ్రీరామ అను ప్రాతిపదికమును తెలియక ఉచ్చరించినను మనుజుడు ముక్తినొందుననగా తెలిసి ఉచ్చరించిన ముక్తినొందుననుటలో సందేహం ఏముంటుంది?)

*నామము గొప్పదా - రూపం గొప్పదా*
రూపం నామమునకు ఆధీనం. నామం లేక రూపం యొక్క జ్ఞానం కలుగదు. రూపంగల పదార్ధం చేతిలో వున్నను నామం తెలుసుకొనని యెడల ఆ పదార్ధం గుర్తెరుంగం. నామమును ధ్యానిస్తే రూపం స్వయముగా హృదయంలో వ్యక్తమగును. మనస్సునకు ఆనందం కలుగును. సగుణ, నిర్గుణ బ్రహ్మములకు నామమే సాక్షి. ఈ రెండింటిని తెలుసుకొనుటకు నామమే ప్రధానము.వానిని చేరుటకు నామం మార్గం చూపును. (మహాభక్తవిజయం)
బ్రహ్మం సగుణమనియు, నిర్గుణమనియు చెప్పవచ్చును. సగుణ నిర్గుణములకంటే నామమే శ్రేష్టం. ఎందుకంటే - నామం యొక్క ప్రభావంవలన సగుణ నిర్గుణములు రెండును స్వాదీనమగును. అగ్ని దారువులో కలదు, ఆ అగ్నియే ప్రకటమై ప్రజ్వరిల్లును. మొదటిది అవ్యక్తం, రెండవది వ్యక్తం. అటులనే నిర్గుణబ్రహ్మం అవ్యక్తం, సగుణబ్రహ్మం వ్యక్తం. రెండును అగమ్యములు. నామం మాత్రం గమ్యం. అందుచేత బ్రహ్మం కంటెను, రాముని కంటెను నామం శ్రేష్టమైనదని చెప్పుదురు. సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మం జీవుని హృదయములలో ప్రకాశిస్తున్ననను లోకములో సమస్తజీవులను అది గ్రహించలేక దుఃఖితులై అగచాట్లు పడుచున్నారు. ఆ కారణంచే ఆ బ్రహ్మం రూపమును ధరించి పేరు పెట్టుకొని లోకమునకు వ్యక్తమగుచున్నాడు. ఆ సగుణబ్రహ్మమునకు నామం లేనిచో స్మరించలేముకాబట్టి సగుణనిర్గుణబ్రహ్మములకంటే నామం యొక్క ప్రభావము శ్రేష్టమైయున్నది. సగుణబ్రహ్మం మాధుర్యమూర్తి, నామం మాధుర్య మహిమాశక్తి దీప్తి. రాముని వలన తరించినవారు కొందరే, రామనామం వలన తరించువారు అనంతమంది.
రామనామ్ మణిదీప్ ధయ జొహ్ రే హరంద్వార్
తులసి భీతర్ ఛాహే రహు జాం బహం ఉజ ఆర్ (తులసీదాసు)
(నీకు లోపల బయట వెలుగు కావాలని కోరుకుంటే, జిహ్వ అనే ద్వారం దగ్గర రామనామం అనే దీపాన్ని వెలిగించండి)

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే / రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః //
శ్రీరామున్ని కౌసల్యాదేవి రామా అనియు, దశరధుడు రామభద్ర యనియు, వసిష్టమహర్షి రామచంద్ర యనియు, రాజులు రఘునాధ యనియు, సీతాదేవి నాధ యనియు, భక్తులు సీతాపతి యనియు, సంబోధింతురు. అట్టి సీతారామునకు నమస్కారం.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular