ఆలయదర్శనముల, అర్చనల ఆవశ్యకత
ఆలయము అంటే భగవంతుడిని ఓ వ్యక్తరూపంలో ప్రతిష్టించి ఆరాదించే ప్రదేశం. సర్వాంతర్యామిఅయిన పరమాత్ముడు ఓ పరిధికి లోబడి ఓ ప్రదేశంనందే ఉంటాడా? అవతారపురుషుడు శ్రీరామచంద్రుడుచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. అలానే వసిష్ట, వ్యాస, భరద్వాజ, అగస్త్యాది మహర్షులచే ప్రతిష్టింపబడిన దేవాలయములు ఉన్నాయి. ఎందుకు వీరు దేవాలయాలు ప్రతిష్టించారు? మనుజుల మనస్సు చంచలమై యుండు కారణముచే, మందబుద్ధి కలిగియుండుటచే, పరబ్రహ్మం సర్వవ్యాపియై ఉండినను అది అవ్యక్తమై యుండిన కారణమున దానిని జనులు గ్రహించలేరు. అందుచే జనుల హితార్ధమై భగవంతున్ని సాకారరూపంలో వ్యక్తంచేయడం జరిగింది. న తే రూపం న చాకారో నాయుధాని న చాస్పదమ్ తధాపి పురుషాకారో భక్తానాం త్వం ప్రకాశసే భగవంతునికి ప్రత్యేకముగా ఒక రూపంగానీ, ఒక ఆకారంగానీ, శంఖచక్రశూల డమరుకాది ఆయుధములుగానీ, వైకుంఠ కైలాసాది ప్రత్యేక స్థలములుగానీ లేనప్పటికిని భక్తవత్సలుడు అగుటచేతను పరమ కరుణాస్వరూపుడు అగుటచేతను, భక్తులయొక్క భావమును అనుసరించి రూపమును ధరించుచున్నాడు. సూర్యుని కిరణాలు అనంతమైన ఉష్ణశక్తిని కలిగివున్నాయి. చిన్న కాగితాన్ని ఎండలో పెడితే అది తనంతట తానుగా కాలిపోదు. కానీ ఓ కటకం ద్వారా సూర్యకిరణములను ఆ కాగితంపై కేంద్రీకరిస్తే కాలిపోతుంది. అలాగే సర్వవ్యాపి అయిన పరమాత్మ అనుగ్రహశక్తిని ఒకచోట కేంద్రీకృతం చేస్తూ నిర్మించేవే ఆలయములు. శివజ్ఞానం ద్విధా జ్ఞేయం సగుణం నిర్గుణం తధా ఆదౌ సగుణమాశ్రిత్య పశ్చాన్నిర్గుణ మాచరేత్ అవ్యక్తమైన శివ స్వరూపం రెండు విధములుగా గ్రహింపదగినది. అవి సగుణ, నిర్గుణములు. మొదట సగుణోపాసన చేసిన తర్వాత తనంతటనే నిర్గుణమై పరిణమించును. దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు అని గ్రహించినను సమస్త మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ సాకారంలోను, సగుణోపాసనలోనూ భగవంతుని ఉనికిని తెలియబరుస్తూ ఆలయనిర్మాణములు చేసి, అర్చనాదుల ద్వారా భక్తిని అలవర్చుకొని క్రమేనా జ్ఞానత్వమును పొంది జనులు ముక్తులవ్వాలని ఋషులు ఇవన్నీ ఏర్పరిచిరి. పశురాత్మా స్వతంత్రశ్చ చిన్మాత్రో మలదూషితః సమ్మూడో నిత్యసంసారీ కించిజ్జ్నోనీశ్వరో క్రియః జీవుడనగా పశుప్రాయుడు, పరతంత్రుడు, కించిజ్జ్నుడు, జ్ఞానమాత్రుడు, మాయామలముతో కూడినవాడు, జ్ఞానహీనుడు, నిత్యసంసారి, మందుడు, శక్తిహీనుడు, క్రియారహితుడు, స్వల్పగుణములచే మాయాబద్దుడు. కనుక ఈశ్వరకరుణలేక జీవునికి జ్ఞానం కలుగనేరాదు. కాబట్టి ఈశ్వరపూజ అత్యావశ్యకం. శివార్చనవిహీనో యః పశురేవ న సంశయః స తు సంసారచక్రేస్మిన్ అజస్రం పరివర్తతే ఎవరు ఈశ్వరపూజార్చనాది కర్మములు చేయలేదో, వారు నిశ్చయంగా ద్విపాదపశువే. పూజార్చనాది పుణ్యకార్యములను చేయనివారు ఈ జననమరణ సంసారచక్రమందు సర్వదా తిరుగుచుండునే గానీ మోక్షమును పొందలేరు. దేవాలయ దర్శనములు చేస్తున్నప్పుడు, దైవ విగ్రహంలు చూస్తున్నప్పుడు, దైవార్చన జరుగుతున్నప్పుడు మనస్సు ఓ విధమైన ప్రశాంతతతో భక్తిభావంలో తాదాత్మ్యం చెందుతుంది. కాబట్టి ఇవన్నీ మహర్షులు ఏర్పరిచిరి. సాధారణంగా సాధకునికి ప్రాధమికంగా భక్తిభావం కలుగుటకు, భౌతిక ప్రాపంచిక విషయములయందు నిరంతరం ఊగిసలాడే మనస్సును కొంతసమయమైన భగవంతునియందు లగ్నం చేయుటకు, నిశ్చల ధ్యాననిష్ట కుదురుటకు ఇవి ఎంతో ప్రయోజకరం. దేవాలయనిర్మాణముల ఉద్దేశ్యం ఇదే. ఆలయదర్శనమప్పుడు అక్కడ మనం చూసే ఆరాధనామూర్తిని దైవానికి ప్రతీకగా గుర్తించి నమ్ముతాం. తద్వారా దైవభక్తి ఏర్పడి విషయవాసనలు తగ్గుతాయి. భక్తిభావములను పెంచే వాతావరణం ఆలయప్రాంగణంలో ఉండడంవలన, ఇచ్చట జరిగే జపహోమ యజ్ఞయాగాదుల వలన ఆధ్యాత్మికశక్తి నిక్షిప్తమై ఉండడంవలన మనస్సు మనవశంలో ఉంటుంది, చెడు చింతనలు తొలగిపోతాయి. పవిత్రభావన, సత్వబుద్ధి, చిత్తశుద్ధి ఏర్పడతాయి. ఆధ్యాత్మోన్నతికి, ఆత్మసాక్షాత్కారస్థితి కలుగుటకు సోపానములు ఇవే. ఓ పద్దతిగా జరిగే అర్చనాదులన్నియు భక్తిభావంను కల్గించేవే. ఆధ్యాత్మికభావంను దృఢపర్చేవే. అలానే నైవేద్య నివేదనలో కూడా భక్తిని పెంచే గొప్పభావం ఉంది. నైవేద్యం పెట్టి నివేదన చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని చదువుతారు - త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే తేన త్వదంఘ్రి కమలే భక్తిం మే యచ్చ శాశ్వతీం గోవిందా! నీ వస్తువులు నీకే సమర్పిస్తున్నాను. వీనితో నీ చరణకమలాలపై శాశ్వతమైన భక్తి కలుగునట్లు ప్రసాదించు. ఈ విధమైన దర్శన, అర్చనాదుల ద్వారా పంచేద్రియములు, మనస్సు ఎలా భక్తిభావమునందు లయమౌతాయంటే - దైవత్వమును, ఆధ్యాత్మిక వివరణత్వమును పొందుపరుస్తూ అద్భుతంగా నిర్మించబడిన ఆలయములను, దివ్యమంగళకరమగు భగవద్విగ్రహంను దర్శిస్తూ నేతేన్ద్రియములు భక్తిత్వంలో లయించును. సుగంధ ధూపవాసనలచే ఘ్రానేన్ద్రియం లయించును. ఓంకారం, గంటానాదం, శంఖారావం, మంత్రోచ్చారణలయందు కర్ణేన్ద్రియములు లీనమగును. భగవన్నామోచ్చారణల చేతను, తీర్ధాది ప్రసాదముల చేతను జిహ్వేంద్రియం లయించును. పరిమళమిళిత శీతలదాయకమగు పసుపుకుంకుమ చందనాదులచే త్వగింద్రియం శాంతంనొంది పవిత్రభావాలతో పులకరించును. పంచేంద్రియములు ఇలా ఒకే ధ్యాసతో భక్తిభావంనందు లయమైనప్పుడే మనస్సు కూడా పూర్తిగా ఏకాగ్రతతో యందు లయించును. ఇలా ఏ చోట ఇంద్రియములు, మనస్సులకు ఏకాగ్రత కలుగునో ఆ చోటే దేవాలయం. ఇలా ఏ చోట జీవాత్మను పరమాత్మలో లయంచేసేభక్తిభావం పెరిగి ఐక్యభావం కలుగునో ఆ చోటే దేవాలయం. పరమాత్మునియందు అచంచలనమ్మకం, భక్తిభావం, శ్రద్ధాదులు కలగడానికే ఆలయదర్శనం. పరమాత్మతో సఖ్యత ఏర్పరుచుకున్నందుకే ఆలయదర్శనం. పరమాత్మతో జీవాత్మను అనుసంధానం చేసేదే అర్చన. మనస్సు ఈశ్వరీయత్వంలో లయింపడానికే అర్చన. ఆలయదర్శనములు, అర్చనలు అన్నీ అంతర్యామి అయిన అనంతుడు ఆత్మరూపియై ఆవాసమున్నచోటుని తెలుసుకోవడానికే. 'మనస్యేకం వచస్యేకం, కర్మన్యేకం, మహాత్మనాం'. మనస్సు, మాట, క్రియా ఈ మూడు ఒకదానికి ఒకటి సంబంధం కల్గియుండాలంటే, ఆత్మజ్యోతిని దర్శించాలంటే, అంతర్గత ఆత్మశక్తిని జాగృతం చేయాలంటే ఈ అలయదర్శన, అర్చనాదులు తప్పవు. ఆధ్యాత్మికమార్గంలో పయనించే సాధకులు అన్ని ఇంద్రియాలను ప్రాపంచిక విషయాలనుండి తప్పించాలి. మనస్సును పూర్తిగా జయించాలి. ఇంద్రియాలు మనస్సు ఆధీనంలో, మనస్సు బుద్ధి ఆధీనంలో, బుద్ధి ఆత్మ ఆధీనంలో, ఆత్మ పరమాత్మ ఆధీనంలో ఉండాలి. ఇలా జరగాలంటే ప్రాధమికంగా ఈ సాధనలన్నియు ఆవశ్యకమే. భగవంతునిరూపమును ధ్యానిస్తూ, షోడశోపచారములతో భగవంతున్ని సేవించుట ఆధ్యాత్మికసాధనలో ఓ శిక్షణ. చిల్లగింజచూర్ణంచే జలం ఎలా శుద్ధమగునో అలానే ఈ విధమైన సాధనలు వలన అంతఃకరణశుద్ధి అగును, చిత్తైకాగ్రత కలుగును, పుణ్యసంస్కారములు అలవడును. తద్వారా ప్రాపంచిక విషయములయందు విరక్తి కలిగి, వైరాగ్యం అలవడి తత్వజ్ఞానం అవగాహనై జ్ఞానత్వం పొందడముతో ముక్తి లభించును. |
Saturday, November 23, 2013
ALAYA DARSHANAMULA_ARCHANALA AVASHYAKATHA_Sraju Nanda
Subscribe to:
Post Comments (Atom)
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య
NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk
Popular
-
https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh https://youtube.com/playlist?list=PLODsp3YjK2TnQNXgNgTRVlnA0bqZN2Vh3 3 ...
-
AYYAPPA DEVOTIONAL SONGS ayyappa devotional http://www.mediafire.com/?5xbogj52oldlw ayyappa devotional_KJY http://www.mediafire.com/?i1qwkc0...
-
SHIVA DARPANAM - సిరివెన్నెల సీతారామశాస్త్రి Courtesy: ARKUMAR(pathabangaram) శివదర్పణం సంగీతం: శశి ప్రీతం; సాహిత్య సౌరభం: సిరివెన్నెల 1)అగజ...
No comments:
Post a Comment